#జనసేన V #టీడీపీ
*పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై టీడీపీ సెటైర్స్❗*
SEPTEMBER 21, 2025🎯
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య సత్సంబంధాలున్నాయి. కానీ కిందిస్థాయిలో మాత్రం టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య, ముఖ్యంగా సోషల్ మీడియాలో వార్ ఓ రేంజ్లో సాగుతోంది. వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లారు. టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించి కాస్త గుర్తింపు ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు పరస్పరం తిట్టుకుంటూ పోస్టులు పెట్టుకోవడం చర్చకు దారి తీసింది.
వీళ్ల గొడవల్ని గమనిస్తే, కేవలం రాజకీయ అవకాశవాదంతో కలిసి ఉన్నారనే అభిప్రాయం కలగకుండా ఉండదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పక్కపక్కనే కుర్చీలలో కూచోవడం మొదలుకుని, అసెంబ్లీ సమావేశాల్లో పవన్ను టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అందుబాటులో ఉండరనే వరకూ……… జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు సీరియస్ గా తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, ఇతర టీడీపీ నాయకుల్ని తిట్టిపోస్తున్నారు.
బొండా ఉమా నోటిని అదుపులో పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబును జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు హెచ్చరించే వరకూ వెళ్లింది. 20-30 శాతం ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా జనసేన నాయకులు చెబుతుండడం గమనార్హం.
అలాగే తాను ఖరీదైన కుర్చీలో, రాజసం ఉట్టిపడేలా చంద్రబాబు కూచోవడం, పక్కన విసిరేసినట్టు పవన్ను కూచోపెట్టుకోవడాన్ని జనసేన యాక్టివిస్టులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. కూచునే కుర్చీల్లో ఏముంది? బెయిల్పై, దాంతో సంబంధం లేకుండా రాజకీయాలు చేసే నాయకులెవరో తెలుసుకోవాలంటూ పరోక్షంగా చంద్రబాబును జనసేన గుచ్చుతోంది.
తమ నాయకుడిని ఒక మాటంటే, పది తిడ్తామని టీడీపీ వైపు నుంచి రియాక్షన్ వస్తోంది.
“మా చంద్రుడు ఏకపత్నీవ్రతుడు. మిగిలినోళ్లు నాకు తెలియదు” అని ఐటీడీపీ ప్రతినిధి ఉండవల్లి అనూష ఘాటు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ జనసేన యాక్టివిస్టు పోస్టుకు కౌంటర్ చేయడం విశేషం. అంతేకాదు, టీడీపీ కార్యాలయం నుంచి ఎవరైనా ఫోన్ చేసి పోస్టు డిలీట్ చేయాలంటే, ముందు తమ నాయకుడిపై చేసిన పోస్ట్ కథ చూడాలని చెబుతాననడం చర్చనీయాంశమైంది. రాజు పెద్ద భార్య మంచిదంటే, మరి చిన్న భార్య అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
చంద్రబాబు ఏకపత్నీవ్రతుడనే మాట వరకే ఆమె పరిమితం కాలేదు. మిగిలినోళ్లు తనకు తెలియదని చెప్పడం ద్వారా, పవన్కల్యాణ్ పర్సనల్ లైఫ్ను ఆమె స్ట్రాంగ్గా టచ్ చేసినట్టైంది. ఇంతకూ టీడీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో వార్ ఎందుకు జరుగుతున్నదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కానీ బాగా గ్యాప్ పెరుగుతోందన్న వాతావరణం కనిపిస్తోంది.
