రాజమండ్రి, జులై 30: తూర్పుగోదావరి జిల్లా లాలాచెరువులోని సత్యసాయి మంచినీటి సరఫరా కార్మికులు తమ 23వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. గత 19 నెలలుగా వేతనాలు లేకపోవడం, 25 నెలలుగా ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు అందకపోవడంతో కార్మికులు ఆకలి కేకలతో సమ్మెబాట పట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బి.వి.ఎన్. పూర్ణిమ రాజు మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, తమ ఆకలి బాధలు ఎందుకు కనిపించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుపరిపాలన అని చెప్పుకునే నాయకులకు తమ కష్టాలు అర్థం కావడం లేదా అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల సమ్మె కారణంగా గోదావరి మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు నియోజకవర్గాల్లోని ఐదు మండలాల్లో సుమారు 85 గ్రామాలకు, ముఖ్యంగా గిరిజన మెట్ట ప్రాంతాల్లోని మూడు లక్షల మంది ప్రజలకు గత 23 రోజులుగా గోదావరి జలాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి తమ వేతనాలు, సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పీ. శ్రీను, కార్యదర్శి ఇసాక్, కోశాధికారి కే. రామకృష్ణతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
#తూర్పుగోదావరి #East Godavari #rajahmundry #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్