వైజాగ్ లో గూగుల్
2 Posts • 1K views
P.Venkateswara Rao
562 views 1 months ago
#వైజాగ్ లో గూగుల్ *వైజాగ్ ఏఐ డేటా సెంటర్❗* OCTOBER 28, 2025👀 వైజాగ్లో రాబోయే ఏఐ డేటా సెంటర్ గురించి చాలా గందరగోళం రావడానికి కారణం ఆంధ్ర ప్రభుత్వం పాటిస్తున్న గోప్యత. తెలంగాణలో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. రావడం సహజమే అన్నట్లుగా ప్రభుత్వమూ, ప్రజలూ ఫీలవుతున్నారు. ఆంధ్రలో ప్రతీదీ వివాదమే! దీనికి కారణం – ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరాలు బయటకు రావటం లేదు. టిడిపి నాయకులు తమకు తోచిన మాటలు చెప్తున్నారు. ఎవరైనా ప్రశ్నలు వేస్తే వాళ్లు ఆంధ్ర ప్రగతిని అడ్డుకునే వారిగా ముద్ర కొడుతున్నారు. రాష్ట్ర ప్రగతికై పరిశ్రమలు తప్పకుండా రావాలి. డబ్బే కాదు, ఏదీ ఊరికే రాదని ప్రజలకు తెలుసు. పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వం మినహాయింపులు యివ్వాలనీ, పరిశ్రమలతో పాటు పర్యావరణ కాలుష్యమూ తోడుగా వస్తుందనీ కూడా తెలుసు. పరిశ్రమలు కావాలి, ఎట్ వాట్ కాస్ట్ అండ్ ఫర్ వాట్ బెనిఫిట్? అనేది తెలుసుకునే హక్కు ప్రజలకు వుంది. ఏ కన్సెషన్లు యిస్తున్నామో, ఏ మేరకు కాలుష్యం జరుగుతుందో, దాని నివారణకై ఏ చర్యలు తాను చేపడుతోందో, లేక కంపెనీ చేత చేపట్టిస్తోందో చెప్పి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. అఫ్కోర్స్, అవి ఏ మేరకు అమలవుతాయనేది వేరే విషయం. కానీ ఏదో ఒకటి చెప్పాలి కదా! అలాగే ఉద్యోగకల్పన గురించి కూడా స్పష్టత వుండాలి. ఈ రోజుల్లో ప్రతీదీ నిరుద్యోగితకు ముడి పడి వుంటోంది. నిరుద్యోగ సమస్య ప్రభుత్వాలను మార్చివేస్తోంది. అందువలన దీని వలన యిన్ని ఉద్యోగాలు వస్తాయి, అన్ని వస్తాయని టీవీల్లో చెప్పడమో, తమ పత్రికల్లో రాయించడమో తప్ప ప్రభుత్వపరంగా కానీ, కంపెనీ పరంగా కానీ ప్రకటనలు రావు. ఒప్పందాల్లో వుండదు. ఆ వివరాలు తెలిస్తే ప్రభుత్వం ఎకరాలకు ఎకరాలు ఉచితం గానో, కారుచౌకగానో కట్టపెడుతున్నా జస్టిఫికేషన్ వుందిలే అని ప్రజలు అనుకుంటారు. కానీ అది చెప్పరు. దాంతో అనుమానాలు వెల్లువెత్తుతాయి. ఇది అన్ని పరిశ్రమలకు కామనే కానీ యీ వైజాగ్ డేటా సెంటర్ విషయంలో మరో ఫ్యాక్టర్ వచ్చి చేరింది. చంద్రబాబు లోకేశ్ను లిఫ్ట్ చేసే పనిలో వున్నారన్న సంగతి సర్వవిదితం. ముఖ్యమంత్రి కావడానికి అతనికి అన్ని అర్హతలూ వున్నాయనీ, రాజకీయంగా, ఎడ్మినిస్ట్రేషన్ పరంగా, దిల్లీ లాబీయింగ్ పరంగా తండ్రిని మించిన తనయుడు అయ్యే సూచనలున్నాయనీ ఆంధ్రుల మెదళ్లలో పొజిషన్ చేయడానికి సర్వ ప్రయత్నాలూ జరుగుతున్నాయి. దానిలో తప్పేమీ లేదు. అతనికి ఆ టాలెంట్ లేదని కానీ, ధారాళంగా వుందని కానీ నేనేమీ అనబోవటం లేదు. సమయమే దానికి సమాధానం చెప్తుంది. ప్రస్తుతానికి మాత్రం 'చంద్రబాబు మైక్రోసాఫ్ట్ తెస్తే, తనయుడు గూగుల్ తెచ్చాడు' అనే థీమ్తో యీ పబ్లిసిటీ బ్లిట్జ్ సాగుతోంది. దానివలన అతిశయోక్తులు