ఇలాంటి వార్తలు చదివితే నిజంగానే హార్ట్ అటాక్ లు వస్తాయి.. పని చంపదు, పని బ్రతికిస్తుంది - నల్లమోతు శ్రీధర్
శవాల మీద పేలాలు ఏరుకునే జర్నలిజం.. బానిసల బతుకుల్లో గుండెపోటు భయం!
న్యూస్ పేపర్ తిరగేయగానే ఒక ‘మేధావి’ జర్నలిస్ట్ రాస్తాడు— “30 ఏళ్లకే ఒత్తిడితో కుప్పకూలుతున్న యువత.. హార్ట్ ఎటాక్స్ పెరిగాయి!” అని. అసలు ఆ రాసేవాడికి ఒక ముక్క అర్థమవుతుందా? వాడికి తెలీదు.. ఏ వార్త రాయాలో, ఏది రాయకూడదో!
సమాజాన్ని భయపెట్టడం జర్నలిజం కాదు, కానీ ఇప్పుడు అదే ఒక బిజినెస్. ఒక సమస్యను లోతుగా విశ్లేషించి, దాన్ని పాజిటివ్ గా మార్చే కనీస జ్ఞానం కూడా ఆ జర్నలిస్టులకు లేదు. కేవలం శవాల లెక్కలు కట్టి, భయాన్ని సేల్ చేసే డెడ్ బాడీ మార్కెటింగ్ వాళ్ళది!
అసలు పని చేస్తే జనాలు చనిపోయేటట్లయితే.. శతాబ్దం పాటు ఈ ప్రపంచాన్ని మార్చేసిన ఎంతోమంది మహానుభావులు ఇంకా బతికే ఉన్నారే? వాళ్లు ఇంకా సాధిస్తూనే ఉన్నారే? మరి వాళ్లెందుకు చనిపోలేదు? వాళ్ల గుండెలేమైనా ఇనుముతో చేశారా? లేదు.. తప్పు పనిలో లేదు, పనిని నువ్వు చూసే ఆ దిక్కుమాలిన ‘దృక్పథం’లో ఉంది!
ప్రశ్న ఏంటంటే—నువ్వు రోజూ ఆఫీసుకి వెళ్తున్నావా లేక ఉరిశిక్ష అనుభవించడానికి వెళ్తున్నావా? పొద్దున్నే లేవగానే నీ ముఖంలో కనిపించేది ఉత్సాహమా లేక విరక్తా? చేసే పనిని ప్రేమిస్తే అది ప్రాణం తీస్తుందా లేక ప్రాణం పోస్తుందా?
నిజం చెప్పాలంటే, పని ఎప్పుడూ మనిషిని చంపదు. కానీ, పని పట్ల ఉండే ద్వేషం మనిషిని లోపల నుంచి తినేస్తుంది. నువ్వు ప్రతి క్షణం నీ బాస్‌ని తిట్టుకుంటూ, కంపెనీని అసహ్యించుకుంటూ, కొలీగ్స్ మీద కుళ్ళు పెంచుకుంటూ పని చేస్తుంటే.. ఆ ఒత్తిడి నీ గుండె మీద కాక ఇంకెక్కడ పడుతుంది? అది పని వల్ల వచ్చిన స్ట్రెస్ కాదు, నీలో ఉన్న నెగిటివిటీ వల్ల వచ్చిన టాక్సిన్!
నువ్వు పనిని ఒక భారంగా చూస్తే, అది నీ మెడకు తగిలించిన రాయి అవుతుంది. అదే పనిని ఒక కళగా చూస్తే, అది నీకు రెక్కలు ఇస్తుంది. అందరూ చనిపోవట్లేదే! రాత్రింబవళ్లు కష్టపడి దేశాన్ని నడిపేవారు, శాస్త్రవేత్తలు, కళాకారులు ఇంకా ఉత్సాహంగా ఉన్నారే.. వాళ్లకి లేని హార్ట్ ఎటాక్ నీకెందుకు వస్తోంది? ఎందుకంటే వాళ్లు పనిని ఆస్వాదిస్తున్నారు, నువ్వు పనిని భరిస్తున్నావు!
ఈ వార్తలు రాసేవాళ్లకి కనీసం ఒక చిన్న లాజిక్ తట్టదా? "ఒత్తిడి పెరుగుతోంది" అని రాసే బదులు, "పనిని ఎలా ప్రేమించాలి" అని ఒక్క ఆర్టికల్ అయినా రాశారా? "యువత కుప్పకూలుతోంది" అని భయపెట్టే బదులు, "పనిలో ఆనందాన్ని వెతుక్కోవడం ఎలా" అని ఒక్క పాజిటివ్ లైన్ అయినా రాశారా? లేదు. ఎందుకంటే పాజిటివిటీకి రేటింగ్ రాదు. భయానికి మాత్రమే మార్కెట్ ఉంటుంది.
నిజంగా పని వల్ల మనిషి చనిపోతాడా? అయితే ఈ ప్రపంచంలో ఏ పనీ జరగకూడదు కదా! అసలు పని చేయకుండా ఖాళీగా ఉంటే వచ్చే డిప్రెషన్ కన్నా, పనిలో ఉంటే వచ్చే సంతృప్తి గొప్పది కాదా? చేసే పని పట్ల ప్రేమ ఉంటే.. అది ఆయుష్షును పెంచుతుంది తప్ప తగ్గించదు. కానీ, ఆ ప్రేమను ఎలా పెంచుకోవాలో చెప్పే దమ్ము ఈ మీడియాకి లేదు. కేవలం శవాల దగ్గర కూర్చుని కన్నీళ్లు కార్చడం మాత్రమే వీళ్లకి తెలుసు.
ప్రేమిస్తూ చేస్తున్నావా.. తిట్టుకుంటూ చేస్తున్నావా?
నువ్వు చేసే పనిలో లోతు ఉందా లేక కేవలం జీతం కోసమే ఆ సర్కస్ చేస్తున్నావా? నీ పనిలో నువ్వు ఒక ముత్యాన్ని వెతుకుతున్నావా లేక కేవలం గంటలు గడిచిపోవాలని కోరుకుంటున్నావా? ప్రతి నిమిషం గడియారం చూసుకుంటూ, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురుచూసే బతుకు ఒక బతుకేనా?
పనిని ప్రేమిస్తే కలిగే ఆనందం మరేదైనా ఇస్తుందా? ఒక పెయింటర్ బొమ్మ గీస్తున్నప్పుడు వాడు అలసిపోడు, వాడు రీఛార్జ్ అవుతాడు. ఒక సింగర్ పాడుతున్నప్పుడు వాడు నీరసించిపోడు, వాడు పులకించిపోతాడు. మరి నువ్వు సాఫ్ట్‌వేర్ రాస్తున్నప్పుడో, అకౌంట్స్ చూస్తున్నప్పుడో ఎందుకు కుప్పకూలిపోతున్నావు? ఎందుకంటే నీకు ఆ పని మీద గౌరవం లేదు. ఆ పని నీకు కేవలం ఒక ఏటీఎం మెషిన్ మాత్రమే.
పనిని ద్వేషిస్తూ చేసే ప్రతి నిమిషం నీ ఆయుష్షులో ఒక రోజును తగ్గించేస్తుంది. అదే పనిని ప్రేమిస్తూ చేసే ప్రతి క్షణం నీకు కొత్త శక్తిని ఇస్తుంది.
నువ్వు మోటివేషన్ కోసం ప్రెజర్ తీసుకుంటున్నావా? సక్సెస్ అవ్వాలనే పిచ్చితో నీ ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నావా? అసలు ప్రెజర్ లేని సక్సెస్ ఉండదా? ఎందుకు ఉండదు! ఎప్పుడైతే నువ్వు రిజల్ట్ గురించి కాకుండా, ప్రాసెస్ గురించి ఆలోచిస్తావో.. అప్పుడు ఒత్తిడి మటుమాయం అవుతుంది.
