#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #ఒక్కటే దారి*
ఈ భూమి మీద పడ్డ ప్రతి ప్రాణికీ కలి బంధనాలు తప్పవు. ఆకలితో మొదలై, ఆశల దారుల్లో ప్రయాణించక తప్పదు. ప్రయాణంలో ఒక మజిలీ నుంచి మరో మజిలీకి చేరుకున్నట్లే ఒక సమస్యనుంచి మరో సమస్య వైపుగా సాగించే పయనమే జీవితం. అన్నీ తెలిసినా క్షణకాలం ఆనందం, అంతలోనే వైరాగ్యం కలుగుతాయి. మనసుపై మోహం పొరలు కమ్మేస్తాయి. విషయాసక్తుల వైపే మనసు మొగ్గు చూపుతుంది. పరిస్థితుల పెనుగాలి రాపిడికి వజ్రంలా మారిన వ్యక్తికి కూడా కొన్నిసార్లు మనశ్శాంతి కరవవుతుంది. తనకు తాను ఎన్ని బోధనలు చేసుకున్నా అలజడి తగ్గదు.
అలాంటి బాధతోనే స్వామీజీని ఆశ్రయించాడు ఒక వ్యక్తి. ‘స్వామీ, అన్నిటికన్నా వేగంగా ప్రయాణించగల మనసు ఘోషను నియంత్రించడమెలా?! మనసుకు ఎన్ని బుద్ధులు చెప్పుకొన్నా ఉపశమనం తాత్కాలికం అవుతోంది. శాశ్వత పరిష్కారం తెలియజేయండి’ అని వేడుకున్నాడు. స్వామి ఎదురుగా ఉన్న కిటికీ వైపు చూపించాడు. కిటికీ తెరపై వాలిన కందిరీగ బయటికి వెళ్లేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. కానీ బయట పడలేకపోతోంది. అలసిపోయి కింద పడుతూ, మళ్లీ లేచి అదే తెర మీద వాలి, దానిలోంచి బయటికి వెళ్లే మార్గం కోసం వెతుకుతోంది. ‘నాయనా! మన తీరు కూడా అంతే. ఆ కందిరీగ ఆ పక్కనే ఉన్న పెద్ద రంధ్రం గుండా లోపలికి వచ్చింది. తిరిగి వెళ్లే దారి మరచి ఫలితాన్ని అనుభవిస్తోంది’ అన్నాడు. ‘అంటే, దానిలాగా నాకు కూడా విముక్తి లేదా స్వామీ?’ అన్నాడా వ్యక్తి. ‘ఉంది. తల్లి గర్భంలోని శిశువు- ఈ గర్భనరకాన్ని వీడి బయటపడిన మరుక్షణం నుంచీ నీ నామస్మరణ చేస్తూ, విషయవాంఛలకు దూరంగా ఉంటానని ఆ దైవానికి వాగ్దానం చేస్తుంది. ఇప్పుడు పడుతున్న కష్టాన్ని గుర్తుపెట్టుకుని మరుజన్మ లేకుండా జ్ఞానదృష్టితో ప్రవర్తించి మోక్షాన్ని పొందుతానని ప్రార్థిస్తుంది. భూమ్మీద పడ్డాక అన్నీ మర్చిపోయి, ఇదే శాశ్వతమనుకుంటుంది. ప్రాపంచిక సంబంధ విషయజ్ఞానం ఇహానికి పనికొస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యం తిరిగి వెళ్లే దారి చూపిస్తుంది. ఆ మార్గం తెలుసుకోవడమే అసలైన సంతృప్తి. ఈ దిశగా ఆలోచించి ఆత్మజ్ఞానాన్ని పొంది ఇహపర సుఖాల అర్థాన్ని తెలుసుకో. అంతరాత్మను ప్రశాంతపరచుకో’ అని బోధించాడు స్వామీజీ.
విశాలవిశ్వంలో చిన్న రేణువుగా ఉన్న భూమిపై అత్యంత స్వల్పమైనది మనిషి ఉనికి. అలాంటప్పుడు విషయాలను పెద్దవిగా ఊహించుకుని బాధపడటం అర్థరహితం. భగవద్భావనకు మనసును చల్లబరిచే మహత్తర శక్తి ఉంది. వచ్చిన దారిలో తిరిగి వెళ్లాలనే స్పృహ కలిగి ఉండటమే ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానమార్గంలో పయనించి మనో నిశ్చలత్వంతో జీవించడం మనకు రుషులు, యోగులు చూపించిన సన్మార్గం. ‘లోకాస్సమస్తా సుఖినోభవంతు’ అనే భావనతో జీవిస్తే మనశ్శాంతి దానంతటదే కలుగుతుంది. ప్రశాంత తీరమైన దైవాన్ని చేరుకునే దారి తప్పక కనబడుతుంది. అప్పటివరకూ నలుగురికీ ఉపయోగపడుతూ జీవించాలి. అదే సుఖం, శుభం.🙏🙏🙏