వినబడుతున్నాయి, వాటితో పాటు ఘాటు విమర్శలూ వస్తున్నాయి. నిజమేదో తెలియకుండా పోతోంది. ఒక సాధారణ పాఠకుడిగా నేనూ కన్ఫ్యూజ్ అవుతున్నాను. నా బోటి వాళ్ల కోసం దొరికినంత సమాచారాన్ని సేకరించి, అందిస్తున్నాను. నాకు సాంకేతిక విషయాలు బొత్తిగా తెలియవు కాబట్టి, అవగాహనా లోపం వుండవచ్చు. తప్పులుంటే ఎత్తి చూపిస్తూ వ్యాఖ్యలు పెట్టండి. నాకు దురుద్దేశాలేవీ అంటకట్టే పని పెట్టుకోకండి. వాస్తవమేమిటో ఆధారాలతో చెప్పండి చాలు. ఇక ప్రశ్నోత్తరాల రూపంలో నేను సేకరించిన సమాచారాన్ని మీతో పంచుకుంటాను. ఈ వ్యాసం రెండు భాగాలుగా వుంటుంది. నీరు, విద్యుత్, ఉద్యోగకల్పన వగైరా విషయాలను రెండో దానిలో చర్చిస్తాను. వాటి గురించిన వ్యాఖ్యలు యిప్పుడే పెట్టకండి. *దీన్ని గూగుల్ ఏఐ డేటా సెంటర్ అంటున్నారు. మొత్తమంతా గూగుల్దేనా? దీనిలో యితరులు కూడా వున్నారా?* ఉన్నారు. మొత్తం పెట్టుబడి 10 బిలియన్ డాలర్లు అన్నారు. తర్వాత 15కి పెంచారు. దీన్ని 2026-30 మధ్య ఐదేళ్లలో పెడతారు. ఈ సెంటర్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్, గ్రీన్ ఎనర్జీ సప్లయి చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తున్న అదానీ గ్రూపు ఒక భాగస్వామి. ఇక్కణ్నుంచి ఆగ్నేయాసియా దేశాలు కేబిలింగ్ చేసేందుకు (ఫైబర్ కనెక్టివిటీ) ఎయిర్టెల్ని కూడా భాగస్వామిగా చేసుకున్నారు (అదానీ వెబ్సైట్లో అది రాశారు). గూగుల్ తన సబ్సిడియరీ ద్వారా పెట్టుబడి పెడుతూంటే, అదానీ గ్రూపు అదానీకనెక్స్ ద్వారా పెడుతోంది. దీనిలో అదానీ ఎంటర్ప్రైజెస్కీ, ఎడ్జ్కనెక్స్కి సగం సగం వాటాలున్నాయి. ఎయిర్టెల్ ఎంత పెట్టిందో తెలియదు. ఎవరి వాటా ఎంత అనేది ఎక్కడా చెప్పటం లేదు. గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చాయ్ 15 బిలియన్ పెడుతున్నామన్నాడు. తమ వాటాయే 15 అనే అర్థంలో కాకపోవచ్చు, భాగస్వాములతో కలిపి కావచ్చు. అదానీ వారి వెబ్సైట్లో 'ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 15 బిలియన్స్' అని వుంది. 15 బిలియన్ డాలర్లంటే అంటే 1500 కోట్ల డాలర్లు. డాలరుకి 88 రూ.ల రేటు చొప్పున లెక్క వేస్తే రూ. 1.32 లక్షల కోట్లు. 'అదానీ 87 వేల కోట్లు పెట్టుబడి పెట్టార'ని జగన్ అన్నారు. డాలరుకి 87 రూ.ల రేటు చొప్పున చెప్పి వుంటే 10 బిలియన్ డాలర్లు అదానీయే పెట్టారని అనుకోవాలి. తక్కిన 5లో కొంత ఎయిర్టెల్, కొంత గూగుల్ పెట్టి వుంటాయి. ఈ అంకె తప్పని యిప్పటిదాకా ఎవరి నుంచీ ఖండన రాలేదు. *'కూటమి వర్గాలు గూగుల్ అనే అంటున్నాయి తప్ప అదానీ, ఎయిర్టెల్ భాగస్వామ్యం గురించి ఎందుకు మాట్లాడటం లేదు?