మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ముమ్మిడివరంలోని గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అమలాపురం డి.ఎస్.పి. టి ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు. జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన మీడియాకు వివరించారు. కాట్రేనికోన మండలంలో ఓ గ్రామంలో బాలిక ఇంటి సమీపంలో నివసిస్తున్న మోకా గిరిబాబు, నేరేడుమిల్లి అర్చనా దేవి ఈనెల 3 వ తేదీన హాస్టల్‌కు వెళ్లి.. అక్కడి సిబ్బందికి బాబాయిగా నమ్మబలికి ఆసుపత్రి నెపంతో బాలికను వారి వెంట తీసుకువెళ్లారన్నారు. అనంతరం అమలాపురంలోని గణపతి లాడ్జ్ చేరుకుని లాడ్జ్ గుమాస్తా నాగవరపు వెంకటరమణ సహకారంతో బాలికపై గిరిబాబు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, ఎస్సై జ్వాలా సాగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో బాలిక ఆచూకీ గుర్తించామన్నారు. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి నిందితుడు గిరిబాబుతో పాటు అతనికి సహకరించిన అర్చనాదేవి, వెంకటరమణలను సోమవారం అరెస్ట్ చేశామని, మంగళవారం కోర్టులో హాజరపరిచామన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ బాలికలపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఇటీవల తునిలో ఇదే తరహాలో బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన మరవక ముందే మరో ఘటన జరగడం పట్ల తల్లితండ్రుల్లో ఆందోళన నెలకొంది.
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢


