#😇My Status #భక్తి స్పెషల్ #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని
*పర్వదినాల మాసం మార్గశిరం*
*మృగశిర నక్ష త్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. హేమంత రుతువులో తొలి మాసం. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో ‘మాసానాం మార్గశీర్షీహం' అని మాసాలలో తాను మార్గశీర్షాన్ని అని తెలిపాడు. ఆ విధంగా ఈ మాసం భగవత్స్వరూపమే. ఇది ఆధ్యాత్మిక సాధనకు అనువైనది, శైవ, వైష్ణవానుయాయులకు విశిష్టమైనదిగా చెబుతారు. కార్తిక మాసం వలెనే ఈ మాసంలో కూడా శైవ వైష్ణవ సంబంధితమైన పండగలు, పర్వాలు మెండుగా ఉన్నాయి.*
*మార్గశిరమాసం ప్రధానంగా శ్రీమహావిష్ణువు నిత్యానుపాయిని, సిరిసంపదలనిచ్చే సిరుల తల్లికి ప్రియమైనది. ఈ నెలలోని గురువారాలు (లక్ష్మీవారాలు) ఆ తల్లికి అత్యంతప్రియమైనవి. ఈ రోజుల్లో చేసే గురువార నోములు తెలుగు లోగిళ్లలో ముత్తయిదువలు విధిగా ఆచరిస్తారు. ఈ వ్రత మాహాత్మ్యాన్ని గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు, ద్రౌపది మార్గశిర వ్రతాన్ని ఆచరించినట్లు పురాణ కథనం.*
*ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్వయంభువుగా వెలసిన శ్రీకనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించి, ఆరాధిస్తారు.*
*మార్గశిర మాసంలో తొలి తిథి నుంచి అన్నీ పర్వదినాలే!*
*శుక్లపాడ్యమి*
*ఈ మాసంలోని శుక్ల పాడ్యమి ప్రాధాన్యత ఏమంటే బ్రహ్మ నుంచి యుక్తిగా వేదాలను తస్కరించిన మధుకైటభులను విష్ణువు సంహరించి వాటిని తిరిగి బ్రహ్మ దేవునికి అందజేసినది ఈనాడేనని చెబుతారు. ఆ రోజు నుంచే కొంత కాలం తర్వాత తిరిగి వేదాధ్యయనం ప్రారంభమయిందని పురాణ వచనం.*
*విదియ తదియలు*
*ఈ మాసంలోని శుక్ల విదియ తదియల్లో ఉమామహేశ్వర వ్రతం చేయా లని 'చతుర్వర్గ చింతామణి' గ్రంథం ఉటంకిస్తోంది. ఈ వ్రతం వల్ల అప మృత్యు నివారణ జరుగుతుంది. స్త్రీలకు ఐదవతనం వృద్ది చెందుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.*
*పంచమి*
*నాగారాధన పర్వం. నాగుల చవితి, నాగ పంచమినాడు పుట్టల్లో పాలుపోసి నాగమయ్యను ఆరాధించనివారు ఈ రోజు నాగపూజను చేయా లని 'స్మృతి కౌస్తుభం' అంటోంది. ఇంటిలోనే పూజా మందిరంలో నాగ ప్రతిమనుగాని, అది లేకపోతే గోడపై నాగుపాము చిత్రాన్ని పసుపుతో చిత్రించి, పంచామృతాలతో, సుగంధ పుష్పాలతో పూజించాలి.*
*షష్ఠి*
*ఈ షష్ఠినే స్కంద షష్ఠి అని సుబ్రహ్మణ్య షష్టి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యుని కుండలినీ శక్తికి ప్రతీకగా సర్ప రూపంలో పూజిస్తా రన్నది తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి రోజు మాదిరి పుట్టలో పాలు పోసి నాగేంద్రుని ఆరాధిస్తారు. సంతానం కోరేవారు శిలపై సర్ప రూపాన్ని చెక్కించి వేప, రావి చెట్ల మొదట్లో ప్రతిష్ఠించి పూజ నిర్వ హిస్తారు. తమిళనాడులో కుమారస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మోపిదేవితో సహా పలు దేవాలయాల్లో సుబ్రహ్మణ్యుని ఆరాధన ఘనంగా నిర్వహిస్తారు.*
*సప్తమి*
*దీనినే నందా సప్తమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున సూర్యారాధన చేయాలని భవిష్య పురాణం అంటున్నది. సూర్యారాధన వల్లఆరోగ్యం చేకూరుతుంది.*
*అష్టమి*
*ఈ తిథి కాలభైరవాష్టమి. శివునిచే సృష్టించబడిన కాలభైరవుడు బ్రహ్మ శిరస్సులలో ఒకదానిని ఖండించడంతో ఆయన చతుర్ముఖుడయ్యాడు. అంతవరకూ బ్రహ్మకు ఐదు శిరస్సులుండేవని చెబుతారు. శిరసు తుంచిన కాల భైరవునికి అంత తీవ్రతలేని బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది. బ్రహ్మ శిరస్సును బదరీనాథ్ వద్ద గంగ ఒడ్డున ప్రతిష్టించిస్నానం చేస్తే ఆ పాపం పోతుందనడంతో ఆ ప్రకారమే చేసి దాని నుంచి విముక్తుడయ్యాడు. అయితే బ్రహ్మ తలను ఖండించమన్న ఆజ్ఞను కూడా ఏమాత్రం తడబాటులేక వెంటనే శిరసావహించి నెరవేర్చినందుకు శివుడు కాలభైరవుని క్షేత్రపాలకునిగా నియమించి ఆ క్షేత్రాన్ని దర్శించేవారు ముందుగా కాలభైరవుని దర్శించి తరువాతే తనను దర్శించాలని, ఆ విధంగా చేసిన వారికే ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు.*
*ఏకాదశి*
*మార్గశిరంలో అతి ముఖ్యమైన పర్వం. ఈ రోజును వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఆ రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై ఉత్తర ద్వారానికి వేంచేస్తాడు. ఆ సమయం కోసం ముక్కోటి దేవతలు నిరీక్షిస్తారు. భూలోకంలో దేవతలతో బాటు మానవులు కూడా దర్శించి మోక్షగాములవుతారు. అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి స్వామిని సేవిస్తే మోక్షం లభిస్తుందని, ఇలా ఏకాదశి వ్రతంచేయడం వల్ల ముక్తి కలుగుతుందని పద్మపురాణం పేర్కొంటోంది. మరొక విశేషమేమంటే ఆ రోజే శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేశాడు. అందువల్ల ఆ రోజు గీతా జయంతిగా ప్రాధాన్యం పొందింది. ఈ రోజున వ్యష్టిగా, సమిష్టిగా భక్తులు భగవద్గీతను పూజించి గీతా పారాయణం చేస్తారు. భగవంతునితో సమా నంగా భక్తి గ్రంథాన్ని పూజించడం విశేషం. మిగతా మత గ్రంథాలకు లేని ఈ విశిష్టత కలిగిన పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.*
*ద్వాదశి*
*నాడు హనుమంతుని షోడషోపచారాలతో పూజిస్తే విద్యాభివృద్ధి, యశస్సు, ఐశ్వర్యం, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున హనుమద్ర్వతం ఆచరించాలని వ్రత గ్రంథాలంటున్నాయి.*
*చతుర్దశి*
*చతుర్దశి దత్త జయంతి. అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో ఈరోజు దత్తుడు జన్మించాడు. శ్రీహరి ఆ బాలుని దత్తునిగా స్వీకరిం చాడు. అందువల్ల దత్తుడని, అత్రి మహాముని కుమారుడవటం వల్ల దత్తాత్రేయడని పిలుస్తారు. అధ్యాత్మ, యోగ విద్యలకు ఒజ్జబంతి దత్తాత్రేయుని పూజించడం వల్ల జ్ఞానం, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ రోజు గురు చరిత్ర పఠనం శ్రేయోదాయకం. కొందరు పౌర్ణమినాడు దత్త జయంతి జరపడం కద్దు.*
*బహుళ పాడ్యమి*
*దశావతారాలలో ఒకటైన పరశురామావతారం ఆవిర్భవించిన రోజు మార్గశిర బహుళ పాడ్యమి. జమదగ్ని, రేణుక దంపతులకు ఆయన జన్మించిన రోజు. పాలకుల నుంచి బాధలు పడుతున్న ప్రజలను రక్షించడానికి 21 సార్లు క్షత్రియ సంహారం చేసినవాడే పరశురాముడు. మహావీరుడు, విలువిద్యలో ఆరితేరినవాడు.*
*అమావాస్య*
*మార్గశిర అమావాస్య దక్షుని పుత్రుడైన విశ్వకర్మ జయంతి. శివుని వల్లఎన్నో వరాలు పొంది శిల్పులు, స్వర్ణకారులు యంత్రాలు నడిపే కార్మికులకు, చేనేత పనివారికి, స్థపతులకు పూజనీయుడయ్యాడు.*
*ఈ మాసంలో ప్రధానమైనది ధనుర్మాసవత్రం. వృశ్చిక రాశి నుంచి ధను రాశిలోనికి రవి ప్రవేశించే నెల రోజుల కాలం ధనుర్మాసం. నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో ప్రతి రోజు వేకువనే ఆచరిస్తారు. ప్రధానంగా వైష్ణవులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీరంగనాథుని అర్చించిన గోదాదేవి నాడు ద్వాపరంలో కృష్ణుడు గోపికల చేత చేయించిన కాత్యాయినీ వ్రతం వలె కావేరీ నదీ తీరంలో వ్రతమాచరించి రంగనాథుని పొందింది. గోదాదేవి శ్రీరంగనాథుని కీర్తిస్తూ రోజుకొక పాశురం (పాట) పల్లవించింది. ఆ ముప్పై పాశురాలు 'తిరుప్పావై'గా 'నాలాయిరం' అనే గ్రంథంలో చోటు చేసుకున్నాయి. భక్తి తత్త్వం, తాత్త్విక చింతన, ఉపనిష త్సారంతోబాటు ఛందోబద్దమైన ఈ పాశురాలు తమిళ వాఙ్మయంలో మకుటాయమానమైనవి. విష్ణ్వాలయాల్లో ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులు 'తిరుప్పావై' గానం చేస్తారంటే ఈ పాశురాలకు గల ప్రాముఖ్యత ఎటువంటిదో అవగతమవుతుంది. అలాగే శివాలయాల్లో నాయనార్లు రచంచిన 'తిరువెంబావై' (శివుని కీర్తిస్తూ పాడిన పాటలు)ని సుప్రభాత సమయాలలో ప్రత్యేకంగా గానం చేస్తారు. ధనుర్మాసంలో పండుగలు పర్వాలతో పాటు సంక్రాంతి కళ చోటు చేసుకుంటుంది. భోగి పండగ వరకూ సాగే ధనుర్మాసాన్ని సంక్రాంతి సంబరాలకు అంకురార్పణగా భావించడం సముచితం. మార్గశిరాన్ని మోక్షగామిగా భావించడంలో అతిశయోక్తి లేదు.*
❀꧁హరేకృష్ణ꧂❀
🍁🔔🍁 🙏🕉️🙏 🍁🔔🍁


