@dasharath1
@dasharath1

SARIK DASHARATH PATIL

JAI BHEEM

#

ℹ️సమాచారం

#ℹ️సమాచారం అంబేడ్కరిజం అంటే...!! అంబేడ్కర్‌ ఆచరణని కానీ, సిద్ధాంతాన్ని కానీ పొలిటికల్‌ ప్రాగ్మాటిజం, సైకలాజికల్‌ మెటీరియలిజంల కలయికగా చూడాలి. అంబేడ్కరిజం కేవలం అస్పృశ్యులకూ, ఇతర పీడిత కులాల ప్రజలకూ మాత్రమే కాక సకల జనుల సంకెళ్ళకు విరుగుడు. పీడితులే పీడనకు, పీడకులతో కలిసి సంరక్షించే కులవ్యవస్థకు; పేదవాళ్ళే పేదరికాన్ని పవిత్రంగా స్వీకరించే హిందూ మెట్ల వ్యవస్థకు; అణచివేతకు గురవుతున్న వాళ్ళే అణచివేతను కాపలాకాసే ‘మాయా వాస్తవికత’కు అంబేడ్కరిజం అసలు సిసలు పరిష్కారం. భారతీయ సమాజానికి సంబంధించినంత వరకూ అంబేడ్కరిజం మానవ విమోచనావాదం. పీడిత కులాల పక్షం వహించినట్లు పైకి కనిపించినా సారాంశంలో అంబేడ్కరిజం మొత్తం భారతీయులందరికీ చెందిన విముక్తి సిద్ధాంతం. కొంచెం విశాలదృక్పథంతో ఆలోచిస్తే అంబేడ్కరిజంలో మొత్తం ప్రపంచ మానవుల విముక్తికి సంబంధించిన మార్గం ఉంది. నిర్దిష్టం నుంచి సాధారణీకరణకు జరిగిన ప్రయాణం ఉంది. చాలామంది అగ్రకుల మేధావులు చెబుతున్నట్లూ, కొంతమంది బహుజన ఆలోచనాపరులూ అభిప్రాయపడుతున్నట్లు అంబేడ్కరిజం అస్తిత్వవాదం కాదు. కేవలం గుర్తింపు కోసం ఆత్మగౌరవం కోసం జరపాల్సిన పోరాటాలకీ, సిద్ధాంతాలకీ మాత్రమే అంబేడ్కరిజం పరిమితం కాలేదు. కుల వ్యవస్థ వల్ల మనుషులు మనషులుగా ఉండలేకపోతున్న పరిస్థితి నుంచీ, అన్ని రకాల అణచివేతలకూ అధిక సంఖ్యాకుల్ని గురిచేస్తున్న నిచ్చెన మెట్ల వ్యవస్థ నుంచి విముక్తి సాధించటం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా సమాజాన్ని పునర్న్మించుకోవాల్సిన ఆవశ్యకతనీ, తీరుతెన్నుల్ని అంబేడ్కరిజం అందిస్తుంది. ఇక్కడే అంబేడ్కరిజం అటు భారతీయ అగ్ర కులస్తులకీ, అంతర్జాతీయ జన సమూహాలకి కూడా అప్పీలయ్యే స్థాయిని తెచ్చుకుంది. అంబేడ్కర్‌ కులవ్యవస్థను క్రమబద్ధంగా విశ్లేషించి గతంలో జరిగిన కులవ్యతిరేక పోరాటాల్ని శాస్ర్తీయంగా అధ్యయనం చేశారు. గతంలో ప్రతిపాదించిన కులాల ఉద్ధరణ, అస్పృశ్యతా నిర్మూలనా అనే భావనలకున్న పరిమితుల్ని గుర్తించారు. తద్వారా కుల నిర్మూలన అనే కొత్త భావనను అందించారు. అంబేడ్కరిజంలో విమోచనకు రెండు దారులున్నాయి. ఒకటి రాజకీయ విమో చన, రెండు మానసిక విమోచన. అంబేడ్కర్‌ అభివృద్ధి చేసిన పొలిటికల్‌ ప్రాగ్మాటిజంలో రాజకీయ విమోచన మూలాలున్నాయి. జాన్‌ డ్యూయీ ప్రతిపాదించిన వ్యావహారిక సత్తావాదం (pragmatism)కి చెందిన ఆచరణానుకూలత అంబేడ్కర్‌ని బాగా ప్రభావితం చేసింది. అలాగే అంబేడ్కర్‌ ప్రతిపాదించిన మాన సిక విమోచన మూలాలు బుద్ధిజంలో ఉన్నాయి. మన సమాజ మార్పు కోసం, అంబేడ్కర్‌ తన జీవిత కాలంలో, ఈ రెండు విమోచనల్నీ సైమల్టేనియస్‌గా ఉప యోగిస్తూ పోయారు. సమయ సందర్భాల్ని బట్టి వీటి ప్రాముఖ్యతలు మారుతూ ఉండటం – స్థానభ్రంశం చెందటం – అంబేడ్కర్‌ ఆచరణ క్రమంలో మనకి కనిపిస్తుంది. ఫలితంగా విలువలతో కూడిన పట్టువిడుపుల ధోరణి అంబేడ్కర్‌కు అలవడింది. తన దృష్టిలో సాధారణత కంటే నిర్దిష్టతకి ప్రాధాన్యం పెరిగింది. ఒక రకమైన సమాజ క్రమ పరిణామ వాదం అంబేడ్కర్‌కి హేతుబద్ధం అనిపించింది. ఒకేసారి సంభవించే సంపూర్ణ మార్పులో అంబేడ్కర్‌కి నమ్మకం లేకుండా పోయింది కనుక, ప్రయోగశీలత, సామాజిక ఫలితాలపై కేంద్రీకరించటం, సామాజిక మార్పుకు అవి ఉపయోగపడుతున్న తీరు మీద ఆధారపడి భావాలను అంచనా కట్టడాన్ని అంబేడ్కర్‌ ఆచరణలో పెట్టారు. ఇందులో భాగంగానే అస్పృశ్యుల విమోచనకి సాధనంగా విద్యని అంబేడ్కర్‌ భావించారు. పాఠశాలల్ని సామాజిక పరివర్తనా సాధనాలుగా పరిగణించారు. ఉన్నత విద్య దళితుల్ని రాజ్యాధికార సాధన వైపునకు నడుపుతుందని భావించారు. సమాజం అంచలంచలుగా మారుతూ సంపూర్ణ మార్పుని పొందుతుంది కనుక క్రమ సంస్కరణలే వాస్తవిక మార్గాలని ఆయన గ్రహించాడు. ఈ దేశంలో అత్యంత అణగారిన అస్పృశ్యులు విముక్తి పొందినప్పుడే ఇది సాధ్యపడుతుందని గుర్తించడంలో కాకుండా, ఇందుకు కులనిర్మూలన అవసరమని స్పష్టంగా భావించారు. అయితే ఇది విశాల సమాజం– ముఖ్యంగా అగ్రకులాల– మద్దతు లేకుండా సాధ్యం కాదని ఆయన గ్రహించారు. హిందువులు తమ పురాతన క్రూర ఆచారాల నుంచి బయటపడి, సంస్కరణలు సాగించే క్రమంలో కలిసి వస్తారని ఆశించారు. వాస్తవంలో ఇది సాధ్యపడలేదు. అస్పృశ్యులకు ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని కల్పించటం దీనికి మార్గంగా ఆయన భావించారు. అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయటానికి అంగీకరిస్తూ బ్రిటిష్‌ ప్రధానమంత్రి ప్రకటించిన కమ్యూనల్‌ అవార్డును ఒక విజయంగా అంబేడ్కర్‌ పరిగణించారు. దీనికి గాంధీ ఆమరణ నిరాహార దీక్ష అడ్డుగా నిలిచింది. ఇది అంబేడ్కర్‌ని ఉమ్మడి నియోజకవర్గాలలో సీట్ల రిజర్వేషన్‌కి అంగీకరించేట్లు చేసింది. అస్పృశ్యులలోని కులాలు, ఉపకులాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి వారిని ఒక ఏకీకృత వర్గంగా పరిగణిస్తూ అంబేడ్కర్‌ తన రాజకీయ ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పటికీ – అనుభవ పూర్వకంగా – రాజకీయాలలో ఒక్క కులంపైననే ఆధారపడటం సాధ్యం కాదని ఆయన గ్రహించారు. ఈ గ్రహింపు నుంచే ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ (ఐ.యల్‌.పి)ని స్థాపించారు. ఈ పార్టీ ద్వారా ఎన్నికలలో చెప్పుకోదగ్గ విజయాల్ని అంబేడ్కర్‌ సాధించారు. అధికార బదలాయింపు కోసం జరుగుతున్న రాజకీయ సంప్రదింపుల నుంచి అంబేడ్కర్‌ని దూరంగా ఉంచడంలో అగ్రకుల రాజకీయాలు సక్సెస్‌ అయ్యాయి. అంబేడ్కర్‌ ప్రయత్నించి మొదట ముస్లిం లీగ్‌ సహాయంతో, ఆ తరువాత కాంగ్రెస్‌ సహాయంతో రాజ్యాంగ సభలో స్థానం సంపాదించగలిగారు. రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్టింగ్‌ కమిటీకి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. ఈ కాలంలో రాజ్య సోషలిజాన్ని ప్రతిపాదిస్తూ ‘స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. రాజ్యాంగ ముసాయిదాను రూపొందించటానికి ఎన్నో రాజీలు పడాల్సి వచ్చింది. అస్పృశ్యుల రక్షణ కోసం, వారి భవిష్యత్తు భద్రత కోసం అంబేడ్కర్‌ డ్రాఫ్టింగ్‌ కమిటీలో పనిని ఎక్కువ భాగం స్వయంగా చేసినప్పటికీ, తయారయిన రాజ్యాంగం ఆయనకు సంతృప్తినివ్వలేదు. రాజకీయ విమోచనలో చివరి ప్రయత్నంగా ఆయన భారత రిపబ్లికన్‌ పార్టీని రూపొందించారు. సాంఘిక విముక్తికి రాజకీయ విముక్తి కీలకమని ఆయన ప్రకటించారు. అంబేడ్కర్‌ దృష్టిలో మానసిక విమోచన అంటే భౌతిక విమోచనే. ప్రజల మనసుల్ని హెచ్చుతగ్గుల భావజాలంతో నింపిన హిందూ మత సారం నుంచీ – దానికి సాంస్కృతిక సాధనమయిన బ్రాహ్మణ వాదం నుంచి – ఆ క్రమంలో కొనసాగుతున్న మానవ ఆర్థిక, రాజకీయ సంబంధాల నుంచీ ప్రజల మనసుల్ని బయటవెయ్యటమే మానసిక విమోచన. ‘కుల నిర్మూలన’ అనే గ్రంథంలో కులాల మూలాలు హిందూ ధర్మ శాస్ర్తాలలో ఉన్నాయి కనుక వాటిని ధ్వంసం చేయకుండా కులనిర్మూలన సాధ్యం కాదనే కంక్లూజన్‌కు అంబేడ్కర్‌ వచ్చారు. ఇది కుదిరే పని కాదు కనుక హిందూ మతాన్నే విడనాడాలని సంకల్పించారు. ముస్లింలతో దళితుల్ని పోలుస్తూ దళితుల మీద సాగించినట్లు ముస్లింల మీద హిందువులు దాడులు సాగించే సాహసం చేయరని ఆయన చెబుతారు. అందువల్ల దళితులు తమ బలానికి తోడుగా బయటి నుంచి మద్దతు కూడగట్టుకునే దిశగా ఆలోచించాలని అంబేడ్కర్‌ ఒక నిర్ధారణను ఇస్తాడు. ఈ విధంగా దళితులకు తమ మతాన్ని మార్చుకొని, గుర్తించదగిన సంఖ్యలో అనుయాయులు ఉన్న వేరే మతంలోకి చేరాల్సిన అవసరం ఉందని అంబేడ్కర్‌ నొక్కి చెబతారు. మతమార్పిడి వల్ల వ్యక్తి ఔన్నత్యం పెరుగుతుందనీ, వ్యక్తి పుట్టుక స్వీయ విమోచన కోసమే అని ఆయన తేల్చి చెబుతారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు 1956లో అంబేడ్కర్‌ బౌద్ధాన్ని ఎంచుకోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించదు. కుల వ్యవస్థపై పోరాడే క్రమంలో రూపొంది, వికసన చెందటమే కాకుండా దానికి ఎన్నడూ లొంగని ఒకే ఒక భారతీయ మతం బౌద్ధం అనేది అంబేడ్కర్‌ అవగాహన. ఆయన దృష్టిలో క్రైస్తవం, ఇస్లాం, సిక్కు మతం భారతదేశంలో తమ సమూహాలలో కులవ్యవస్థ చోటుచేసుకోవడంతో రాజీపడ్డాయి. ఆయన దృష్టిలో బౌద్ధం ఒక్కటే రేషనాలిటీకీ, ఆధునిక విజ్ఞాన శాస్ర్తానికి సరిపోయే మతం. మూఢవిశ్వాసం, కట్టడి స్థానంలో వివేచన, మానవ సంబంధాలలో ప్రేమ, కరుణ, సంపూర్ణ సమానత అనే మూడు విలువలను బౌద్ధం బలంగా ప్రతిపాదించి ఆచరణలో పెట్టిందని అంబేడ్కర్‌ పేర్కొన్నారు. బౌద్ధాన్ని ఎంపిక చేసుకోవడంలో అంబేడ్కర్‌ ఉద్దేశం హిందూ మతాన్నీ, కులవ్యవస్థనీ సమూలంగా తిరస్కరించటమే కాదు అమలులోని బౌద్ధ సంప్రదాయాల్ని విమర్శనాత్మక దృష్టి నుంచి అంచనా కట్టడం కూడా. విశ్వజననీ సత్యంతో హేతుబద్ద అవగాహనను జోడించిన ఒక మానవీయ సామాజిక మతంగా బౌద్ధాన్ని పునర్నిర్మించాలని అంబేడ్కర్‌ తలపెట్టారు. బౌద్ధాన్ని వ్యక్తిగత మోక్షాన్ని అందించే స్థాయి నుంచి సామూహిక విమోచన కోసం పాటించదగ్గ జీవన మార్గ స్థాయికి అంబేడ్కర్‌ అభివృద్ధి చేశారు. తన బౌద్ధాన్ని నవయాన బౌద్ధం అని పిలవటమే కాకుండా, నవయానను కేవలం దళితుల కోసమే ఉద్దేశించలేదు సమస్త మానవాళి కోసం ఒక విశ్వ సందేశంగా ప్రతిపాదించారు. అంబేడ్కర్‌ రూపొందించిన నవయాన బౌద్ధం మనుషులంతా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువల ప్రాతిపదికగా జీవితాన్ని గడిపే ఒక మార్గం. అలాగే నవయాన బౌద్ధం మార్క్స్‌ ఊహించిన కమ్యూనిజానికి దగ్గరగా వస్తుంది. ఆధునిక జీవితంలో విస్తరిస్తూ పోతూ ఉన్న మానవ అవసరాలు మొత్తం మన మనుగడనే నాశనం చేసే స్థాయకి చేరుకున్నాయి. అల్ప వినిమయం ద్వారా, అన్ని జీవరాశుల పట్ల కరుణను వ్యాప్తి చెయ్యడం ద్వారా బౌద్ధం ఆధునిక సంక్షోభాలకు పరిష్కారమవుతుంది. తన జీవిత కాలంలో అంబేడ్కర్‌ అటు రాజకీయ విమోచననూ, ఇటు మానసిక విమోచననూ సందర్భోచితంగా అన్వయిస్తూ తన ఉద్యమాన్ని సాగించారు. అంబేడ్కర్‌ ఆచరణని కానీ, సిద్ధాంతాన్ని కానీ పొలిటికల్‌ ప్రాగ్మాటిజం, సైకలాజికల్‌ మెటీరియలిజంల కలయికగా చూడటం ద్వారానే సరిగా అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడే అంబేడ్కరిజం అస్తిత్వవాదం కాదనీ, అది మానవ విమోచన వాదమనీ తెలుస్తుంది. అంబేడ్కరిజం కేవలం అస్పృశ్యులకూ, ఇతర పీడిత కులాల ప్రజలకూ మాత్రమే కాక సకల జనుల సంకెళ్ళకు విరుగుడు. పీడితులే పీడనకు పీడకులతో కలిసి సంరక్షించే కులవ్యవస్థకు, పేదవాళ్ళే పేదరికాన్ని పవిత్రంగా స్వీకరించే హిందూ మెట్ల వ్యవస్థకు, అణచివేతకు గురవుతున్న వాళ్ళే అణచివేతను కాపలాకాసే మాయా వాస్తవికతకు అంబేడ్కరిజం అసలు సిసలు పరిష్కారం. జైభీం జై పూలే నమో బుద్ధా జీ లక్ష్మీ నర్సయ్య
130 వీక్షించారు
4 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..