* సమాధానం వారికే తెలియాలి. తండ్రి మైక్రోసాఫ్ట్, తనయుడు గూగుల్ అనే పాట పల్లవిని డైల్యూట్ చేయడం యిష్టం లేక కావచ్చు! అదానీ మాట ఎత్తగానే వైసిపి హయాంలో పెట్టిన దాని ఎక్స్పాన్షన్ అన్నమాట అంటారేమోనన్న భయం కావచ్చు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అక్టోబరు 24న 'జగన్ హయాంలో వచ్చిన అదానీ డేటా సెంటర్ వేరు, యిప్పటి గూగుల్ సెంటర్ వేరు' అన్నారు. అదానీ వెబ్సైట్ ప్రస్తుత గూగుల్ సెంటర్లో తమకూ, ఎయిర్టెల్కు కూడా భాగస్వామ్యం వుందని రాసుకుంటోంది. జాతీయ మీడియాలో కూడా అదానీ భాగస్వామ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. *2023 నాటి అదానీ డేటా సెంటర్, 2025 నాటి గూగుల్ డేటా సెంటర్ వేర్వేరా?* వైసిపి హయాంలో మే 2023లో శంకుస్థాపన జరిగిన అదానీ డేటా సెంటర్ ఏఐ డేటా సెంటర్ కాదు. దాన్ని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ అండ్ బిజినెస్ పార్క్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నారు. దాని కెపాసిటీ 300 మెగావాట్లు. అది ఏఐ టెక్నాలజీని కూడా సపోర్టు చేస్తుంది అని చెప్పుకున్నారు. ఇప్పుడు వచ్చినది అచ్చగా ఏఐ డేటా సెంటర్. కెపాసిటీ 3.33 రెట్లు ఎక్కువ. అంటే 1000 మెగావాట్లు లేదా 1 గిగావాట్. టెక్నాలజీ పార్క్ సంగతి మాట్లాడటం లేదు. అదానీది మధురవాడలో పెడతానన్నారు. గూగుల్టి వైజాగ్ జిల్లాలోని తర్లువాడ (మధురవాడకు 16 కి.మీ.ల దూరం), అడవివారం, ముదసర్లోవ (మధురవాడకు మరో వైపు 14 కి.మీ.ల దూరం) గ్రామాల్లో అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి గ్రామంలో పెడుతున్నారు. 'దీనిలో అదానీ ప్రమేయం లేదు, కేవలం గూగుల్దే అంటే, మరి అదానీది ఏమైంది? వాళ్లకిచ్చిన భూములు వెనక్కి తీసుకున్నారా?' అనే ప్రశ్న వస్తుంది. మధురవాడలో పని ఏ మేరకు వచ్చింది, దాన్ని వదిలి పెట్టేశారా అనేది తెలియదు. డేటా సెంటర్ను అదానీ సంస్థే నిర్మిస్తుందని, ఆ సంస్థకు భూమి అప్పగించాలంటూ అక్టోబరు 4న గూగుల్ ప్రతినిథి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కరు రాసిన లేఖ అంటూ జగన్ ఒకటి విడుదల చేశారు. మర్నాడు స్టేటుమెంటు యిచ్చిన కేశవ్ దాన్ని ఖండించ లేదు. *అదానీ ప్రాజెక్టు పునాదులపై గూగుల్ ఏఐ సెంటర్ వస్తోంది అనుకోవచ్చా?* -అనుకోవచ్చు. అదానీ ఇండియాలో డేటా సెంటర్లు కడుతోంది. ప్రస్తుతానికి దానికి అహ్మదాబాదు, చెన్నయ్, నోయిడాలలో మొత్తం 6 వున్నాయి. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో 10 గిగా వాట్ డేటా సెంటర్లు కట్టాలనే ప్లాన్స్ వున్నాయి దానికి. అదానీ వైజాగ్లో డేటా సెంటర్ కట్టడం మొదలు పెట్టేనాటికి, గూగుల్కి యిటు వద్దామనే ఐడియా వుండి వుండదు. తర్వాత అమెరికాలో మారుతున్న పరిస్థితులు, యితర దేశాల్లో దీన్ని నెలకొల్పడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో వైజాగ్లో అదానీ యిప్పటికే కడుతున్న సెంటర్పై దృష్టి పడి, దాన్ని వుపయోగించుకుని, ఏఐకి ఎక్స్ క్లూజివ్ చేద్దామని, కెపాసిటీ పెంచి, ఆగ్నేయాసియా దేశాలకు కూడా బాగా విస్తరిద్దామని అనుకుని దీనిలో చేరి వుండవచ్చు. అదానీ సెంటర్ అనుకున్నప్పుడు సింగపూరు నుంచి 3900 కి.మీ.