_*నాన్నకు ప్రేమతో..*_
**********************
*_నాన్న.._*
నిన్ను చిన్నప్పటి నుంచి
కంటికి పాపలా చూసుకున్నాడని అనుకుంటున్నావేమో..
*తన రెండు కళ్లూ నువ్వే అయి నిను కాచాడు..!*
నీకు కష్టం వచ్చినప్పుడు
తన రెండు చేతులూ చాచి
దగ్గరకు తీసుకున్నాడని
మురిసిపోతున్నావేమో..
అంతకు మించి తన గుండె తలుపులు తెరిచి అక్కడ
నిన్ను పొదుగుకుని
*నీకు ఊరట కల్పించాడు..*
*తానూ అలా సేదదీరాడు..!*
నీతో పాటు బయటికి వచ్చినప్పుడు నువ్వు అది కొను ఇది కొను అన్నప్పుడు
జేబులు చూసుకుంటూ
నిన్ను చూసి నవ్విన
వెర్రి నవ్వులు నీకు అర్థం అయ్యాయో లేదో..
ఆ క్షణాన నాన్నలో నువ్వు లోభిని చూసావేమో..
నీకోసం జేబులో ఉన్న
ఆ కాస్త డబ్బులూ ఖర్చు పెట్టేందుకు సిద్ధపడ్డ త్యాగి కనిపించి ఉండడు..
*ఎందుకంటే అప్పుడూ నాన్న నీకు నవ్వుతూనే కనిపిస్తాడు!*
నువ్వు గెలిస్తే తాను గెలిచినట్టు పొంగిపోయే నాన్న బడి నుంచి నువ్వు తెచ్చిన కప్పు..
ఒలింపిక్ మెడల్ మాదిరి
తన మెడలో వేసుకు తిరిగి
నీ చుట్టూ
*తన కలల మేడలు కట్టేసుకుంటాడు..!*
చిన్నప్పుడు నీ బదులు
నీ కలల్ని తాను కనే నాన్న..నువ్వు పెద్దయ్యాక నువ్వు కనే కలల్ని
*నిజం చేసేందుకు*
*తాను శ్రమిస్తాడు..!*
నీ గెలుపు తన గెలుపై..
నీ కష్టం తన కష్టమై..
నీ ఇష్టం ఒక్కోసారి
తనకు కష్టమైనా ఇష్టపడి..
నీ ప్రతి అడుగు
తన అరచేతిపై నుంచి పడేలా..
నీ నవ్వు తన బహుమానమై..
నువ్వే తన బలమై..
నీ ఉన్నతి తన ఆకృతై..
నీ ఎదుగుదల తన వరమై..
నువ్వే తన ఇహమై..పరమై..
బ్రతికే నాన్న నీ దృష్టిలో నాయకుడైనా కాకపోయినా
*నువ్వు నాన్న జీవితకాలపు*
*_హీరో..!_✍️💎⚜️🙏 #మనలోని మాటలు


