🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌾పంచాంగం🌾
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 15 - 01 - 2026,
వారం ... బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిథి : *ద్వాదశి* రా8.13 వరకు
నక్షత్రం : *జ్యేష్ఠ* తె6.13 వరకు
యోగం : *వృద్ధి* రా9.31 వరకు
కరణం : *కౌలువ* ఉ7.08 వరకు
తదుపరి *తైతుల* రా8.13 వరకు,
వర్జ్యం : *ఉ9.50 - 11.37*
దుర్ముహూర్తము : *10.18 - 11.03*
మరల *మ2.44 - 3.28*
అమృతకాలం : *రా8.28 - 10.14*
రాహుకాలం : *మ1.30 - 3.00*
యమగండం : *ఉ6.00 - 7.30*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.41,
*_నేటి విశేషం_*
*ఉత్తరాయన పుణ్య కాల ప్రారంభం*
*మకర సంక్రాంతి*
సంక్రాంతి అభ్యుదయ కాముకులను కూడా సంప్రదాయంవైపు మళ్ళిస్తుంది.
పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయంవైపు మొగ్గుచూపుతారు.
అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది.
ఈ సంక్రాంతి పల్లీయులకు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది.
ఏటికేడాది కష్టించి పండించిన పంటలు ఇళ్ళకు చేరే సమయం ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పడానికి ఇళ్ళ ముంగిట రంగు రంగుల ముగ్గులు ప్రత్యక్షమవుతాయి, చిన్న పిల్లలనుంచి పెద్దల వరకు ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరించి పాటలు పాడతారు.
సుబ్బీ గొబ్బెమ్మా సుఖములియ్యవే తామరపువ్వంటి తమ్ముణ్ణియ్యవే చేమంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే మొగలిపువ్వంటి మొగుణ్ణియ్యవే
అని అంటూ కన్నె పిల్లలు పాటలు పాడుతూ గొబ్బెమ్మలకు పూజలు చేస్తారు.
ఈపాట ప్రాచీనజానపదులు పాడుకున్నపాట. నేటికీఆపాట అలాసంప్రదాయంగా సాగు తూనేవస్తోంది.
అసలుప్రకృతి పరవశించి పూవులుపూస్తుంది, ఈప్రకృతి చిత్రాన్ని బంతి పూవులు లేత నవ్వులతో సంక్రాంతి సుందరి సాగివచ్చింది.
తెలుగు పల్లెలు నిద్రలేచాయి వెలుగులో కనువిచ్చి చూచాయి సంక్రాంతివేళ అని అభ్యుదయ కవి దాశరథి పులకించి పాడాడు.
సంక్రాంతికి ముందే నెల పట్టడం అని ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం నెలరోజులపాటు సాగుతుంది. చివరి రోజున “రథం" ముగ్గు వేస్తారు.
ఆ ముగ్గు ఎవరు ఎంత పొడవుగా వేస్తారు అని పోటీలు పడి వీధుల చివరిదాకా ముగ్గులు వేస్తారు.
ఈ పోటీలలో ఒక సరదా, ఒక నేర్పు ఇమిడి ఉన్నాయి.
ఈ రోజున కమతాగాళ్ళకు ఏడాదికి సరిపడి ధనధాన్యాలను కొలవడం సంప్రదాయం.
ఈనాడు ఈ సంప్రదాయం అంతగా లేకపోయినా పూర్తిగా అంతరించి పోలేదు.
ఈ సంక్రాంతి పండుగ జానపదులకు చాల ముఖ్యమైనది. జానపదుల కళలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి.
వీటిలో చెప్పుకోతగ్గది "గంగిరెద్దుల" ఆట, ఈ సంప్రదాయం నేడు పట్టణ ప్రాంతాలలోనూ కనబడుతూనే ఉంది, ఇది అతి ప్రాచీనమైన కళగా భావిస్తారు.
ఇంక సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది, నక్షత్రాలు ఇరువది ఏడు.
మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి.
తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు, సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు.
సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది.
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి' అని అంటారు.
సూర్యుడు ప్రాణాధారమైనవాడు, సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తాడు.
ఒకరు శక్తి మరొకరు పదార్ధము, మనస్సుకు కారకుడు చంద్రుడు, చంద్రుడు కర్కాటక రాశ్యాధిపతి. సూర్యుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలో కర్కాటక సంక్రమణంలో ప్రవేశిస్తాడు.