ల పొడవున కేబుల్ వేయాలనుకున్నారనీ, దానికై 2021 మార్చిలో తన ప్రభుత్వం సింగపూరుకి లేఖ రాసిందని జగన్ చెప్పుకున్నారు. ఇప్పుడు గూగుల్ మరింత విస్తరించి, ఆస్ట్రేలియా దాకా కేబుల్స్ వేయిదామని అనుకుని దీనిలో భాగస్వామి అయింది. *అదానీ ప్రాజెక్టు విస్తరణ అని అనడానికి టిడిపికి వచ్చిన కష్టమేమిటి?* “ఈనాడు” రాసిన ప్రకారం 2019 జనవరి లోనే అంటే బాబు ప్రభుత్వం దిగిపోవడానికి 4 నెలల ముందు, అదానీ గ్రూపు బాబు ప్రభుత్వంతో రూ. 70 వేల కోట్ల వ్యయంతో 20 ఏళ్లలో 5 గిగా వాట్స్ డేటా సెంటర్ కడతానని ఒప్పందం చేసుకుంది. చేసుకున్న 35 రోజుల్లోనే కాపులుప్పాడలో బాబు శంకుస్థాపన చేశారు. ఒక గిగా వాట్ సెంటర్కే నీరు, విద్యుత్ సరిపోవని గోల పెడుతూంటే (దాని గురించి రెండో భాగంలో చర్చిస్తాను), 5 గిగా వాట్స్కి ఏం చేద్దామనుకున్నారో, దానిపై అప్పుడు చర్చ జరిగినట్లు నాకు గుర్తు లేదు. 2019లో బాబు దిగిపోయి, జగన్ వచ్చాక అంత దీర్ఘకాలిక ప్రాజెక్టు అక్కరలేదని మెలిక పెట్టి, చిన్నదానికి మార్పించారని “ఈనాడు” రాసింది. ఒట్టి డేటా సెంటర్ కాదు, ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ అండ్ బిజినెస్ పార్క్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా వుండాలని అదానీని ఒప్పించారని రాయకపోవడంతో పాటు, ఇప్పుడు బాబు మళ్లీ అధికారంలోకి వచ్చి ఆ ప్రాజెక్టులో అదానీతో పాటు గూగుల్ని కూడా తెచ్చారని రాయలేదు. అలా రాస్తే కేశవ్ స్టేటుమెంటును ఖండించినట్లవుతుంది. జగన్ అధికారంలో వుండగా అదానీకి ఆంధ్రను తాకట్టు పెట్టాడని టిడిపి చాలా అల్లరి చేసింది. ఇప్పుడు తాము అంతకంటె ఎక్కువ సౌకర్యాలు కట్టబెడుతున్నామని బయటకు వస్తే సంజాయిషీ చెప్పుకోవలసి వస్తుందన్న భయం కావచ్చు. అదానీ పేరు రాగానే వైసిపి గుర్తు వస్తుందని టిడిపి భయం. నిజానికి ప్రభుత్వాలవి ఆన్ గోయింగ్ జాబ్స్. శంకుస్థాపన ఒక పార్టీ చేస్తే, ప్రారంభోత్సం మరొకరు చేస్తారు. ఎవరి క్రెడిట్ వాళ్లకుంటుంది. హైదరాబాదులో ప్రభుత్వ రంగంలో ఐటీకి పునాది వేసినది నేదురుమల్లి జనార్ధన రెడ్డి. 1996లో బాబు వచ్చాక దాన్ని ప్రయివేటు రంగానికి తరలించి, ఐటీని వృద్ధి చేశారు. ఆయన దిగిపోయే నాటికి 2003-04 సం.రం.లో ఆం.ప్ర. ఐటీ ఎగుమతులు రూ.5025 కోట్లు. ఆయన తర్వాత వచ్చిన వైయస్సార్ హయాంలో ఐదేళ్లలో ఆ ఎగుమతులు ఆరున్నర రెట్లు పెరిగి రూ.32,500 కోట్లు అయ్యాయి. ఆలోచన చేయడంలో, అమలు చేయడంలో, విస్తరించడంలో ఎవరి ఘనత వారి కుంది. కానీ బాబు మొత్తమంతా తన ఖాతాలోనే వేసుకుంటారు. ఆరంతస్తుల బిల్డింగులో మొదటి అంతస్తు వేసినందుకు ఆయనకు క్రెడిట్ వస్తే యీ రోజు 3 అంతస్తుల గూగుల్ ఏఐ డేటా సెంటర్కి మొదటి అంతస్తు వేసిన జగన్కు క్రెడిట్ పోతుంది. కానీ అది ఆయన కానీ, ఆయన మీడియా కానీ యివ్వదు. ఈ ధోరణి తెలిసే జగన్ అమరావతి జోలికి పోలేదని అనుకోవాలి. దాన్ని అలా దిక్కుమాలిన దానిలా వదిలేసి వైజాగ్ మీద తన ముద్ర కొట్టబోయాడు. *రాజకీయంగా క్రెడిట్ ఎవరికి వచ్చిందనేది వేరే అంశం. ఇంతకీ డేటా సెంటర్కి, ఏఐ డేటా సెంటర్కి తేడాలేమిటి?