ShareChat
click to see wallet page
search
మౌని - ముని "భగవాన్ ఘనీభవించిన మౌనం. అరుణగిరీ అంతే! అరుణాచలేశ్వరుడూ అంతే! మహర్షిది స్వాత్మానందం. వారిది సహజ స్థితి. ధ్యానం, యోగం, తపస్సు అనే స్థితుల కంటె పరమ చరమమైన తుర్యాతీత స్థితి. అది ఆనంద భూమిక. పరమానంద పతాక. అలలు, కెరటాలు లేని కరుణా సముద్ర ముద్ర వారిది. తన లోతులలో తానై నిలచిన నిర్మల, నిశ్చల ఆనంద బిందువు. ఇది భగవాన్ అంతర్ముఖ పటం. చైతన్యం భగవచ్ఛక్తిగా, ఆ శక్తే జీవన్ముక్తుడిగా, అట్టి ముక్తుడే మానవ దేహంతో సంచరిస్తే, అది భగవాన్ రమణ మహర్షి. తమ 17వ ఏట తాము పొందినది ఆత్మానుభవం. అది మరణానుభవం కాదు. తనను తాను ఎరిగిన ఎరుక అది. క్షణ కాలం జరిగే ఆత్మానుభవం ఒక ఎత్తయితే, అదే స్థితిలో ప్రపంచంలో 54 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉండటం, ప్రపంచ అధ్యాత్మ చరిత్రలో ఒక అపూర్వ సన్నివేశం. ఋగ్వేదంలో పురుషసూక్తం ఈ విషయాన్ని స్పష్టంగా బోధిస్తుంది. ఏమని? మహాచైతన్యం ఈ ప్రపంచంలోకి వచ్చి చేసే కార్యకలాపాలు ఏవీ ఉండవు. కానీ సృష్టియందున్న కరుణ చేత అది ఒక దేహాన్ని ధరించి, సర్వ జీవుల పట్ల సహజ కారుణ్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రాపంచిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లున్నా ఏదీ అంటని, దేనినీ అంటించుకోని మహామానవ మూర్తి వలె ఉంటుంది. దీనికి నిలువెత్తు నిదర్శనం భగవాన్ రమణులు. "భగవాన్ ఘనీభవించిన మౌనం. అరుణగిరీ అంతే! అరుణాచలేశ్వరుడూ అంతే! మహర్షిది స్వాత్మానందం. వారిది సహజ స్థితి. ధ్యానం, యోగం, తపస్సు అనే స్థితుల కంటే పరమచరమమైన తుర్యాతీత స్థితి. అది ఆనంద భూమిక. పరమానంద పతాక. అలలు, కెరటాలు లేని కరుణా సముద్ర ముద్ర వారిది. తన లోతులలో తానై నిలచిన నిర్మల, నిశ్చల ఆనంద బిందువు. ఇది భగవాన్ అంతర్ముఖ పటం. వెలుపల వారు అతి వర్ణాశ్రమి. ఏమీలేని పూర్ణ స్థితి. అన్నీ ఉన్న శూన్య స్థితి. తన చుట్టూ జరుగుతున్న ఏ విషయమూ అంటని ఆకాశం. చూపుతో జన్మాంతర సంస్కారాలను వెలిగించి, మూల వాసనలను మలగించి, అజ్ఞాన తమస్సును తొలగించి, మౌనంతోనే సమాధానపరచే భగవాన్ ది జాతి, కుల, మత, వర్గ, వర్ణ, పామర పండిత, పశు, శిశు... దేనియందూ ప్రత్యేక ఆసక్తిని గాని, విముఖతను గాని ప్రదర్శించని స్థితి. కావ్యకంఠులు వాగ్మి. మంత్ర ద్రష్ట మహాతపస్వి, ఉపాసనా బలమే ఆయన కలిమి. భగవానుని దర్శించుకున్న మరుక్షణమే సమర్పణ, శరణాగతి, వినయం ఆయనను మహాసాధకుణ్ణి చేసినయ్. ఎన్నో అనుభవాలు ఆంతరంగికమైనయ్. సహజానంద తరంగాలు ఆయనను ముంచెత్తటం ప్రారంభమైంది. 'భగవాన్! ఈ అనుభమంతా మీ కరుణాదృష్టి సోకినందునే కలుగుతున్నది. మీ గురించిన తలపే నన్ను అంతర్ముఖత్వం వైపు నడిపిస్తున్నది. మున్నెన్నడూ ఎరుని హృదయాంతర్గమైన 'నేను'ను వినగలుగుతున్నాను. 