#ఆంధ్రప్రదేశ్ #తెలంగాణా
*ఒకే వీధి.. రెండు గ్రామాలు.. రెండు రాష్ట్రాలు..❗*
చాట్రాయి: జంట నగరాల పేర్లు వినే ఉంటాం.. అలానే రెండు రాష్ట్రాల నడుమ, రెండు గ్రామాల మధ్య కొంతైనా సరిహద్దు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురం, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలేనికి కేవలం రహదారే హద్దు.
కుడి వైపు కృష్ణారావుపాలెం ఉండగా, ఎడమ వైపు వెంకటాపురం ఉన్నాయి. రహదారి మీద మూట భుజాన పెట్టుకున్న వ్యక్తి ఆంధ్రలో నుంచి బయలుదేరి తెలంగాణలోకి సెకన్లలో చేరుతున్నాడు.
ఓ ఇంటిలో ఉదయం సమయంలో కల్లాపు చల్లితే పక్క రాష్ట్రంలో పడేంత చేరువలో ఉన్నాయి. ఇక్కడి ప్రజలందరూ కలిసి కట్టుగానే ఉంటారు. సంబరాలు, పండగలూ కలసి మెలిసి నిర్వహించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే బయట వ్యక్తులు వస్తే ఇవి రెండు రాష్ట్రాల నడుమ రెండు గ్రామాలుగా చెబితే తప్ప తెలియదు. ఇక రాష్ట్ర విభజన వరకూ ఇక్కడి విద్యార్థులు వెంకటాపురంలోనే ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత చనుబండ ఉన్నత పాఠశాలకు స్థానికత కోసం వస్తున్నారు.
