మధ్వనవమి :
భారతీయ దర్శనాల్లో ముఖ్యమైన మూడు సిద్ధాంతాలలో ఒకటి ద్వైత సిద్ధాంతం. దానిని ప్రవచించినవారు శ్రీమధ్వాచార్యులు. వాయుదేవుడే మధ్వాచార్యునిగా జన్మించాడని నమ్ముతారు. ఉడుపి పట్టణానికి సుమారు ఇరవై మైళ్ల దూరంలో పాజక క్షేత్రం ఉంది. అక్కడ నివసించే మధ్యగేహభట్టు, వేదవతి దంపతులకు ఆంగ్లశకం 1238లో వాసుదేవుడనే పేరుతో మధ్వాచార్యులు జన్మించారు. చిన్నతనంలోనే ఎన్నో మహిమలను చూపి అందరినీ అబ్బురపరిచారు. 32 సలక్షణాలతో, నిరుపమానమైన తేజస్సుతో ప్రకాశించే వాడు. ఎనిమిదో ఏట సన్యాసాశ్రమం స్వీకరించారు. ద్వైతమతాన్ని ఉద్ధరించారు. శ్రీహరియే సర్వోత్తముడని ప్రతిపాదించారు. ముప్పై ఏడు గ్రంథాలు రచించారు. భగవద్గీత, ఉపనిషత్తులపై ద్వైతసిద్ధాంతానికి అనుగుణంగా వ్యాఖ్యలు రచించారు. బ్రహ్మ సూత్రాలపై నాలుగు వ్యాఖ్యానాలు అందించారు. భారత, భాగవతాలకు, భగవద్గీతకు తాత్పర్య నిర్ణయం వెలువరించారు. తంత్రసారాన్ని, ఆగమ విధానాలను నిర్ణయిస్తూ ప్రమాణ లక్షణాలనే పేరుతో గ్రంథాలను విరచించారు.
ఆధ్యాత్మిక ప్రగతికి, నైతిక ప్రవర్తనకు భక్తిమార్గమే శరణ్యమని బోధించారు. జంతుబలుల్ని నిషేధించారు. దాస సాహిత్యాన్ని విశేష ప్రాచుర్యంలోకి తెచ్చారు. తుది ఘడియల్ని కూడా ఉడుపి అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుకు భాష్యం చెబుతూనే గడిపారు. ఆరోజు మాఘశుద్ధ నవమి. ఆ పవిత్ర సమయంలో సకల దేవతా సమూహం పుష్పవృష్టి కురిపిస్తుండగా భక్తులందరి సమక్షంలోనే సశరీరంగా అంతర్థానమయ్యారు. దానినే మాధ్వులు మధ్వనవమిగా జరుపుకుంటారు. ఉడుపి అనంతేశ్వరాలయంలో మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మధ్వ నవమి వరకూ 9 రోజులపాటు విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. నవమినాడు పర్యాయ పీఠాధిపతితో పాటు మిగిలిన ఎనిమిది మంది పీఠాధిపతులూ సంస్థానంలో భక్తిశ్రద్దలతో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుమధ్వవిజయం పారాయణ చేస్తారు. మరికొందరు సర్వమత గ్రంథాలనూ పారాయణ చేస్తారు. మంత్రాలయం ఆలయ ప్రాంగణంలో మధ్వాచార్యుల గ్రంథాలను, వారి చిత్రపఠాన్ని స్వర్ణరథంలో ఉంచి వైభవోపేతంగా రథయాత్ర నిర్వహిస్తారు.
#🙏🏻కృష్ణుడి భజనలు #భగవద్గీత