#ఏపీ అప్ డేట్స్..📖
*ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇక కష్టకాలమే..⁉️*
NOVEMBER 15, 2025🎯
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇక కష్టకాలమే. కరిస్తే కప్పకు, విడిచిపెడితే పాముకు కోపం అనే చందంగా రాజకీయాలు తయారయ్యాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఒక రకమైన వేధింపులు. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే వేధింపులు, అలాగే ఆర్థిక ప్రయోజనాలు నెరవేరుతాయని ఉద్యోగులు నమ్మారు. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు.
అనుకున్నదొకటి, అవుతున్నది మరొకటి.
వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసే క్రమంలో తమను బలి పెడుతున్నారని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో పని చేసిన ఉద్యోగులంతా దొంగలన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఉద్యోగుల వ్యతిరేక పాలన సాగిస్తున్నామనే స్పృహ పాలకుల్లో కొరవడిందనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాదొడ్డిపై అక్కసుతో ఏకంగా ముగ్గురు పాత మున్సిపల్ కమిషనర్లు, అలాగే వివిధ హోదాల్లో పని చేస్తున్న, అలాగే పదవీ విరమణ చేసిన 43 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఫిర్యాదు మేరకు సాగుతున్న తతంగం ఇది. ఇదేమంటే అక్రమాలపై చర్యలు తీసుకోవద్దా? అనే ప్రశ్న వస్తోంది. అక్రమాలపై చర్యలు తీసుకోడాన్ని ఎవరూ వద్దనరు. ఆ సాకుతో కక్షసాధింపునే తప్పు పడుతున్నారు.
అలాగే అభ్యంతరకర పోస్టులపై అరెస్ట్ అయిన ఎన్ఆర్ఎ మాలెంపాటి భాస్కర్రెడ్డిని ఆయన గ్రామం నుంచి జైలుకు తరలిస్తూ మార్గంమధ్యలో టిఫెన్ చేయించడాన్ని ప్రభుత్వం నేరంగా భావించింది. ఎస్కార్ట్ సిబ్బందిపై పోలీస్ అధికారులు నిఘా పెట్టి మరీ ఫొటోలు తీసుకుని, ఐదుగురు పోలీస్ సిబ్బందిపై వేటు వేయడం గమనార్హం.
పరకామణి కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటున్న గుంతకల్లు రైల్వే సీఐ సతీష్కుమార్ అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనం రేపుతోంది. సిట్ అధికారుల వేధింపులతోనే బలవన్మరణం చెందినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసులో నిజాలు చెబుతారనే భయంతో వైసీపీ నాయకులే హత్య చేయించారని కూటమి నేతల ఆరోపణలు. మొత్తానికి పరకామణి కేసులో తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది.
వైసీపీకి అనుకూలమని రాజకీయ ముద్ర వేసి వివిధ స్థాయిల్లోని పోలీస్ అధికారులకు అసలు పోస్టింగ్లో లే ఇవ్వలేదు. అలాగే కొందరిపై నెలల తరబడి సస్పెన్షన్
చేయడం, ఉద్యోగులపై ఏదో రకంగా కక్షసాధింపులు. నిజానికి ఎన్నికల ముందు కూటమికి ఉద్యోగులు భారీస్థాయిలో అండగా నిలిచారు. కులాలకు అతీతంగా కూడా మద్దతుగా నిలిచారు.
కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కృతజ్ఞత చూపకపోగా, తీవ్రంగా వేధిస్తోందన్న ఆవేదన ఉద్యోగుల్లో వుంది. ఇలాగైతే ఉద్యోగాలు చేయలేమన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడుతోంది. భవిష్యత్లో అధికారం మారితే, ఆ ప్రభుత్వానికి ఉద్యోగులే టార్గెట్. పాలకుల రాజకీయ కక్ష, కార్పణ్యాలకు తమను బలి చేస్తున్నారన్న ఆవేదనతో ఉద్యోగులున్నారు. మరోవైపు పాలకుల మెప్పుకోసం తమను కొన్ని శాఖలకు చెందిన అధికారులు వేధిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అంతుచూస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు విధులు నిర్వహించడం కత్తిమీద సామే. మనశ్శాంతి లేకుండా పోతోందని ఉద్యోగులు వాపోతున్నారు.