* స్టాండర్డ్ డేటా సెంటర్ జనరల్ కంప్యూటర్ల (సిపియు) డేటా స్టోరేజికి పనికి వస్తుంది. మామూలు సర్వర్లు చాలు. సాధారణ పవర్, కూలింగ్ ప్రాసెస్లు సరిపోతాయి. ఏఐ డేటా సెంటరైతే హై పెర్ఫామెన్స్, బిజినెస్ డీప్ లెర్నింగ్కై ఉద్దేశించినది. జిపియు, టిపియుల వంటి హై ఎండ్ హార్డ్వేర్ కావాలి. అల్ట్రా హై డెన్సిటీ పవర్, అడ్వాన్స్డ్ కూలింగ్ కావాలి. ఎందుకంటే జిపియలు చాలా వేడి పుట్టిస్తాయి. మామాలూ డేటా సెంటర్లయితే ఇండియాలో 2025 సెప్టెంబరు నాటికి 128 వున్నాయి. వాటి కెపాసిటీ 1.5 గిగావాట్లు. 2027 నాటికి 1.8 గివా చేయాలని, 2030 నాటికి యింకో 84 సెంటర్లు పెట్టి కెపాసిటీని 9 గివా చేయాలని ప్లాన్లున్నాయి. ముంబయి, చెన్నయ్, నోయిడాలు యీ రంగంలో ముందంజలో వున్నాయి. ప్రపంచం మొత్తంలో 11,800 డేటా సెంటర్లు వున్నట్లు వాటిలో 5 వేలు అమెరికాలోనే వున్నాయని ఒక అంచనా. వాటిలో ఎన్ని ఏఐ డేటా సెంటర్లుగా అప్గ్రేడ్ అవుతున్నాయో కచ్చితంగా చెప్పలేరు. ఇండియాలో అయితే యిప్పటిదాకా ఏఐ డేటా సెంటరు ఒక్కటీ లేదు. మామూలు వాటి కంటె యిది నీరు, విద్యుత్ను హరించి వేస్తుందన్న భయమైతే వుంది. ఆంధ్ర ప్రభుత్వం కానీ, గూగుల్ కానీ యీ విషయమై పూర్తి వివరాలు యివ్వటం లేదు. అదానీ గ్రీన్ ఎనర్జీ వంటి మాటలు వల్లిస్తోంది కానీ ఎంత, ఎక్కణ్నుంచి, ఎలా తెస్తుందనేది చెప్పలేదు. జగన్ హయాంలో 2023లో 300 మెవాల సెంటర్ పెట్టినప్పుడు కూడా దీని గురించి స్పష్టమైన ప్రకటన ఏదీ యిచ్చినట్లు లేదు. ఇది ఏఐది కాబట్టి భయాలు పది రెట్లు పెరుగుతున్నాయి. హీట్ ప్రొడక్షన్లో మామూలు డేటా సెంటర్కి, ఏఐ దానికీ తేడా ఎంత అని ఏఐలోనే కొడితే (అదెంత వరకు కరక్టో నాకు తెలియదు) మామూలు దాని పవర్ డెన్సిటీ ర్యాక్కి 10కివా వుంటుందట. ఏఐదైతే 85 కివా నుంచి 200 కివా మధ్య వుండవచ్చట. చిన్న ఏరియాలో యింత హై కాన్స్ట్రేషన్ బాగా హీట్ జనరేట్ చేస్తుందని ఏఐ చెప్తోంది. ఇవన్నీ యిప్పటి ఏఐ లెక్కలు. పోనుపోను స్పీడ్ పెరిగిన కొద్దీ, వినియోగం పెరిగిన కొద్దీ హీట్ యింకా పెరగవచ్చు. హీట్ తగ్గించే సాధనాలు డెవలప్ చేసి, దానికి విరుగుడూ కనిపెట్టవచ్చు. ఏమైతేనేం, యీ సెంటర్ వలన వాతావరణం ఏ మేరకు ప్రభావితం అవుతుంది అనే విషయంలో సందిగ్ధత కారణంగా పలు దేశాలు వద్దంటేనే గూగుల్ యిక్కడకు వచ్చిందనే వార్తలు వచ్చాయి. *గూగుల్ డేటా సెంటర్ అమెరికాలోనే ఎందుకు పెట్టలేదు?* అమెరికన్ కంపెనీలు అమెరికాలోనే పెట్టుబడి పెట్టాలి. ఇతర దేశాల్లో పెడితే దుంప తెంపేస్తానని ట్రంప్ హుంకరిస్తున్న యీ రోజుల్లో గూగుల్ యిలా యిక్కడకు వచ్చి పెట్టడం, దానిపై ట్రంప్ ఏమీ అనకపోవడం ఆశ్చర్యకరమే కదా! ట్రంప్కు పాకిస్తాన్పై వున్నంత ప్రేమ ఇండియాపై లేదని కూటా తేటతెల్లం. ఏ కరాచీలోనో పెట్టించి, అక్కణ్నుంచి ఆగ్నేయాసియా దేశాలకు కేబుల్ వేయిస్తే ఖర్చు ఏమంత పెరుగుతుంది? మన ఆంధ్రలో మునంతమంది ఐటీ నిపుణులు అకుడ లేరని చెప్పకండి. డేటా సెంటర్ నిర్వహించేది హైలీ స్కిల్డ్ నిపుణులు తక్కువే కదా! వారు వివిధ దేశాలకు చెందినవారు కావచ్చు. ఎక్కణ్నుంచైనా రిమోట్గా ఆపరేటే చేసేవారు కావచ్చు. అమెరికా కానీ, దాని యిష్టమైన పాకిస్తాన్లో కానీ పెట్టడం లేదనేసరికే అనుమానం పొడసూపుతోంది. కొందరు పరిశీలకులు దీనికి కారణం చెపుతూ అమెరికాలో విద్యుత్ ఉత్పాదనకై న్యూక్లియార్ లేదా థర్మల్ వుంటాయని, న్యూక్లియార్ వేస్ట్ ఏం చేసుకోవాలో తెలియక, థర్మల్ వలన వేడి వస్తుందని భయపడి, ఆల్టర్నేటివ్ ఎనర్జీ అవకాశాలున్న ఇండియాను సెలక్ట్ చేసుకున్నారని చెపుతున్నారు. అమెరికాలో విండ్ ఎనర్జీ కెపాసిటీ 2023 నాటికి 150 గివా. ఇండియాలో 2025 ఆగస్టు నాటికి 52! సోలార్ ఎనర్జీ అమెరికాలో 2024 నాటికి 239 గివా. ఇండియాలో 2025 సెప్టెంబరు నాటికి 127 గివా. రిన్యూవబుల్ ఎనర్జీ మన దగ్గర ఎక్కువుందనేది అబద్ధం. *ఈ సెంటరు మాకు వద్దని అమెరికా పౌరులే అన్నారా?* అన్నారు. మామూలు డేటా సెంటర్లే నీటిని పీల్చేస్తున్నాయని, దానితో నీళ్లు కొనుక్కోవలసి వస్తోందని, యివి ఖర్చు చేసే విద్యుత్ వలన సాధారణ పౌరులకు విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయనీ ఆందోళన పడుతున్నారు. దానివలన మామూలు డేటా సెంటర్లకే ప్రతిఘటన ఏర్పడుతోంది. దాని కంటె ఎన్నో రెట్లు విపత్తు కలిగించే ఏఐ డేటా సెంటర్లు వద్దని వాళ్లనడంలో ఆశ్చర్యం లేదు. రాష్ట్రాల వారీగా చూస్తే ఇండియానాలోని ఫ్రాంక్లిన్ టౌన్షిప్లో ఒక బిలియన్ డాలర్లతో గూగుల్ ఏఐ సెంటరు 470 ఎకరాల్లో పెడతానంటే పౌరులు ప్రతిఘటించారు. నీరు, విద్యుత్ సమస్యలతో పాటు స్థానికంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పమని వాళ్లు రొక్కించారు. దాంతో 2025 సెప్టెంబరులో గూగుల్ ఆ ప్రతిపాదన విరమించుకుంది. మెటా, అమెజాన్లకు కూడా యీ సమస్యలు తప్పటం లేదు. అరిజోనా 14 బిలియన్ డాలర్ల ప్రాజెక్టును ఆపించేసింది. మిస్సోరీ 1.5 బిలియన్ డాలర్ల ప్రాజెక్టును ఆపించింది. ఒరేగాన్లో డేటా సెంటర్ నెలకొల్పడానికి ఆమోదించిన ప్రజాప్రతినిథులను ఓటర్లు వెనక్కి రప్పించడంతో 2023 జులైలో అది ఆగిపోయింది. వర్జీనియాలో అయితే డేటా సెంటర్లను అడ్డుకోవడానికి 40 యాక్టివిస్ట్ గ్రూపులు పని చేస్తున్నాయి. నెట్లో ఒక్క ప్రశ్న వేస్తే దొరికిన సమాచారం యిది. ఇంకా లోతుగా వెళితే ఎంత బయటకు వసుందో తెలియదు. *డేటా సెంటర్లను తక్కిన దేశాలు వ్యతిరేకించాయా?* ఆహా, గూగుల్ చిలీలోని శాన్టియాగోలో పెడతానంటే కుదరదంది. ఐర్లండ్లోని డబ్లిన్లో 2024లో పెడతానంటే వాళ్లూ ఒప్పుకోలేదు. నెదర్లాండ్స్ ఐతే కొత్త డేటా సెంటర్లేవీ పెట్టడానికి వీల్లేదంది. మెటా వాళ్లు పెట్టబోయి యీ ఆంక్ష వలన ఆగిపోయారు. గూగుల్ సర్వీసెస్ను రాజకీయ, సెన్సార్షిప్ కారణాల వలన ఆపేసిన దేశాల్లో చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా, సిరియా, క్యూబా వున్నాయి. గూగుల్ అమెరికా బయట దక్షిణమెరికాలో ఉరుగ్వేలో, యూరోప్లో యుకె, నార్వే, బెల్జియంలలో, ఆగ్నేయాసియాలో