🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 27 - 10 - 2025,
వారం ... ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం
తిథి : *షష్ఠి* తె3.07 వరకు
నక్షత్రం : *మూల* ఉ10.29 వరకు
యోగం : *సుకర్మ* తె5.41 వరకు
కరణం : *కౌలువ* మ2.27 వరకు
తదుపరి *తైతుల* తె3.07 వరకు
వర్జ్యం : *ఉ8.44 - 10.29*
మరల *రా8.46 - 10.29*
దుర్ముహూర్తము : *మ12.07 - 12.53*
మరల *మ2.25 - 3.11*
అమృతకాలం : *లేదు*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం : *6.00*
సూర్యాస్తమయం : *5.29*
*_నేటి విశేషం_*
*స్కంద షష్ఠి*
*స్కంద షష్టి కార్తీక మాస శుక్ల షష్ఠి రోజున తమిళనాడులో జరుపుతారు.* మన తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాము కానీ ఈ స్కంద షష్ఠి వేరు , సుబ్రహ్మణ్య షష్ఠి వేరు అని గమనించాలి. ఆదిదంపతులైన ఆ శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించే అతి పవిత్రమైన రోజు ఈ స్కంద షష్టి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే మనం జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి అయినా , తమిళనాడులో జరిపే స్కంద షష్ఠి అయినా రెండిటిలోనూ సుబ్రహ్మణ్యుని ఆరాధన ఒకే విధంగా ఉంటుంది. అంతే కాదు , ఏ మాసంలో అయినా షష్ఠి తిథి రోజున ఇలా ఆరాధించడం అత్యంత ఫలప్రదం.
*శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము.*
తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలనూ భయభ్రాంతులకు గురిచేస్తూ లోకకంటకుడుగా ఉన్నాడని దేవతలు అందరూ బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు.
ఈ తారకాసురుడు అమిత బలశాలి , తపోబల సంపన్నుడు. ఈశ్వర తేజాంశ వలన సంభవించిన వాని వల్ల మాత్రమే మరణము పొందగలడు అని వరము కలిగి ఉన్నాడు. అందుచేత , మీరందరూ ఆ మహాశివుని శరణు వేడి , ఆయనకు మరియు హిమవంతునకు పార్వతీ దేవి రూపమున జన్మించిన సతీదేవికీ , వివాహం జరిపించిన , వారికి కలిగే సంతానము ఈ లోకకంటకుని సంహరించగలడు అని సెలవిచ్చాడు. అప్పటికే తపోనిష్ఠలో ఉన్న పరమశివునికి , వారిని సేవిస్తూ సర్వోప చారములూ చేస్తున్న పార్వతీ దేవికీ మధ్య ప్రణయ బంధాన్ని పెంపొందించే విధంగా మన్మధుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో మన్మధుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నప్పటికీ , పార్వతీ పరమేశ్వర వివాహం సుసంపన్నమయింది. వారి వివాహానంతరమూ దేవతల విన్నపము మేరకు మన్మధుని పునర్జీవిమ్పజేస్తాడు మహాశివుడు.
అటు పిమ్మట పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయాన అగ్నిదేవుడు ఒక పావురము రూపమున ఆ ప్రణయ మందిరమందు ప్రవేశిస్తాడు. అది గ్రహించిన మహాశివుడు తన దివ్య తేజస్సును అగ్నియందు ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. గంగానది తనలోకి చేరిన ఆ తేజమును ఆ సమయంలో నదీస్నానం ఆచరిస్తున్న షట్ కృత్తికలనబడే దేవతల గర్భాన ప్రవేశపెడుతుంది. ఆ రుద్ర తేజమును తాళలేక ఆ దేవతా స్త్రీలు రెల్లు పొదలయందు విడిచిపెడతారు. ఈ ఆరు తెజస్సులు కలిసి ఆరు ముఖాలు కలిగిన దివ్య బాలునిగా ఉద్భవిస్తాడు. ఆరు ముఖములు కలిగిన వాడు కావున షణ్ముఖుడు అని పిలువబడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీపరమేశ్వరులు ఆ బాలుని కైలాసానికి తీసుకునివెళ్లి పెంచుకుంటారు.
