*వైకుంఠ ఏకాదశి విశిష్టత*
💥💥💥💥🙏🙏💥💥💥
*వైకుంఠ ఏకాదశిని ఎప్పుడు జరుపుకోవాలి*
సౌరమానం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడమే ధనుర్మాసం. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అనగా ధనుర్మాసం ప్రవేశించాక వచ్చే శుద్ధ ఏకాదశి.
వైకుంఠ ఏకాదశి పర్వదినం. అనగా పవిత్రమైన రోజు. ఆరోజుని భగవంతుని ఆరాధనకే వినియోగించాలి. భక్తులందరూ భగవంతుడిని చేరే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి.
ఆరోజున మూడు కోట్ల దేవతలు స్వామిని కొలుచుకోవడానికి వైకుంఠానికి వచ్చిన రోజు. అందుకే ఇది ముక్కోటిఏకాదశి.
లోకకల్యాణార్థం శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి లేచిన రోజు! యోగనిద్ర అనగా...
యోగము అంటే కూర్చుట.
నిద్ర అనగా ఆలోచన.
జీవులకు వారి వారి కర్మలకు తగినటువంటి ఫలితాలను అనుభవించడానికి తగిన శరీరాలను ఇవ్వడానికి చేసే ఆలోచనే యోగనిద్ర.
ఈ పర్వదినం యొక్క ప్రత్యేకత, ఉత్తరద్వార దర్శనం అనగా ఉత్తర ద్వారం ద్వారా పరమాత్మ దర్శనం చేయడం.
ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి??
ఉత్తరం-- జ్ఞానము
దక్షిణం-- కర్మ ....
అనగా
పరమాత్మను జ్ఞానంతోనే దర్శించగలం! అజ్ఞానంతో, మోహంతో, కర్మలతో పరమాత్మని దర్శించ లేము.
జ్ఞానం ద్వారానే పరమాత్మను దర్శించుట అన్న దానికి సంకేతమే
ఉత్తరద్వార దర్శనము.
ఇంకొక అర్థము ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ధనాధిపతి.
ధనము అనగా లౌకిక ధనం కాదు. జ్ఞానధనం. లౌకిక ధనం అశాశ్వతం. కానీ జ్ఞానధనం అలా కాదు. కాబట్టి ధనం దిక్కు అనగా ఉత్తర దిక్కు నుండి చూడటం అంటే జ్ఞానంతో పరమాత్మని చూడటం.
ఉత్తర ద్వారం అంటే మరో అర్థం-- ఇంకొక ద్వారం!
అక్కడున్న ద్వారం వైకుంఠంలో ఉన్న ద్వారం.
జ్ఞానానికి ద్వారం. జ్ఞానం వస్తే లభించేది మోక్షం. మోక్షానికి ద్వారం కాబట్టి ఉత్తర ద్వార దర్శనం అంటే మోక్షద్వారదర్శనం!
కాబట్టి జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని జ్ఞానంతోటే జ్ఞానరూపునిగా జ్ఞానవృద్ధి పొందడానికే పరమాత్మని దర్శించాలి అనే సంకేతాన్ని ఉత్తరద్వార దర్శనంలో మనకు ఋషులు సూచించారు..
సనక సనందులు విష్ణుమూర్తి దర్శనానికి వెళుతుంటే ద్వారం దగ్గర ఉన్న జయవిజయులు అడ్డుకుంటారు. అది మనందరికీ తెలుసు కదా!! దానిలో ఉన్న అంతరార్ధం తెలుసుకుందాం...
పరమాత్మని తెలుసుకోవాలన్నా, చేరుకోవాలన్నా ఉండాల్సింది సత్త్వగుణం.
కానీ మనం పరమాత్మని చేరుకోకుండా అడ్డుకునేవి రాజస,తామస గుణాలు.
ఇదే కథా పరంగా, సత్త్వగుణం అయిన సనకసనందులు పరమాత్మని చూడడానికి వెళ్తుంటే ద్వారం దగ్గర ఉన్న జయ విజయులు అనే రాజస తామస గుణాలు అడ్డుకున్నాయి.
వారిని భూమి మీద పడమని అనడం అంటే, వాటిని దూరంగా వదిలించుకునేసరికి, పరమాత్మ లేచి బయటికి వచ్చి సనకసనందులకు దర్శనం ఇచ్చాడు.