అది దక్షిణాయనం, ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి, పడమరకు అధిపతి వరుణుడు, వీరిద్దరి వాహనాలు ఐరావతము, మకరము.
యోగశాస్త్ర ప్రకారం మనశరీరంలోని షట్చక్రములలోని మూలాధారం వద్ద ఏనుగు(ఐరావతం) ఉంటుంది.
సూర్యుడు ధనూరాశినుంచి మకరరాశిలోకి ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు దేవతలకు పగలుగా ఉంటుంది.
అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు ధనూరాశిలో ప్రవేశించేవరకు దేవతలకు రాత్రి.
ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది.
కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని సూచిస్తుంది.
మకర సంక్రాంతి, పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది.
అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటాడు.
రవి ధనురాశిలో ప్రవేశించినప్పటినుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈనెల పొడుగునా వాకిళ్ళముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు.
ఇలా ముగ్గులు పెట్టడమూ అత్యంత ప్రాచీనమైన సంప్రదాయమే.
"పూజాస్థాన విశుద్ధ్యర్ధం దోమయేవ పూజయేత్
తతః పంచవిదై శ్చూర్జెరంగవల్లీం ప్రకల్పయేత్"
*-స్కాందపురాణం-*
అనగా ఈ మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంగా వ్యవహరింప బడుతుంది.
అందుకే ఇది అతి పవిత్రమైనది, హిందువులు అంతా పెద్దలనుండి పిన్నలవరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి" ప్రముఖస్థానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు “మకరరాశిలో” ప్రవేశించిన పుణ్యదినం.
మనకందరకూ తెలుసు! మన భూగోళమందు కర్కాటకరేఖ, భూమధ్య రేఖ,మకర రేఖలు ఉన్నాయని.
సూర్యభగవానుడు సప్తాశ్వాల మహారధం మీద పయనిస్తూ! ప్రతినెలయందు కూడా మేషాదిగా ఉన్న పన్నెండు రాశులయందు ఒక్కొక్కనెల చొప్పున ఉంటూ వస్తాడు.
అలా! ఆయారాశులందు “సంక్రమణాలు” వస్తూ ఉంటాయి. ఇలా మకరరాశితో కలసినప్పుడు ఆ రేఖతో సంక్రమణం చెంది సూర్యగమనం ఉత్తరదిశగా మారి “ఉత్తరాయణ పుణ్యకాలం" మనకు వస్తుంది.
అలాగునే; కర్కాటక రేఖతో కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యగమనం దక్షిణదిశగా ప్రారంభమయి “దక్షిణాయణం” వస్తుంది.
ఈ రెండు (ఒక్కొక్కటి ఆరుమాసాలు) చొప్పున ఆయనాలు పూర్తి అవుతే! ఒక్క సంవత్సరకాలం పూర్తి అవుతుందన్నమాట! అందువల్లనే భీష్మపితామహులు దక్షిణాయనంలో అంపశయ్య మీద పడినా; ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చు వరకు నిరీక్షించి తుదిశ్వాస విడిచారు. ఆకారణంగా; దీనిని పితృదేవతల ఆరాధనా పుణ్యకాలంగా కూడా వ్యవహరిస్తారు. ఇలా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన పుణ్యదినాన్ని "మకరసంక్రమణంగా” “సంక్రాంతి”గా ప్రాధాన్యత పొందింది.
ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి”గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మోక్ష మార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. అలా! కేవలం అప్పుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలికదా! మరి. ఇక ఈ పండుగల ఏమిటో తెలుసుకుందాం!
ఈ "సంక్రాంతి" ఒంటరిగా మాత్రం రాదుట! మహారాణిలా ముందు "భోగిని” వెనుక "కనుమ" ను వెంటబెట్టుకుని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా, వస్తుందట!
సంక్రాంతి :- ఇది మకర సంక్రాంతి పుణ్యదినం! అందువల్ల ఈ రోజు
యధాశక్తి దానధర్మాలు చేయుటవల్ల జన్మజన్మల దారిద్య్ర బాధలు అంటవని! ఆలాగునే "స్త్రీలు" పూలు, పసుపు, కుంకుమ, పండ్లు మున్నగునవి దానం చేయుటవల్ల సకల సంపదలతో పాటు చక్కని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. అలాగునే ఈరోజు పితృదేవతారాధన చేయుటవల్ల వారి శుభాశీస్సులతో! వారి వారి వంశాలు వర్థిల్లుతాయని పండితోత్తములు చెబుతూ ఉంటారు.
