ShareChat
click to see wallet page
🙏🌺మార్గశిర గురువారం వ్రతం🌺🙏 🌺మార్గశిర లక్ష్మీవారం పూజ అనేది మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించడం. సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీపూజ చేయడం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో మాత్రం గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతారు. ఈ క్రమంలో మార్గశిర గురువారం వ్రతం. 🌺 🌺 శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మార్గశిర మాసం ఆయన సతీమణి మహాలక్ష్మీ దేవికి సైతం ఇష్టమైనదే! అయితే.. ఈ మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి నాలుగు లేదా ఐదు గురువారాల పాటు భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో పూజించిన వారికి ఆ లక్ష్మీదేవమ్మ కోరిన కోరికలు తీరుస్తుందని.. వరాల జల్లు కురుపిస్తుందని నమ్మకం. ఈ మార్గశిర మాసంలో ఆచరించే మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం వల్ల మిగిలిన పదకొండు మాసాల్లోనూ అష్టలక్ష్మీవైభవం కలుగుతుందట.. ఈ నేపథ్యంలో మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీ వార వ్రతం పూజ విధానం, చదవాల్సిన మంత్రాలు. 🌺 🌺మొదటి గురువారం - నవంబర్‌ 27 రెండో గురువారం - డిసెంబర్‌ 4 మూడో గురువారం - డిసెంబర్‌ 11 నాలుగో గురువారం - డిసెంబర్‌ 18 మొదటి గురువారం - పులగం నివేదించాలి రెండో గురువారం - అట్లు, తిమ్మనం నివేదించాలి మూడో గురువారం - అప్పాలు, పరమాన్నం నివేదించాలి నాలుగో గురువారం - చిత్రాన్నం, గారెలు నివేదించాలి🌺 🌺మార్గశిర మాసంలో గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మం ముందు, తులసి కోట వద్ద, పూజ మందిరంలో ఆవు నెయ్యితో దీపాలను పెట్టాలి. ఇంటి తూర్పు భాగం లేదా ఈశాన్య భాగంలో ముగ్గు వేసి, పీట వేసి, వస్త్రము పరచి దానిపై కొత్త ధాన్యం పోయాలి. తర్వాత లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రపటం ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు చుట్టూ బియ్యపు పిండితో ముగ్గు వేసి.. పూలు పండ్లతో అలంకరించాలి. 🌺 🌺 అనంతరం మహాగణపతి పూజతో వ్రతం ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడి పూజ అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిర్వహించాలి. 🌺 🌺హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటూ ప్రార్థన చేసి లక్ష్మీదేవి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, కర్పూర నీరాజనం సమర్పించాలి. 🌺 🌺ఇప్పుడు శక్తివంతమైన లక్ష్మీ దేవి మంత్రాలు చదవాలి. ముఖ్యంగా *ఓం మహాదేవ్యే చ విద్మహే.. విష్ణు పత్నేచ ధీమహే.. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్‌* *ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః||".* అనే లక్ష్మీ గాయత్రీ మంత్రం చదువుతూ అమ్మవారికి మంత్ర పుష్పం సమర్పించాలి. ఆ తర్వాత సహస్ర దళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని భక్తితో చదువుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామావళి పఠించాలి. 🌺 🌺 *మార్గశిర మాసం వ్రత కథ* ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి ప్రతిమను చేసి ఆరాధిస్తూ ఉండేది. బాలిక సవతి తల్లి ప్రతిరోజు తన బిడ్డను ఆడిస్తూ ఉండమని చెప్పేది. చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. బాలిక ప్రతిరోజు ఆమె ఇచ్చిన బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా పెట్టేది. ఆమె పెళ్లి తరవాత లక్ష్మీదేవి బొమ్మను కూడా ఆమెతో తీసుకుపోయింది. అప్పటి నుంచి నిత్యదారిద్య్రం దాపురించింది. పుట్టింటివారు దారిద్య్రంతో బాధపడుతున్నారని ఆమె తన తమ్ముణ్ణి రప్పించి, ఒక వెదురుకర్రను దొలిపించి, అందులో బంగారు