'నేను'ను చూడగలుగుతున్నాను. ఆ నేను, నా మేను కంటె భిన్నమైనదిగా అనుభవమవుతున్నది. ఇదంతా మీ కరుణ వల్లనే! అయినా ప్రాపంచిక భావనలు నన్ను వెన్నాడుతూనే ఉన్నయ్! సమగ్ర సహజ స్థితి నాకు కావాలి. ఎంత దూరంలో ఉన్నా మీ వీక్షణానుగ్రహం నాకు కావాలి. అది లభిస్తేనే, నాకు పూర్ణానుభవం కలుగుతుంది. ఇంతకు ముందు కలిగిన అనుభవాలన్నీ ప్రభంజనంలా శక్తిమంతంగా ఉండేవి. ఇపుడు మాత్రం అవి సరళత్వాన్ని, లలితత్వాన్ని, మార్దవాన్ని కలిపి తేజోమయంగా, తేలికగా, హాయిగా ఉన్నయ్. ఇదంతా మీ దయే!" అని కావ్యకంఠులు అన్నప్పుడు, భగవాన్ మౌనం, దృష్టి అనుగ్రహం, కరుణ ఎంత శక్తివంతమో అర్థమౌతుంది. అందునా కావ్యకంఠుల వంటి తపస్వికే ఇంతటి ప్రగాఢ అనుభవం కలిగిందంటే ఇక మహర్షిమౌనం ఎంత పరిపూర్ణమో అర్ధమవుతుంది. ఇంతటి అనుగ్రహం గణపతి ముని అనుభవించటానికి గల కారణం ఒకటే! ఆయనకున్న అధ్యాత్మ పిపాస! అది తీవ్రం, గాఢం, అచ్చం! "మహాఋషులు నిలిచిన, మహాత్ములే నడిపిన ఈ పవిత్రప్రదేశంలో నేనెందుకు పుట్టాను? నా కర్తవ్యం ఏమిటి?" అనే ప్రశ్నలకు సమాధానం కావాలి ఆయనకు. జవాబు దొరికితే, చేయవలసిన పనిని సమర్థవంతంగా చేయాలి. సమత -మమతలతో కూడిన ఆదర్శ భారతదేశం అగ్రగామి కావాలన్నది ఆయన ఆకాంక్ష వేద ప్రామాణికమైన మానవతా ధర్మం భరత జాతిని నడిపించాలి. ఇది కేవలం జీవ ప్రజ్ఞ వలననే సాధ్యం కాదు. దైవ ప్రజ్ఞ కావాలి. ఈ రెండూ కూడితేనే ఇది సాధ్యం. ఇదంతా జరగటానికి మహర్షి అనుగ్రహమే దిక్కు. ఇది ముని మన సు, తలపు, లక్ష్యం, గమ్యం. ఈ ఆలోచనల వెనుక ఏ స్వార్ధమూ లేదు. ఉన్నదంతా దేశ క్షేమం, లోక సంక్షేమం. 'ఉమా సహస్రం' వ్రాసినా 'ఇంద్రసహస్రం' వ్రాసినా ఆయన మనో లక్ష్యం ఒక్కటే, అది సర్వ మానవ సమానత్వ సాధన! కావ్యకంఠుల ఆలోచనలు యివైతే, రమణుల స్థితి వేరు. ప్రత్యేకంగా ఇది జరగాలని కాని, ఇలా జరగాలని కాని వారు చెప్పరు. వారి ఉనికే ఈ ప్రపంచానికి ఒక మౌన సందేశం. వారి చుట్టూ మహా మౌనసముద్రం పరివేష్టితం. అందులో అందరి ఆలోచనల అలలు, కెరటాలు కలిసిపోవలసిందే! వారి ఆవరణంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరిపైనా వారి కరుణా దృష్టి సోకవలసిందే! చూపు బోధగా, కన్ను మాట్లాడవలసిందే! ఏమీ పట్టనట్లుండే వారి స్థితి, ఏ విషయాన్ని తడమకుండా ఉండదు. లౌకిక విద్యలెరుగని భగవాన్ భాష, హృదయ భాష, 'అక్షరమణమాల', 'అరుణాచల నవమణిమాల', 'ఉపదేశసారం', 'ఉళ్ళదు నార్పదు' వంటి మహోత్కృష్ట రచనలు వారి శుద్ధ చైతన్యం నుండి వెలువడిన వెలుగు రేఖలు. 'హృదయకుహరమధ్యే' అంటూ ప్రారంభమయే శ్లోకం రమణుల ఆత్మతత్వానికి మూలం! అది సంస్కృత భాషలో ఉండటం ఆశ్చర్యమేమీ కాదు. కొంతే తెలిసినవాడికి అంతా తెలిసినట్లుంటుంది. అంతా తెలిసినవాడు ఏమీ తెలియనట్లుంటాడు. విజ్ఞాని జ్ఞాని కావటం ఒక పరిణామం. జ్ఞాని విజ్ఞానిగా ఉండటం ఒక స్థితి. అది ఒక అనుగ్రహం. గురువును ప్రశ్నించాలి. సమాధానం పొందాలి. దృఢ విశ్వాసంతో సాధన సాగించాలి. గణపతి ముని సాధన యిదే! వీరిరువురి మధ్య సాగిన ప్రశ్నోత్తర సమాహారమే రమణగీత! రమణగీతకు ఆచార్యుడు, మహర్షి. వ్యాఖ్యాత, గణపతి ముని. భగవాన్ "ఉళ్ళదు నార్పదు", అంటే ఉన్నది నలభై అనే అద్వైత గ్రంథాన్ని, “సద్దర్శనం"గా చూపినది కావ్యకంఠులు. భారతీయ అధ్యాత్మచరిత్రలో రమణ గణపతుల కలయిక ఒక మేలి మలుపు! కావ్యకంఠ గణపతి, సాధనా తీవ్రతలో ముని! భగవాన్ రమణులు, సాధనకు మూలమై, సాధనే సాకారమైన మౌని! ________________________________________ HARI BABU.G ________________________________________ #🕉️ శ్రీ భగవాన్ రమణ మహర్షి #భగవాన్ రమణ మహర్షి సూక్తులు నా స్టెటష్ #భగవాన్ రమణ మహర్షి సూక్తులు.. 🙏 #భగవాన్ రమణ మహర్షి జయంతి
🕉️ శ్రీ భగవాన్ రమణ మహర్షి - శీరమణమమల్ని జయంతి శుఖకంక్షలు శీరమణమమల్ని జయంతి శుఖకంక్షలు - ShareChat