కొండచుట్టు మండపాన్ని కూల్చవద్దు 🙏 నగరి సంస్కృతి వారసత్వాన్ని కాపాడాలి, 600 సంవత్సరాల పురాతన కొండచుట్టు మండపాన్ని యథావిధిగా ఉంచాలి, భక్తుల మనోభావాలను గౌరవించాలి, NHAI అధికారులకు మాజీ మంత్రి Roja Selvamani
చెన్నై: తిరుపతి నుంచి తిరుత్తణికి నగరి, పుత్తూరు మీదుగా వెళ్లే జాతీయ రహదారి NH-716 వెడల్పు పనుల్లో భాగంగా నగరిలో ఉన్న 600 సంవత్సరాల పురాతన కొండచుట్టు మండపం ను కూల్చాలన్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయాన్ని వెంటనే పునఃపరిశీలించాలని, మండపాన్ని యథావిధిగా ఉంచి హైవే మార్గాన్ని సవరించాలని మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా గారు కోరారు.
మంగళవారం చెన్నైలోని NHAI ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) శ్రీ ఎం. రవీంద్రరావు గారిని కలిసి ఈ మేరకు ఆమె వినతిపత్రం సమర్పించారు.
కొండచుట్టు మండపాన్ని కూల్చరాదని గతంలోనే పలుమార్లు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలిపినట్లు, ఈ విషయమై కోర్టును కూడా ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు.
ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు W.P. No. 1822/2026 కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి మండపం కూల్చివేతను నిలిపివేయాలని ఆదేశించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
నగరి సంస్కృతి, సంప్రదాయాలకు తలమానికంగా నిలుస్తున్న ఈ చారిత్రక మండపాన్ని కూల్చడం సరికాదని, హైవే వెడల్పు పనుల్లో స్వల్ప మార్పులు చేయడం ద్వారా మండపాన్ని యథావిధిగా ఉంచవచ్చని ఆమె సూచించారు.
మండపం కూల్చివేత వల్ల భక్తుల మనోభావాలు, నగరి ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుందని వివరించారు.
600 సంవత్సరాల క్రితం శాల్వ రాజుల కాలంలో నిర్మించబడిన ఈ మండపంలో నిత్యపూజలు, అన్నదానం, ఉత్సవాల నిర్వహణ కోసం పాలేగార్ చెంగమ్మ నాయని వారు భూములు కేటాయించి సంప్రదాయంగా సంరక్షిస్తూ వస్తున్నారని ఆమె వివరించారు.
నగరి చుట్టుపక్కల ఉన్న 21 ఆలయాలకు చెందిన ఉత్సవ విగ్రహాలు ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున గ్రామాల నుంచి ఊరేగింపుగా వచ్చి కొండచుట్టు మండపానికి చేరుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని, ఈ ఉత్సవాలు నగరి సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఆమె గుర్తుచేశారు.
శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ ఉత్సవాలు యథావిధిగా కొనసాగాలంటే కొండచుట్టు మండపం అక్కడే కొనసాగాల్సిందేనని, దాన్ని కూల్చడం ఏమాత్రం సమంజసం కాదని ఆమె ఖరాఖండీగా స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గతంలో సమర్పించిన వినతిపత్రాలు, అభ్యంతరాలు, కోర్టు ఉత్తర్వుల ప్రతులు, కొండచుట్టు ఉత్సవాలకు సంబంధించిన వార్తా కథనాలు, ఫోటోలు, వీడియోలను కూడా అధికారులకు సమర్పించి నగరి సంస్కృతి వారసత్వాన్ని కాపాడాలని కోరారు.
*హైవేలో యూ-టర్న్ సమస్య పరిష్కరించాలి*
అదేవిధంగా ఈ జాతీయ రహదారి కారణంగా నగరి నియోజకవర్గానికి చెందిన మహాలక్ష్మిపురం, కె.ఎం. అగ్రహారం, తిమ్మాపురం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూ-టర్న్ సౌకర్యం లేకపోవడం వల్ల అనవసరంగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని ఆమె అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
పున్నమి సర్కిల్ వద్ద, గొల్లపాళెం రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో యూ-టర్న్ ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించాలని ఆమె కోరారు.
#🇱🇸వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ #RK ROJA AKKA