నువ్వు గెలవాలి అనే భయం కంటే, పనిని బాగా చేయాలి అనే ఇష్టం నీలో ఎక్కువగా ఉండాలి. కానీ మన విద్యా వ్యవస్థ, ఈ సమాజం నీకు నేర్పింది ఏంటి? "నువ్వు వాడికంటే ముందు ఉండాలి, నువ్వు ఇంత ప్యాకేజీ సంపాదించాలి." ఈ పోలికలే నీ గుండెకు తూట్లు పొడుస్తున్నాయి. పక్కవాడితో రేసులో పరిగెడితే ఆయాసం వస్తుంది, నీతో నువ్వు పోటీ పడితే ఉత్సాహం వస్తుంది.
అందర్నీ తిట్టుకుంటూ, అసూయతో రగిలిపోతూ పని చేస్తే.. నీ రక్తం విషం అవుతుంది. అదే అందరినీ ప్రేమిస్తూ, ఒక టీమ్ లాగా కలిసి పని చేస్తే.. ఆ వాతావరణమే నీకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. పని పట్ల ప్రేమ ఎప్పటికీ ప్రాణం తీయదు. అది నిన్ను అమరుడిని చేస్తుంది.
అవును మరి! 30 ఏళ్లకే చనిపోవాలి. ఎందుకంటే 25 ఏళ్లకే కోట్ల ఆస్తి కావాలి. 28 ఏళ్లకే ప్రపంచాన్ని ఏలేయాలి. ఇంత తక్కువ టైమ్ లో ఇన్ని కావాలంటే గుండె ఆగిపోక ఇంకేమవుతుంది? అసలు సహనం అనే పదం మన డిక్షనరీ లోనే లేదు. షార్ట్ కట్ లో సక్సెస్ కావాలి, కానీ ఆ షార్ట్ కట్ లో వచ్చే ఒత్తిడి మాత్రం వద్దంటాం. ఇదేం లాజిక్?
న్యూస్ పేపర్ వాడు రాస్తాడు.. వాడు రాసింది చదివి మనం డిసైడ్ అయిపోతాం.. "ఓహో, పని చేస్తే చనిపోతాం అన్నమాట!" అని. అయితే ఇంక పని చేయడం మానేసి సోఫాలో కూర్చుని రీల్స్ చూస్తూ ఉందాం. అప్పుడు గుండెపోటు రాదా? అప్పుడు అంతకంటే భయంకరమైన రోగాలు వస్తాయి.
అసలు సమస్య పనిలో లేదురా నాయనా.. నీ ఆలోచనలో ఉంది! నీ ఆటిట్యూడ్ లో ఉంది!
నువ్వు చేసే పనికి ఒక అర్థం వెతుక్కో. అది చిన్నదైనా, పెద్దదైనా.. అందులో నీ ఆత్మను పెట్టు. పనిని ఆస్వాదించడం నేర్చుకో. చుట్టూ ఉన్న మనుషులని ప్రేమిస్తూ పని చేయి. అప్పుడు నీకు స్ట్రెస్ ఉండదు, కేవలం సంతృప్తి మాత్రమే ఉంటుంది.
పని మనల్ని చంపదు, పని పట్ల మనకున్న దృక్పథమే మనల్ని చంపుతుంది. ఆ జర్నలిస్ట్ కి తెలిసినా తెలియకపోయినా, నువ్వు మాత్రం తెలుసుకో— Love what you do, and you will never feel stress. అది నీకు ఆయుష్షుని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అన్నిటికీ మించి నీ జీవితానికి ఒక గొప్ప అర్థాన్ని ఇస్తుంది.
ఒత్తిడితో చావడం కాదు.. ఉత్సాహంతో బతకడం నేర్చుకో!
From Facebook Wall
#😃మంచి మాటలు #తెలుసుకుందాం