ShareChat
click to see wallet page
search
మనిషి జీవితంలో అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే, అది కంఫర్ట్ సౌకర్యం. మనకు తెలిసిన దారిలో నడవడం సులువు. మనకు తెలిసిన మనుషులతో మాట్లాడడం సులువు. మనకు అలవాటైన ఆలోచనలతోనే జీవించడం ఇంకా సులువు. నీళ్లు ప్రవహిస్తేనే శుభ్రంగా ఉంటాయి. కంఫర్ట్ సౌకర్యం ఏ ప్రశ్నలు ఉండవు. ఏ సవాళ్లు ఉండవు. ఏ గందరగోళం ఉండదు. కొత్తగా పుట్టడం అంటే పెద్ద పెద్ద విప్లవాలు చేయడం కాదు. కొన్ని చిన్న అసౌకర్యాలను ఒప్పుకోవడం. కొత్తగా నేర్చుకోవడం. కొత్తగా అడగడం. కొత్తగా విఫలమవడం. కొత్తగా మనల్ని మనమే చూసుకోవడం. పాత మనసును వదిలేయడం చాలా కష్టం. పాత అలవాట్లు, పాత భయాలు, పాత నమ్మకాలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి. కానీ అవే మన కాళ్లకు వేసుకున్న గొలుసులు. ఒకసారి ఇంటి నుంచి బయల్దేరి, తెలియని భాష మాట్లాడే మనుషుల మధ్య, తెలియని రుచుల ఆహారం తింటూ, తెలియని దారుల్లో నడుస్తూ ఉన్నప్పుడు మనసు ఒక్కసారిగా అద్దంలా మారుతుంది. భూటాన్‌లో ఒక చిన్న గ్రామంలో విద్యుత్ కూడా లేని రాత్రి, నక్షత్రాల కింద కూర్చున్నప్పుడు అక్కడ ఒక తాత చెప్పిన మాట గుర్తుంది. మనిషి ఎంత తక్కువతో బతకగలడో అర్థం చేసుకున్న రోజే అతను నిజంగా స్వేచ్ఛగా జీవిస్తాడు. అప్పుడు తెలిసింది. మన కంఫర్ట్ అవసరం కాదు, మన భయం మాత్రమే. కాంబోడియాలో ఒక దేవాలయం దగ్గర గైడ్ లేకుండా గంటల తరబడి తిరుగుతూంటే మనసులో ఒక్క మాటే వినిపించింది దారి తప్పితేనే కొత్త దారులు కనిపిస్తాయి. ఆ దారుల్లో ఎవ్వరూ నన్ను గుర్తించరు. నా పేరు, నా పని, నా గతం ఏదీ ముఖ్యం కాదు. అది భయంగా అనిపించింది మొదట. తరువాత అదే చాలా హాయిగా అనిపించింది. ప్రయాణాలు మనకు ఒక విషయం నేర్పుతాయి మనమంతా ఇక్కడ తాత్కాలిక అతిథులమే అని. వియత్నాం లో ఒక కాఫీ షాప్‌లో ఒంటరిగా కూర్చున్నప్పుడు నా లోపలున్న శబ్దం ఒక్కసారిగా మౌనమైంది. అప్పుడే అర్థమైంది కంఫర్ట్ అంటే శబ్దం లేని చోట ఉండడం కాదు, మనసు నిజం చెప్పే చోట ఉండడం. కొన్ని దేశాల్లో మనుషులు తక్కువ సంపాదిస్తారు, కానీ ఎక్కువ నవ్వుతారు. కొన్ని చోట్ల మనుషులు ఎక్కువ సంపాదిస్తారు, కానీ నవ్వడం మర్చిపోతారు. అక్కడే ఒక మాట నా నోటే వచ్చింది. సౌకర్యం మన జీవన ప్రమాణాన్ని పెంచుతుంది, కానీ అనుభవమే మన జీవితాన్ని పెంచుతుంది. ఒమన్‌లో ఎడారి మధ్య సూర్యాస్తమయం చూస్తూ ఒక బెడౌయిన్ (ఎడారులలో సంచరించే అరబ్ తెగలకు చెందినవారు) చెప్పిన మాట ఇప్పటికీ వెంటాడుతుంది. ఎడారిలో దారి లేదు. దారిని ఎడారిలో నడిచినవాడే తయారు చేస్తాడు. మన జీవితాలు కూడా అంతే. ముందుగా రెడీగా ఉండే దారులు ఉండవు. నడిచిన కొద్దీనే దారి అవుతుంది. ప్రతి ప్రయాణం నాకు ఒక అసౌకర్యాన్ని నేర్పింది. ప్రతి అసౌకర్యం నాకు ఒక నిజాన్ని చెప్పింది. కొన్ని సార్లు భాష అర్థం కాలేదు. కొన్ని సార్లు ఒంటరితనం గట్టిగా తాకింది. కొన్ని సార్లు అయోమయానికి గురైయ్యాను. కానీ... ఆ క్షణాల్లో నన్ను నేను కలిశాను. ఒంటరిగా ఉండడం కాదు భయం, మనల్ని మనమే కలవకపోవడమే భయం. కంఫర్ట్ సౌకర్యం మనకు అన్నీ తెలిసినట్టుగా ఒక అబద్ధపు ధైర్యం ఇస్తుంది. ప్రయాణం మాత్రం మనకు ఎంత తెలియదో చాలా మృదువుగా చూపిస్తుంది. అదే వినయం. అదే మానవత్వం. ఇప్పుడు నాకు తెలుసు ప్రతి కొత్త ప్రదేశం మన లోపల ఒక పాత భయాన్ని చంపుతుంది. ప్రతి కొత్త మనిషి మనలో ఒక కొత్త కోణాన్ని పుట్టిస్తుంది. అందుకే... ప్రయాణం అనేది దూరం కాదు. అది కంఫర్ట్ నుంచి బయటకు అడుగు. చివరికి చెప్పేదొకటే... సురక్షితంగా జీవించడం సులువు, సజీవంగా జీవించడం ధైర్యం. ఆ ధైర్యాన్ని జీవితం అడగదు. మనమే తీసుకోవాలి. కంఫర్ట్ సౌకర్యం నుంచి ఒక్క అడుగు బయట పెట్టిన రోజే మన జీవితం మీదే అవుతుంది. #MMSTUDIOS 🌹🍃
MMSTUDIOS - ShareChat