మనలో కూడా రాజస తామసములు అడ్డుకుంటూ ఉంటాయి. వాటిని పక్కకి తోసి సత్త్వగుణంతో ప్రార్థన చేస్తే పరమాత్మ తనంతట తానే వచ్చి తప్పక దర్శనం ఇస్తాడు.
రజోగుణాన్ని వదిలి సత్త్వగుణంతో వెళితే ద్వారం తెరుచుకుంటుంది.
ఆ ద్వారమే ఉత్తరద్వారం.
అది తెరుచుకున్న పర్వమే వైకుంఠ ఏకాదశి.
వైకుంఠ ఏకాదశి రోజు పొద్దున్నే మనము దేవాలయాల దగ్గర చూస్తూ ఉంటాము.
ఆ రోజు దేవాలయాల్లో విపరీతమైన తొక్కిసలాట, గొడవలు. డొనేషన్ ఇచ్చామంటూ.. రికమండేషన్ అంటూ ఏదో రకంగా ఆ ద్వారం నుండి వెళ్లి స్వామిని దర్శనం చేయాలి అనుకుంటారు.
అది కాదు చేయవలసింది.
మనం వెళ్ళవలసిన దారి ‘ఈ’ఉత్తర ద్వారాలు కాదు. సనకసనందులు వెళ్ళిన అసలు ఉత్తరద్వారం.
ఉత్తరం అంటే నార్త్ అని మాత్రమే అర్థం కాదు.
ఉత్ + తర = ఉత్తర
ఉత్ అనగా గొప్పది అని అర్థము. ఉత్కృష్టమైన, ఉత్తమము....
అని మనం అంటూ ఉంటాము.
ఇక ‘తర’ అనే శబ్దాన్ని కంపారిటివ్ గా వాడేటప్పుడు వాడతారు.
ఉదాహరణకి
good better best లలో .... బెటర్ తర.
ఇంకో దానితో పోల్చేటప్పుడు ఉత్తర.
మనం సృష్టిలో అన్నీ గొప్పగొప్పవి అనుకుంటున్నాము. వాటి కన్నా ఇదే గొప్పది అనడమే ఉత్తర.
అన్నింటి కన్నా గొప్పది భగవద్దర్శనం. దేని ద్వారా మనం భగవంతుని చేరుకుంటామో అది ద్వారం.. అనగా జ్ఞానం భక్తి ..!
అదే ఉత్తరం.
పరమాత్మ ను చూడాలంటే భక్తి, జ్ఞానం అనే తలుపులు తెరుచుకోవాలి. ఉత్తర అనగా అన్నిటికంటే గొప్పది.
సాధారణంగా ఈ సమయంలో బయట వాతావరణం చాలా చలిగా ఉంటుంది. ఈ సమయంలోనే సూర్యభగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు.
ఉత్తర అంటే సూర్యుడు ఇదివరకటి కంటే గొప్పగా కనపడతాడు.
సూర్యకిరణాల్లో దేవతా శక్తులు ఉంటాయి. ఉత్తరాయణంలో మనకి కిరణ శక్తి బాగా లభిస్తుంది.
వైకుంఠంలో ఉన్న నారాయణుడే మనకు సూర్యనారాయణుడి గా కనపడుతున్నాడు.
మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న సూర్యుని ద్వారా వైకుంఠంలో ఉన్న విష్ణువుని భావించవచ్చు. వైకుంఠంలోని విష్ణువు మనకు కనపడట్లేదు, కానీ కనిపిస్తున్న ఈ సూర్యభగవానుడిని నేనే, అంటూ ఆయనే చెప్పాడు.
గీతలో స్వామి, సూర్యునిలోని కాంతిని నేనే అన్నాడుగా!! అందుకే మన పెద్దలు మనకు సూర్యనారాయణుడు అనేమాట అలవాటు చేశారు.
అందుకే ఏ హిందువు అయినా...
Sun is a star ... అనడు.
ప్రత్యక్ష భగవానుడు, సూర్య నారాయణుడు అనే అంటాము. ఈ సమయంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరం వైపు తిరిగేటప్పటికి ఉత్తర ద్వారం ఉంటుంది.
మనకు అందరికీ తెలిసిన సూర్యమంత్రం “ఆరోహన్నుత్తరాం దివం దేవః
ఈ మంత్రం “ద్వాదశఆర్య సూర్యస్తుతి” లో ఉంటుంది. వేదంలో సూర్య మంత్రం లో ఉత్తర దివం దేవః అని వాడారు.