కనుమ :- ఈ రోజు అంటే రైతన్నలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. వారి బిడ్డలకు ఏలోటు లేకుండా! పాడిని అందించే "గోమాతను” వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ చివరకు “ధాన్యపురాశులను" ఇంటికి చేర్చువరకు! తోడ్పడే "బసవన్న"కు పూజలు జరిపి పసుపుల పండుగ చేస్తారు. ఆ రోజు ఆ ఇంటి యజమాని, యజమానురాలు కళ్ళలోని సంక్రాంతి కాంతి కిరణాలు! అందరకూ కనువిందుచేస్తూ ఉంటాయి.
ఈ రోజున ఇక పెద్దలు, పిన్నలు పోటీపడుతూ, వారి వారికి అనుకూలమైన సైజులలో "ప్రభలను” కట్టి వాటిపై “పార్వతీపరమేశ్వరుల" ప్రతిమల నుంచి ఇరుగు-పొరుగు గ్రామాలవారితో కలసి ఒకచోట చేరి! మేళతాళాలతో అత్యంత వైభవంగా “ప్రభలతీర్థం” నిర్వహిస్తారు. ఇట్టివి వర్ణింపనలవికావు. గ్రామ సీమలలో చూడవలసిందే!
ముక్కనుమ :- పై మూడు పండుగలు గడచిన నాలుగవ రోజున క్రొత్తగా పెండ్లి అయిన ఆడపిల్లలు "సావిత్రి గౌరివ్రతం” అంటే “బొమ్మల నోము” పడతారు. ఈ దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసి పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు.
ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే; గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా వెల్లలు ఇంటా బయటా వేసుకుని, ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! “సంక్రాంతి” లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు “సంక్రాంతి” నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యా లతో నదీజలాలను “తీర్థంబిందులలో” తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు.
ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరోజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను” ముంగిట చూస్తున్నట్లు
ఈ కన్నెముత్తెదువులు ఆ ముగ్గుల నడుమ ఆవుపేడతో చేసిన “గొబ్బెమ్మ”లను
బంతి, చేమంతులతో అలంకరించి ఇరుగుపొరుగు కన్నెముత్తైదువులను పిలచుకుని "గొబ్బియల్లో...! గొబ్బియల్లో...! అంటూ వివిధ రంగులలో అలంకరించుకుని వచ్చిన దుస్తులతో! ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి పేరంటం పెట్టుకుంటారు.
ఈ పండుగ దినాలలో “కోటి విద్యలు, కోటి వేషాలు కూటికోసమే!” అనునట్లుగా హరిదాసులు హరినామ సంకీర్తనలు చేస్తూ వచ్చి “కృష్ణార్పణం" అంటూ ముంగిట భిక్షను స్వీకరిస్తూ ఉంటారు. ఇక గంగిరెద్దులవారు "బసవన్న”ను ఆడిస్తూ! చిన్నారులను దీవిస్తూ ఉంటారు. ఇలా ! జంగమదేవరలు, బుడబుక్కలవాళ్ళు, కొమ్మదాసరలు, పిట్టలదొరలు, విచిత్ర వేషధారులు మున్నగు కళాకారులంతా! ఈ పండుగ దినాలలో వచ్చి వారివారి కళలను ప్రదర్శిస్తూ! ఎవరికి వారు ఆనందంగా ఇచ్చే కానుకలు స్వీకరిస్తూ! చివరిగా ఒకపాత వస్త్రాన్ని ఇమ్మనికోరి, భుజాన వేసుకుని పోతూ! “సుభోజ్యంగా" ఉండాలమ్మ అంటూ దీవించిపోతూ ఉంటారు. ఇలా ఈ గ్రామ సీమల్లో ఏ కళాకారునీ రిక్తహస్తాలతో పంపకుండా! కలిగినదానిలో కలిగినంత ఇచ్చి పంపుతారు. అది వారి సదాచారం.
ఇంత చక్కని ఆనందాన్ని మనకు అందించే "సంక్రాంతి” పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.
*_🌾శుభమస్తు🌾_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023