ఈ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గాంగేయుడు అని , షట్ కృత్తికలు పెద్ద చేసిన కారణాన కార్తికేయుడు అని , ఆరు ముఖాలు కలిగి ఉండటం వలన షణ్ముఖుడు అని , గౌరీశంకరుల పుత్రుడు అయిన కారణాన కుమార స్వామి యని పిలువబడతాడు.
ఈతడిని దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు శూలం , పార్వతీ దేవి శక్తి , మరియు ఇతర ఆయుధాలను అందించి సర్వశక్తి సంపన్నుడిని చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా చేస్తారు. దేవసైన్యానికి సైన్యాధ్యక్షుడైన ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడనే అసురుడితో రకరకాలైన శక్తులతో మరియు రూపాలతో పోరాడి సంహరించాడు. యుద్ధ మధ్యలో సర్ప రూపం దాల్చి రాక్షస సేనను చుట్టుముట్టి వారిని సంహరించాడు.
ఆయన రెల్లుపొదలలో జన్మించడం చేత ఆయనను శరవణభవుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారం అనంతరం బ్రహ్మ పట్ల తన అహంభావాన్ని ప్రదర్శించడంతో ఆతని తండ్రి అయిన ఆ మహాశివుడు హెచ్చరించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని కఠోరమైన తపస్సును చేస్తాడు. శరీరంలో కొలువై నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలిపి సమస్త దుర్గుణాలను జయించాడు. ఆయన మహాకఠోర తపస్సాధన వలన సహస్రాకారం చేరుకొని బుద్ధిని వికసింపజేసుకున్నాడు. స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన బుద్ధి కలవాడిగా మారిన కారణంగా ఆయనను సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు.
తారకాసుర సంహారసమయానికి ఆయన బ్రహ్మచారి. అటు తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిన కారణంగా ఆయన వల్లీ మరియు దేవసేనలను వివాహమాడెను. ఈ *స్కంద షష్టి నాడు నాగ ప్రతిమలను మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకుని ఆయన ఆరాధన చేయడం మనం చూస్తూ ఉంటాము.*
*స్కంద షష్ఠి పూజా విధానం :*
స్కంద షష్టి నాటి ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని పువ్వులు , పళ్ళు మరియు పడగల రూపాలను స్వామికి సమర్పించవచ్చు.
పిండి దీపం అంటే వరి పిండి , బెల్లము కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలు చేసి , నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇవి ఉదయం మరియూ సాయంత్రం వేళల్లో వెలిగించవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి , సుబ్రహ్మణ్యుని చరిత్ర , స్తోత్రాలు పఠించాలి. వీలైతే సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. చలిమిడి , చిమ్మిలి , వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఈనాడు వల్లీ మరియు దేవసేనా దేవిలతో సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా జరిపించడం చూస్తాము.
బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవారు ఈనాడు బ్రహ్మచారి పూజ చేసి ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజాదికాలు అర్పించి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం ఒక ఆచారం. కొన్ని ప్రాంతాలలో షష్టినాటి రోజంతా ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు అనగా సప్తమి నాడు బ్రహ్మచారి పూజ చేసుకోవడం కూడా చూస్తాము.వైవియస్ఆర్
ఎంతో ప్రసిద్ధి కాంచిన కావడి మొక్కు తీర్చుకునే రోజు తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈరోజే చూస్తాము. ఈ కావడి కుండలను పంచదార , పాలు , పెరుగు , పూలు , వెన్న , నెయ్యి , తేనె ఇలా వివిధ ద్రవ్యాలతో నింపుతారు. ఈనాటి రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ట చేసినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చాల ప్రాంతాలలో ఉంది.
ఈ వ్రతం సందర్భంగా ఎంతోమంది కంబళ్ళు , దుప్పట్లు లాంటివి దానంగా పంచిపెట్టడం చూస్తాము.
ఇది ఒకరకం గా సమాజ శ్రేయస్సు గా కూడా చెప్పుకోవచ్చు. చలి మొదలై బీదలు సరైన నీడ లేక ఇబ్బంది పడే ఈ సమయం లో ఇటువంటి దానాలు భక్తులకున్న భక్తిని మరియు సమాజ శ్రేయోదృక్పదాన్ని కూడా చాటి చెప్పుతాయి.
*ఇంతటి పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్తోత్రాలు మరియు సంతాన సాఫల్యం కలగజేసే షష్టి దేవి స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం !*
*ఓం శరవణభవ*🙏☘️
*_☘️శుభమస్తు☘️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023