థాయ్లాండ్, మలేసియాలలో డేటా సెంటర్లు కడుతోంది. వీటిలో ఎన్నిటిని ఏఐ సెంటర్లగా మారుస్తుందో, వాటి కెపాసిటీ ఏమిటో యింకా తెలియదు. సుందర్ పిచ్చాయ్ చెప్పినట్లు అమెరికా బయట వాళ్లు చేస్తున్న అతి పెద్ద యిన్వెస్ట్మెంట్ వైజాగ్లోనే! ఆగ్నేయాసియా దేశాలు, ఆస్ట్రేలియాకు కేబుల్ వేయాలంటే మలేసియాయే మరింత అనువైన చోటు. కానీ వైజాగే ఎంచుకున్నారు వాళ్లు. కారణాలు స్పష్టంగా తెలియటం లేదు. వాటి గురించి "వైజాగ్ డేటా సెంటర్ ఉద్యోగకల్పన” అనే వ్యాసంలో చర్చిస్తాను. (ఫోటో ఆంధ్ర ప్రభుత్వం, గూగుల్ ఒప్పందం, పక్కన గౌతమ్ అదానీ, ఎయిర్టెల్ సునీల్ మిత్తల్) *ఎమ్బీయస్ ప్రసాద్* mbsprasad@gmail.com
8 likes
10 shares
P.Venkateswara Rao
762 views 1 months ago
#వైజాగ్ లో గూగుల్ *విశాఖలో గూగుల్ డేటా సెంటర్… ప్రపంచం నేర్పిన పాఠాలు…‼️* October 16, 2025🔥 డిజిటల్ ప్రపంచం నడుస్తోంది డేటా సెంటర్లపై… ప్రతి మెసేజ్, వీడియో, సర్వర్‌కి వెనుక ఉన్న శక్తి అదే… అయితే ఈ డిజిటల్ గుండె కొట్టుకోవాలంటే — విద్యుత్, నీరు, భూమి అనే మూడు ప్రధాన వనరులు కావాలి… ఇవి ఎక్కడినుండి వస్తాయనే దానిపైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ… విశాఖలో లక్షన్నర కోట్ల భారీ డేటా సెంటర్… లక్షన్నర నుంచి రెండు లక్షల మందికి ఉపాధి… అనేక ఇతర కంపెనీలకూ తోడ్పాటు…. వంటి ప్రచారాలు ఊదరగొడుతున్నారు… అంతగా ఉపాధికి పెద్ద చాన్సేమీ లేదు గానీ… అసలు ప్రపంచం డేటా సెంటర్లకు సంబంధించి ఏం పాఠాలు చెబుతున్నదో ముందు తెలుసుకోవాలి… తద్వారా భారత, ఏపీ ప్రభుత్వాలు ఏం చేయాలో… ప్రజావ్యతిరేకత రాకుండా ఏ జాగ్రత్తలు అవసరమో తెలుస్తుంది… ప్రపంచం చెప్పిన హెచ్చరికలు ఐర్లాండ్ ఉదాహరణ: గూగుల్ అక్కడ పెద్ద డేటా సెంటర్ నిర్మించాలని ప్రయత్నించింది. కానీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది — “మీ ఒక్క సెంటర్‌కి ఇంత పవర్ ఇస్తే, మా దేశ ప్రజలందరికీ కొరత వస్తుంది…” దాంతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది… నెదర్లాండ్స్ ఉదాహరణ: మెటా (ఫేస్‌బుక్) భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పెట్టాలని అనుకుంది… కానీ ప్రజలే వ్యతిరేకించారు — “మాకు గ్రీన్ ఎనర్జీ కావాలి, ఈ సెంటర్ కాదు.” ఫలితం? ప్రభుత్వం అప్లికేషన్ తిరస్కరించింది… తరువాత నేరుగా చట్టం చేసింది — “ఇకపై దేశంలో పెద్ద స్థాయి డేటా సెంటర్లకు అనుమతి ఇవ్వము…” అమెరికాలోని వర్జీనియా: “డేటా సెంటర్ల కాపిటల్” అని పిలిచే ఈ ప్రాంతంలో ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతోంది… అక్కడి ప్రజలు చెబుతున్నారు — “మేము డిజిటల్ హబ్‌గా మారినా, విద్యుత్ బిల్లులు పెరిగాయి, గ్రీన్ కవరేజీ తగ్గింది…” విశాఖలో గూగుల్ అడుగులు విశాఖపట్నం — గూగుల్ కొత్త డేటా సెంటర్ కోసం ఎంపిక చేసిన ప్రాంతంగా వార్తల్లోకి వచ్చింది… నగరం తీరప్రాంతంలో ఉంది, లాజిస్టికల్ కనెక్టివిటీ ఉంది, ఫైబర్ నెట్‌వర్క్ పుష్కలంగా ఉంది… ఇవి దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్‌ను ఆహ్వానించడం సహజమే… కానీ ప్రపంచం నేర్పిన పాఠాలు మనం కూడా గుర్తుంచుకోవాలి… వ్యతిరేకత అవసరం లేని సందర్భాలు సమతుల ప్రణాళిక ఉంటే…. విద్యుత్, నీరు, భూమి వినియోగం ముందే అంచనా వేసి, నగర అభివృద్ధి ప్లాన్‌లో కలిపి చేస్తే… APIIC లేదా రాష్ట్ర IT శాఖతో సమన్వయం ఉంటే, ఇది స్థానిక అవసరాలకూ ఉపయోగపడుతుంది… పునరుత్పత్తి శక్తి (Green Power) ఆధారంగా ఉంటే… గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇప్పటికే “carbon-neutral data centers” వైపు వెళ్తున్నాయి… విశాఖ సెంటర్ కూడా విండ్ లేదా సోలార్ ఎనర్జీపై ఆధారపడాలి… లేదా సరిపడా పవర్ జనరేషన్ సొంతంగా చేసుకోవాలి… నీటి రీసైక్లింగ్, ఎయిర్ కూలింగ్ టెక్నాలజీలు వాడితే… పాత సిస్టమ్స్‌లో నీటి వినియోగం ఎక్కువగా ఉండేది… కానీ ఆధునిక సెంటర్లు “air-cooled” లేదా “liquid loop” టెక్నాలజీ వాడి నీటి వినియోగాన్ని తగ్గిస్తున్నాయి…. విశాఖ డేటా సెంటర్‌కూ అది తప్పనిసరి చేయాలి… సముద్రపు నీటిని తన అవసరానికి అనుకూలంగా ఫిల్టర్ చేసుకునే ప్లాంట్ సొంతంగా పెట్టుకోవాలి… సరైన స్థల ఎంపిక ఉంటే…. తీరప్రాంతం ఎకోసిస్టమ్‌కు హాని చేయకుండా, ఇప్పటికే ఉన్న ఇండస్ట్రియల్ జోన్‌లో సెంటర్ వేస్తే — పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు… విశాఖలో పరమానందపురం IT పార్క్ లేదా గాజువాక ఎట్సెట్రా ఇందుకు తగినవే అంటారు మరి… వ్యతిరేకత వచ్చే ప్రమాదాలు డేటా సెంటర్ కోసం విద్యుత్ కేటాయింపులు పబ్లిక్ అవసరాలను తగ్గిస్తే… ఎకోసెన్సిటివ్, తీరప్రాంత రక్షిత ప్రాంతాల్లో నిర్మాణం చేస్తే… పర్యావరణ అనుమతులు లేకుండా లేదా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నిర్మాణం మొదలుపెడితే… స్థానిక నీటి వనరులు పరిమితమైనప్పటికీ, పెద్ద స్థాయిలో వినియోగిస్తే… గూగుల్ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు.. 1️⃣ స్పష్టమైన పారదర్శక పర్యావరణ నివేదిక – వినియోగం, ఉద్గారాలు, పునరుత్పత్తి ప్రణాళిక… 2️⃣ స్థానిక సమాజ భాగస్వామ్యం – పాఠశాలలు, కాలేజీలు, స్థానిక వ్యాపారాలకి స్కిల్, జాబ్ లింకేజ్ ప్రోగ్రామ్స్… 3️⃣ గ్రీన్ ఎనర్జీ ఒప్పందాలు – రాష్ట్ర విద్యుత్ బోర్డుతో పునరుత్పత్తి శక్తి సరఫరా కాంట్రాక్టులు… 4️⃣ నీటి రీసైక్లింగ్ ప్లాంట్ – సముద్రజలాన్ని ట్రీట్ చేసి వినియోగించే విధానం… ముగింపు... ప్రపంచం ఇప్పటికే డేటా సెంటర్ల ప్రభావం గురించి ఆలోచించింది… కొన్ని దేశాలు ఆంక్షలు పెట్టాయి, కొన్ని నిబంధనలు కఠినం చేశాయి… విశాఖ ఇప్పుడు అదే దారిలో — కానీ తెలివిగా — ముందడుగు వేయాలి… వ్యతిరేకత కాదు, వివేకం కావాలి… గూగుల్ డేటా సెంటర్ వంటివి వస్తే — వనరులను కాపాడుతూ, సాంకేతిక శక్తిని ఉపయోగించే “సమతుల నమూనా”గా నిలవాలి… ఊకదంపుడు ప్రచారాలు కాదు..!!
11 likes
7 shares