#పవిత్రోత్సవాలు #శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు🙏 #శ్రీనివాస మంగాపురం #శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సాక్షాత్కార వైభవోత్సవాలు 🙏 #శ్రీ పద్మావతి పరిణయం / శ్రీ శ్రీనివాస పద్మావతి కల్యాణోత్సవం (అలమేలు మంగాపురం, తిరుపతి)
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు🙏
🙏శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ🙏
తిరుపతి, 2025, అక్టోబర్ 16: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 17 నుండి 19వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం 6 గం.లకు శాస్త్రోక్తంగా పుణ్యహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. అంతకుముందు ఉదయం ఆచార్య ఋత్వికరణం చేపట్టారు.
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 17వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.30 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబరు 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు అక్టోబరు 19వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈకార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


