తెలుగు భాష పరిరక్షణ💐🎂
36 Posts • 18K views
P.Venkateswara Rao
525 views 21 hours ago
#తెలుగు భాష పరిరక్షణ💐🎂 *ఒత్తులు లేని తెలుగు దస్తూరీ… ఒరిజినాలిటీకే భంగకరం…❗* January 24, 2026🦑 హంస గీతా? హింస గీతా? ఒత్తుల్లేని తెలుగు సాధ్యమేనా? తెలుగు అక్షరం ప్రత్యేకించి ఒత్తులమీద ఇప్పుడు కొత్త ప్రయోగాలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు చంద్రగిరి వెంకటేశ్వర్లు ప్రతిపాదించిన ‘హంసగీత’ (తేట తెలుగు) లిపిపై ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ఒత్తులు తీసేసి తెలుగును సరళం చేయాలన్నది ఆయన తపన. వినడానికి ఈ ఆలోచన అద్భుతంగా ఉన్నా, ఆచరణలోకి వస్తే ఇది భాషా వికాసం కంటే భాషా వినాశనానికే దారితీసేలా ఉందన్నది భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. ఆకర్షణీయమైన ఆలోచన.. కానీ ప్రమాదకరం! 33 ఒత్తులను తీసేసి, కేవలం ఒక ‘గీత’తో పని ముగించేయాలన్న ప్రతిపాదన వినడానికి చాలా హాయిగా ఉంటుంది. పిల్లలకు అభ్యసనం సులభం కావడం, టైపింగ్ వేగం పెరగడం, పుస్తక ముద్రణలో కాగితం ఆదా కావడం వంటివి ఇందులో పైకి కనిపించే లాభాలు. కానీ, ఒక భాష అంటే కేవలం కొన్ని అక్షరాల కూర్పు మాత్రమే కాదు; అది వేల ఏళ్ల సంస్కృతికి, పలికే శబ్దానికి సంకేతం. ఒక్క గీతతో అన్ని ఒత్తులను సంకేతించడంవల్ల ‘ద్విత్వ’, ‘సంయుక్త’ అక్షరాల మధ్య తేడా కనుమరుగవుతుంది. ఇది భాషలో అంతులేని గందరగోళానికి దారితీస్తుంది. ఉదాహరణకు, ‘మొక్క’ అన్న మాటలో ‘క’ మీద గీత గీస్తే అది ‘క’ ఒత్తు అనుకోవచ్చు. కానీ ‘పుష్కలం’ అన్న మాటలో ‘ష’ మీద గీత గీస్తే, అప్పుడది ‘ష’ ఒత్తు అవుతుందా? లేక ‘క’ ఒత్తు అవుతుందా? ఇలాంటి అస్పష్టతలు భాషా సౌందర్యాన్నే కాదు, అర్థాన్ని కూడా దెబ్బతీస్తాయి. లిపి మారితే.. చరిత్ర మాయం! మనం నేడు ఒక కొత్త లిపిని అలవాటు చేసుకుంటే, రాబోయే తరం మన ప్రాచీన సాహిత్య సంపదను అసలు చదవలేదు. నన్నయ్య భారతం నుండి మొన్నటి సినారె సాహిత్యం దాకా అన్నీ వారికి అర్థం కాని ‘గ్రీకు అక్షరాలు’ అయిపోతాయి. ఒక తరం తన మూలాలను కోల్పోవడం కంటే పెద్ద విషాదం మరొకటి ఉండదు. లిపిని మార్చడం అంటే మన గతాన్ని మనం తగులబెట్టుకోవడమే అవుతుంది. ఇప్పటికే డిజిటల్ యుగంలో తెలుగు వాడకం కొత్త పుంతలు తొక్కింది. నేటి యువత తెలుగును ఇంగ్లీష్ అక్షరాల్లో (Transliteration) యథేచ్ఛగా రాసేస్తున్నారు. అమ్మ, నాన్న అని తెలుగులో రాయడానికి బదులు ‘Amma’, ‘Nanna’ అని ఇంగ్లిష్ అక్షరాలతో రాస్తున్నప్పుడు వారికి తెలుగు లిపితో పని లేదు, భాషా భావంతోనే పని. మంచో, చెడో ఇప్పటికే వాడుకలో ఇదొక అలవాటుగా ఉండగా, మళ్ళీ తెలుగు లిపిలోనే కొత్తగా ‘గీతలు’ పెట్టి గందరగోళం సృష్టించడం వల్ల…వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. అభినందనీయమైన తపన.. కానీ ఆచరణ సాధ్యమేనా? మాతృభాష అంతరించిపోకూడదనే ఆవేదనతో వెంకటేశ్వర్లు తన సొంత ఖర్చుతో చేస్తున్న ఈ కృషిని మాత్రం గుర్తించాల్సిందే. ఆయన సంకల్పం గొప్పదే అయినప్పటికీ, లిపి మార్పు కేవలం భావోద్వేగాలతో కూడుకున్నది కాదు. ఇది భాషా విజ్ఞాన శాస్త్రం (Linguistics), ఉచ్చారణా శాస్త్రం (Phonetics)లాంటి ప్రామాణిక అంశాలతో ముడిపడి ఉండాలి. పాత రికార్డుల డిజిటలైజేషన్ నుండి ప్రభుత్వ ఆమోదం వరకు ఇందులో ఎన్నో ఆచరణాత్మక అడ్డంకులు (Practical hurdles) ఉన్నాయి. ఉన్నది పదిలంగా వాడితే చాలు భాషను కాపాడటం అంటే దాని రూపాన్ని మార్చడం కాదు, దాన్ని వాడే విధానాన్ని మెరుగుపరచడం. ప్రస్తుతం మనకున్న లిపి ఎంతో శాస్త్రీయమైంది, స్పష్టమైంది. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ‘వాయిస్ టైపింగ్’ ద్వారా ఒత్తుల సమస్య ఎప్పుడో తీరిపోయింది. అందుకే, ఉన్న లిపిని మార్చడం కంటే, దాన్ని అలాగే కొనసాగిస్తూ తెలుగును మరింత మందికి చేరువ చేయడంపై మనం దృష్టి పెట్టాలి. ప్రయోగాలు మంచివే కానీ, అవి భాషా స్వచ్ఛతను, చారిత్రక వారసత్వాన్ని బలితీసుకునేవి కాకూడదు. *పమిడికాల్వ మధుసూదన్* 9989090018
12 likes
16 shares
P.Venkateswara Rao
586 views 3 months ago
#తెలుగు భాష పరిరక్షణ💐🎂 *కన్నడ- తెలుగు సంకర భాష… తెలుగుకు ఇదోరకం చేతబడి..‼️* October 16, 2025..✍️ “పోతనార్యుని గేహమున భారతీదేవి చిగురు చేతుల వంట చేయునాడు…” అని బమ్మెర పోతన ఇంట్లో సరస్వతీదేవి ఇష్టంగా వంట చేసి పెట్టేదని… అందుకే పోతన కవితకు అంతటి మహిమ అని గుర్రం జాషువా అన్నాడు. అలాంటి పోతన తెలుగు మందార మకరంద మాధుర్యమున ఓలలాడించిన పరమోత్కృష్ట భాగవతాన్ని ఎక్కడ రాజులకు అంకితం ఇస్తాడో అని సాక్షాత్తు సరస్వతీ దేవి బాధపడి… ఆయన ముందు కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటే- “కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో! కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!” ….. అని పోతన హామీ ఇచ్చాడు. ఆమె సంతోషించి పోతనకు మరింతగా తెలుగు భాషలో పౌష్ఠికాహారాన్ని చేసి పెట్టింది. అయిదు శతాబ్దాలతరువాత ఇప్పుడు మళ్ళీ అదే తెలుగు సరస్వతి కాటుక కంటినీరు బుగ్గలపైనే కాకుండా ఒళ్ళంతా తడిసేలా ఒకటే ఏడుస్తోంది. చదువులతల్లి సరస్వతీ దేవి ఆలయాల్లో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు చదువు బాగా ఒంటపడుతుంది. జ్ఞానం వికసిస్తుంది. బుద్ధిమంతులవుతారు. వృద్ధిలోకి వస్తారు. అలాంటి ఓ సరస్వతి ఆలయంలో ఓం ప్రథమంగా అక్షరాభ్యాసానికి వెళ్లేదారిని సూచించే బోర్డును చూసి అక్షరాభ్యాసం చేయించే సరస్వతీదేవి వెక్కి వెక్కి ఏడుస్తోంది. “అక్షరభ్యసమునకు వేళ్ళు దారి” అని తాటికాయంత అక్షరాలతో గుడ్డివారికైనా కనిపించేలా రాసిపెట్టారు. సరస్వతీదేవి ఆలయంలో బోర్డు కాబట్టి… అందునా అక్షరాభ్యాసానికి సంబంధించిన విషయం కాబట్టి తప్పులు ఉండకూడదు అని అనుకోవడం తప్పు. ఇంగ్లిష్ లో తప్పు రాస్తే బాధపడాలికానీ… తెలుగులో ఇలాంటి తప్పులు సహజం అని లోకం దశాబ్దాల క్రితమే పెద్దమనసుతో అంగీకరించింది! ఈ తప్పులో కొన్ని తాత్విక సంకేతాలు దాగి ఉన్నాయి. వాస్తవానికి ప్రతీకగా ఉంది. తెలుగులో “అక్షరభ్యసం” చేస్తే చాలు. అది మన జీవనదారుల్లో బాగా వేళ్ళుతన్ని తెగులు చెట్టుగా ఏపుగా, బలంగా పెరుగుతుంది. ఈ సంకల్పానికి తగినట్లు తెలుగులో చక్కగా రాశారు. ఈ బోర్డు ఎక్కడుందో ప్రభుత్వ దేవదాయ శాఖ కనుక్కుని… అన్ని దేవాలయాల్లో ఇలాంటి తెలుగు “వేళ్ళుదారి” బోర్డులే పెట్టించాలి. అప్పుడు మన పిల్లల అక్షరాభ్యాసానికి ఆ దారుల్లో తెగులు వేళ్ళే దిక్కు! పాపం… ప్రభుత్వానికి ఒక్కో “అక్షరభ్యసముకు” వచ్చే వెయ్యి రూపాయల ఆదాయం మీద ఉన్న దృష్టి… అక్షరదోషాల మీద ఉండదు. ఎందుకంటే దానిపేరే “దేవాదాయ” శాఖ కాబట్టి! తెలుగులో అక్షరాభ్యాసం ఇలా మొదలైతే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి లెక్కలేనన్ని ఉదాహరణలు. హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్ ప్లాట్ ఫార్మ్ లను తెలిపే బోర్డులో ఇంగ్లిష్, హిందీలో లేని తప్పు తెలుగులో మాత్రమే వచ్చి…దారి కాస్తా “ధారీ” అయ్యింది. గిరిధారీలా ఇది ప్లాట్ “ఫార్మ్ ధారీ” అంటే ప్లాట్ ఫార్మ్ ను ధరించినవాడు అనే అర్థంలో కొత్తమాటను పుట్టించి ఉంటే… మన అజ్ఞానం క్షమింపబడుగాక! డాబర్ రెడ్ టూత్ పేస్ట్ వాడైతే ఏకంగా రోజూ ఉదయాన్నే కన్నడ రాళ్లతో తెలుగువాళ్ళ పళ్ళు ఊడగొట్టి తెలుగువారి చేతిలోనే పెడుతున్నాడు. “దేశంలో తయారైంది- దెశావు ప్రీతి (ఇందులో మొదటి పదం కన్నడ- రెండో పదం తెలుగుగా భావించవలెను) అని కన్నడలో కూడా తప్పుగానే రాసి… కన్నడ లిపితోపాటు తెలుగు ప్రకటనలో భాషాతీత సిద్ధిని సాధించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు! వాడే శీర్షికలో అన్నట్లు తెలుగు కొత్త అవతారమిది! “దెశావు” ప్రీతి అని రాశారు. “దేశద ప్రీతి” అని ఉండాలి కన్నడ భాష- తెలుగు లిపి అయితే! రాతలో ప్రీతి అనేది కూడా తప్పు. కన్నడ లిపిలో “ಪ್ರೀತಿ” అని రాయాలి. తెలుగు దేశంలోనే కాకుండా కన్నడ, మరాఠీ దేశంలో అన్నిచోట్లా సమస్త ప్రాతీయభాషల్లో దేశంలో గర్వంగా తయారవుతున్న అనువాద ప్రకటనల్లో భాష ఇలాగే అఘోరిస్తోంది! బమ్మెర పోతన రాసిన అంతమంచి తెలుగు భాగవతాన్ని నీచమైన రాజులకు అంకితమిస్తాడేమోనని సరస్వతి అప్పుడు ఏడ్చింది. తన కోవెల కొలువుల్లోనే ఇంత నీచమైన తెలుగును చదవలేక ఇప్పుడు ఏడుస్తోంది. తెలుగు సరస్వతికి అప్పుడు, ఇప్పుడు, ఇంకెప్పటికీ ఏడుపు మాత్రం తప్పడం లేదు! ఇన్నిన్ని భౌతికమైన, బౌద్ధికమైన దాడులు; నిర్లక్ష్యాలు; నిస్పృహలు; నైరాశ్యాలను దాటుకుని, తట్టుకుని తెలుగు ఈమాత్రం నిలబడుతోందంటే అది కేవలం కాకతాళీయం! మన పూర్వజన్మల పుణ్యఫలం- అంతే!! *పమిడికాల్వ మధుసూదన్* 9989090018
16 likes
8 shares