నాణెములు పోసి ఇచ్చింది. మార్గమధ్యమున అతను కాలకృత్యములను తీర్చుకోవడానికి ఒకచోట ఆగి, చేతికర్రను ఒకచోట ఉంచగా.. దానిని ఓ బాటసారి తీసుకుపోయెను. చేతికర్ర లేకపోవడం చూసి నిరాశగా తమ్ముడు తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్నాళ్ళ తరువాత పుట్టింటివారి పరిస్థితిలో మార్పు లేదని గ్రహించి అక్క మళ్ళీ తమ్ముడిని రమ్మని, ఒక చెప్పుల జతలో బంగారు నాణెములు పోసి, దాన్ని వస్త్రంతో మూటకట్టి నాన్నగారికి ఇవ్వమని చెప్పింది. దారిలో దప్పిక తీర్చుకొనుటకు ఒక కొలను దగ్గర ఆగి, మూటను గట్టుపై పెట్టి నీళ్లు తాగుతుండగా మూటను ఎవరో దొంగలించారు. 🌺 🌺మళ్ళీ తమ్ముడిని రమ్మని ఒక గుమ్మడికాయను దొలిపించి అందులో రత్నాలు పోసి ఇచ్చింది. ఈసారి గుమ్మడికాయను ఒక బీద బ్రాహ్మణుడు తీసుకు వెళ్తాడు. తన దురదృష్టానికి తానే నిందించుకుంటూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా కాలం తరువాత తల్లి మార్గశిరమాసంలో కూతురు ఇంటికి వెళ్లారు. ఆమె సవతి తల్లితో అమ్మా..! ఈ రోజు మార్గశిర లక్ష్మివారము. కనుక నోము నోచుకుందాము. నీవు ఎటువంటి ఆహారము తీసుకోకు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి తన మనవలు, మనవరాళ్ళకి చద్దన్నాలు పెడుతూ అనుకోకుండా ఒక ముద్ద తినేసింది. చేసేది ఏమీ లేక రెండవ లక్ష్మివారం జరుపుకుందామని చెప్పింది. 🌺 🌺రెండవ లక్ష్మివారం తల్లి పిల్లలకు తలంటుతూ, గిన్నె అడుగున మిగిలిన నూనె ఊడ్చి రాసేసుకుంది. ఇక మూడవవారం నోచుకుందువు అని సముదాయించింది. మూడవవారం తల్లి పొరపాట్లు చేయకుండా ఉండాలని.. ఆమెను ఒక గోతిలో కూర్చోబెట్టి, పైన బల్లలు మూతలాగా పెట్టింది. అటు వైపు వచ్చిన పిల్లలు అరటిపళ్ళు, కొబ్బరిముక్కలు తింటూ తినగా మిగిలిన తొక్కలు, ముక్కలు గోతిలో పడేసారు. ఆకలితో ఉన్న తల్లి వాటిని తినేసింది. 🌺 🌺నాలుగవ లక్ష్మివారం తల్లి కొంగును, తన కొంగుకి ముడివేసుకొని తనతో తిప్పుకుంటూ, ఇంటి పనులు పూర్తి చేసి పూజకు కూర్చుంది. విచిత్రంగా లక్ష్మీదేవి వెనుకకు తిరిగి పోయింది. ఇది చూసిన కూతురు ఆశ్చర్యపోయింది. చేసిన తప్పు ఏంటని అమ్మవారిని కూతురు అడిగింది. నీ సవతితల్లి ఒక మార్గశిర లక్ష్మివారం నాడు నీ శరీరంపై పేడనీళ్ళు జల్లి, చీపురుకట్టతో కొడుతూ నానా తిట్లు తిట్టింది. అందుకే నీ తల్లి పూజను నేను స్వీకరించలేను అని చెప్పారు. దీనికి పరిష్కారం చెప్పమని కుమార్తె అడుగగా.. నీ తల్లిని నీకు ఆమె చేసినట్లే చేస్తే శాంతిస్తానని చెప్పారు. అమ్మవారు చెప్పినట్లు దండించెను. పుష్యమాసంలో మొదటి గురువారం తల్లి, కూతురు అమ్మవారిని పూజించారు. అప్పుడు అమ్మవారు కరుణించి ఇద్దరినీ కూడా ఐశ్వర్యవంతులను చేసారు. 🌺 🌺అలాగే మార్గశిర లక్ష్మీ వార వ్రత కథ చదువుకుని అక్షతలు శిరసున వేసుకోవాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి. ఇలా మార్గశిర మాసంలో అన్నీ గురువారాల్లో ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీ వార వ్రతం ఆచరిస్తారో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలు, ఇహలోకంలో సర్వ సుఖాలు పొంది, చివరిగా మోక్షం పొందుతుందని శాస్త్రవచనం. 🌺 🌺కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ వార వ్రతం ఆచరిద్దాం.. లక్ష్మీ కటాక్షం పొందుదాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః! 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 ___________________________________________ HARI BABU.G __________________________________________ ##మార్గశిర లక్ష్మీ పూజ #మార్గశిర గురువారం లక్ష్మీ పూజ #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #గురు పౌర్ణమి శుభాకాంక్షలు 1 #🙏🏻గురువారం భక్తి స్పెషల్
#మార్గశిర లక్ష్మీ పూజ - ShareChat

More like this