ShareChat
click to see wallet page
హయగ్రీవుడు..........!! హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి... వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడుని జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఆయనకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే, తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి, హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. అంటే హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట! ఆ హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానమూ ఇటు విజయమూ రెండూ లభిస్తాయన్నది పెద్దల మాట. హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా! హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి... కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కానీ పఠించాలి. ఏదీ కుదరకపోతే కనీసం- జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్| ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే || అనే మంత్రాన్ని పఠించాలి. హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబ్టటి, వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు చెప్పుకొన్నట్లుగా హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. ఆ రోజు ఆయనను ఆరాధించినవారికి సకల విద్యలూ అబ్బుతాయనీ, అన్ని ఆటంకాలూ తొలగిపోతాయనీ చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వల్ల సిరిసంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. మరెందుకాలస్యం! హయగ్రీవుని ఆరాధించి మీ మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకోండి. శ్రావణ్యాం శ్రవణ జాత: పూర్వం హయశిరా హరి: జగాద సామవేదంతు సర్వ కల్మష నాశనం స్నాత్వా సంపూజ యేత్‌ తంతు శంకచక్ర గదాధరం!! అని కల్పతరువు అనే గ్రంథంలో చెప్పబడింది. శ్రావణ పూర్ణిమ నాడు శ్రవణా నక్షత్ర యోగమున శ్రీహరి హయగ్రీవ రూపంలో అవతరించారు. హయశిరము గల హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మగూర్చి తపస్సు చేసి తన వంటి ఆకారం ఉన్న వానితోనే తాను మరణించాలని వరం కోరుకున్నాడు. తనవంటి వాడు ఇంకొకడు ఉండడు కావున తనకు మరణం లేదన్న గర్వంతో ఎన్నో దుష్కుృత్యములను ఆచరిస్తూ లోకాలను పీడించాడు. బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో అతని నిశ్వాసముల నుంచి వచ్చిన వేదములను అపహరించుకుని సముద్రంలో దాక్కొనెను. బ్రహ్మ ప్రార్థించగా శ్రీమహా విష్ణువు హయగ్రీవ రూపంతో అవతరించి సముద్రంపైన నిలిచి సామగానం చేసెను. ఆ సామనాద మాధుర్యానికి మైమరిచిన హయగ్రీవ రాక్షసుడు ఆ గానాన్ని దగ్గరనుంచి వినాలని సముద్రంపైకి వచ్చెను. అపుడు హయగ్రీవ స్వామి సముద్రం లోపలికి వెళ్ళి దాచి ఉంచిన వేదాలను తీసుకుని వస్తుండగా రాక్షసుడు ఎదురై పోరు సలిపెను. ఆ విధంగా ఆ యుద్ధంలో రాక్షసుడను సంహరించి వేదాలను బ్రహ్మకు అందించినవాడు హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామి సకల విద్యాది దేవత. విద్య, జ్ఞానం కావాలన్నా హయగ్రీవ స్వామిని ఆరాధించాలి. సుప్రసిద్ధమైన మహా పండితులు, వేదాంత దేశికులు అనే వారు గరుడ మంత్రాన్ని జపించగా గరుత్మంతుడు ప్రత్యక్షమై వేదాంత దేశికులకు హయగ్రీవ మంత్రమును ఉపదేశించెను. ఆ మంత్రమును జపం చేసి హయగ్రీవ సాక్షాత్కారాన్ని పొంది ఆ స్వామి అనుగ్రహంతో అద్భుతమైన కావ్యములు, స్తోత్రములు రచించి ప్రసిద్ధి పొందారు. ఒకానొక సందర్భంలో వేదాంత దేశికులు రాత్రి 11 నుంచి తెల్లవారు జామున 4 లోపు స్వామివారి పాదుకల పైన ‘పాదుకా సహస్రం’ అని వెయ్యి శ్లోకములను అందించెను. ఇంతటి విజ్ఞాన, కవితా, మేధా వైభవం, వాగ్వైభవం హయగ్రీవ స్వామిని ఆరాధించినచో కలుగును. *జ్ఞానానంద మయం దేవం* *నిర్మల స్ఫటికా కృతం* *ఆధారాం సర్వ విద్యానాం* *హయగ్రీవ ముపాస్మహే!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం #om sri gurubhyo namaha #లక్ష్మీ హయగ్రీవ స్వామి #హయగ్రీవ స్వామి
తెలుసుకుందాం - 6   6 - ShareChat

More like this