*_04/12/2025 - మార్గశిర పూర్ణిమ- శ్రీ దత్తాత్రేయ జయంతి_*
*శ్రీమహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరవదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం*.
*మార్గశిర శుద్ధ పూర్ణిమనాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. "దత్తం" అంటే ఇచ్చినవాడని. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడైనాడు.*
*దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించి, సేవించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు*.
*దత్తాత్రేయుని సతీమణి అనఘాదేవి. అఘము అనగా పాపము లేనిది. మనసుతో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ*.
*_దత్తుని రూపంలో అంతరార్థం_*
*శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరు భుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే*
*మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.*
*నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు*.
*ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు*.
*మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము*.
*త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.*
*చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును*.
*డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి*.
*కమండలము:సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును*
*దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేపనుంచి త్యాగచింతన నేర్చుకోవాలి. మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి. సాలెపురుగు నుంచి సృష్టి స్థితిలయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలి. ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలి. చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు- జగద్గురువు దత్తాత్రేయ స్వామి!*
*దత్తాత్రేయుడు సతీమదాలస ముద్దులపట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో, దత్తుడిరూపం మూడు శిరసులతో సందేశాత్మకమై ప్రకాశిస్తోంది*.
*దత్తుడు పదహారు అంశలు కలవాడని "దత్తపురాణం" చెబుతోంది. మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభంలో దత్తచరితం విస్తృతంగా ఉంది. ఈ పూర్ణిమనాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సతతం మేలు కలుగుతుందని పురాణోక్తి. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి ‘కోర్ల పూర్ణిమ’గా ప్రసిద్ధి చెందింది.* *మహామార్గశీర్ష పేరుగల ఈ పున్నమిరోజున నరకపూర్ణిమావ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి కథనం*.
*_దత్త తత్వం_*
*_దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !_*
*_తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!_*
*దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని "దత్త హృదయం" లో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా* *“అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ”* *అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని భక్తుల నమ్మకం.*
*మహారాష్ట్రలో దత్తజయంతిని భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకొంటారు. దత్తుడు ‘ఉగ్రదేవత’ అని గర్గసంహిత చెబుతోంది. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం*
#మన సంప్రదాయాలు సమాచారం