ఇక్కడ కూడా ఉత్తరం అనగా ఉత్కృష్టంగా ప్రకాశిస్తున్న సూర్యభగవానుడికి నమస్కారము అని అర్థం.
కాబట్టి ఇప్పుడు తెరుచుకోవాల్సింది ఈ ద్వారం. ఇప్పుడున్న దాని కన్నా గొప్ప ద్వారం. ఏ ద్వారమయితే మనల్ని పరమాత్మ దగ్గరికి చేరుస్తుందో, ఏ ద్వారం ద్వారా పరమాత్మ దగ్గరికి వెళతామో అది మనలో తెరచుకోవాలి.
తెరచుకోవాలి అంటే దానికి అడ్డుగా ఉన్న రాజస తామస గుణాలని తీసేయాలి. అప్పుడే లోపలికి వెళ్లగలం. అప్పుడే పరమాత్మ అందుతాడు. అదే ఈ కథలోని అంతరార్థం..
కాబట్టి మనలో ఉత్తర ద్వారం తెరుచుకోవాలి అంటే ఎంతో సాధన చేయాలి. అలా అని ఇప్పుడు ఇక్కడ దేవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం మానేయమని, అర్థం కాదు. అవన్నీ చేయమని, ఇవి సంకేతాలు అని తెలుసుకోవాలి.
ఇటువంటివన్నీ చెయ్యగా చెయ్యగా ఎప్పుడో పాపాలన్నీ పోయి అటువంటి సాధన చేయాలనే బుద్ధి పుడుతుంది. కాబట్టి బాహ్యంలో చేయాలి, కానీ అంతరార్థం కూడా తెలుసుకోవాలి.
ఇది కనుక చేయగలిగితే ముక్కోటి దేవుళ్ళు ఆయన లోనే ఉన్నారు. కాబట్టి సర్వదేవతాత్మకుడైన ఆయన్ని దర్శిస్తే అదే ముక్కోటి ఏకాదశి..
ఇక ఏకాదశి అంటే..
మనలో ఉన్న 11 ని ఒక్కటి చేసి భక్తి జ్ఞానం అనే ద్వారంగుండా వెళ్లడం...
మనలో ఉన్న 11 ఏంటంటే, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఒక మనసు. ఈ 11ని ఒక్కటి చేయడమే నిజమైన ఏకాదశి. అలా ఎలా చేయాలి ?? అని మనకు అనిపించవచ్చు..
కానీ మన అందరికీ ప్రహ్లాదుడు నేర్పించాడుగా!
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ... అంటూ
ఈ పదకొండు ఒక్క శరీరంలోనే ఉన్నాయి. వీటన్నిటితో భగవంతుని అనుభవం పొందడమే అసలయిన ఏకాదశి.
పదకొండూ ఆయన దగ్గర పెట్టి 12 వ దైన ద్వాదశి దగ్గరికి వెళ్తున్నాము. ఏకాదశి వ్రతం చేసేది ద్వాదశి కోసమే.
ద్వాదశి తిథికి అధిపతి విష్ణువు. ఏకాదశికి అధిపతి యముడు.
అనగా ఏకాదశినాడు ఉపవాస దీక్షతో మనసుని శరీరాన్ని తపింప చేయడం వలన యముడు పెట్టే బాధలు లేవు. జీవుడు శుద్ధమవుతాడు. అప్పుడు తిండి కోసం ఆలోచించకుండా విష్ణువు గురించే ఆలోచిస్తాడు. పదకొండు ఇంద్రియాలను ఆయన దగ్గర ఉంచడం వలన ఆయన మనని పన్నెండవ వాడిగా తనలోకి తీసుకుంటాడు.
అదే ద్వాదశి పారణ.
ద్వాదశి విష్ణువు కు చాలా ప్రధానం.
ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పూజకు అర్హత ఇస్తుంది.
అలా ఇంద్రియాలు మనస్సుని శుద్ధం చేసుకుని భక్తి జ్ఞానం అనే ద్వారo గుండా పరమాత్మ దర్శనం చేద్దాము, తరిద్దాము.. అదే ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రాముఖ్యత..!
ఓం నమో నారాయణాయ 🙏
✍🏻🚩 * సర్వే జనాః సుఖినోభవంతు * 🚩
___________________________________________
HARI BABU.G
___________________________________________ #ముక్కోటి ఏకాదశి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🚩వైకుంఠ ఏకాదశి🔱ముక్కోటి శుభాకాంక్షలు🙏 #తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం #వైకుంఠ ఏకాదశి🙏


