ShareChat
click to see wallet page
భగవాన్ రమణ మహర్షి 146వ జయంతి : యోగులు అంతర్ముఖులై విశ్వంలోని మెళకువలను గ్రహించాలి. బహిర్ముఖులై వాటిని ప్రపంచానికి అందించాలి. ఆధునిక కాలంలో అటువంటి యోగి లక్షణాలు పరిపూర్ణంగా కలిగినవారు రమణ మహర్షి. మౌనయోగిగా ప్రసిద్ధి పొందారు. రమణ మహర్షి పూర్వనామం వెంకట్రామన్ అయ్యర్. మదురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిసెంబర్ 30న జన్మించారు. బాల్యంలో మంచి దేహదారుఢ్యంతో ఉండేవారు. ఒకసారి అనుకోని రీతిలో మరణానుభవానికి లోనయ్యారు. ఆ తరువాత చదువుమీద పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. 1895లో స్కూలుఫీజు కోసం పెద్దలిచ్చిన డబ్బుతో వెంకట్రామన్ అరుణాచలం చేరుకున్నారు. అప్పటికే అరుణాచలం పేరు ఆయనకు పంచాక్షరిగా వినిపించేది. అరుణాచలేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకుని, ‘‘స్వామీ! నీ ఆజ్ఞానుసారం వచ్చేశాను. ఇక నీ ఇష్టం’’ అంటూ ప్రణమిల్లారు. తరువాత ఆలయంలోని ఒక గుహలోకి వెళ్లిపోయారు. వెంకట్రామన్ ఎనిమిది సంవత్సరాలపాటు తపస్సమాధిలో ఉండిపోయారు. ఎలాంటి సంస్కారం లేని శరీరం శల్యావశిష్టమై పోయింది. మహాయోగి శేషేంద్రస్వామి వెంకట్రామన్ ఉనికిని, సమాధిస్థితిని గమనించారు. ఆయనను బాహ్యజగత్తుకు రావించి, ‘‘ఇకపై జగత్తు ఈ మహనీయుని నీడలో వెలుగొందుతుంది’’ అని లోకానికి పరిచయం చేశారు. అక్కడినుంచి మరోప్రస్థానం ప్రారంభమైంది. అరుణాచల గుహలోనే మౌనస్వామిగా అఖండ తపస్సు సాగించారు. అనంతరం ధ్యానయోగ తపస్సులకు మూలాలు గ్రహించిన సాధకునిగా లౌకిక ప్రపంచంలో అడుగుపెట్టారు. అగ్ని సరస్సున ప్రభవించిన వజ్రంలా, ఆకులచాటున సంపూర్ణఫలంగా రూపొందిన చందంగా రమణమహర్షి ఆర్తిజనోద్ధరణకు ప్రజల మధ్యకు వచ్చారు. భగవాన్ రమణులకు సన్నిహితంగా మెలిగిన వారిలో పరమహంస యోగానంద, శివానంద, కోహెన్, చాడ్విక్, పాల్ బ్రంటన్, సూరినాగమ్మ, కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని, నారాయణ గురు ప్రముఖులు. ఆయన 1950 ఏప్రిల్ 14న దేహత్యాగం చేశారు. నేటికీ అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ఉంది. నిన్ను నీవు తెలుసుకో! అని రమణ మహర్షి సందేశమిచ్చారు. #భగవాన్ రమణ మహర్షి #🔱హిందూ దేవుళ్ళు🙏🏻 #🙏🏻భక్తి సమాచారం😲 #🕉️ శ్రీ భగవాన్ రమణ మహర్షి
భగవాన్ రమణ మహర్షి - ShareChat

More like this