👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
673 views
6 days ago
*🌹 భోగి పండుగనాడు శ్రీ గోదా–రంగనాథుల కళ్యాణ మహోత్సవం (ధనుర్మాస వ్రత ఫలము) 🌹* *భోగి పండుగనాడు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించటం అనాదిగా వస్తున్న పవిత్ర సంప్రదాయం. ధనుర్మాసం నిండా వ్రతాచరణతో, అమ్మ అనుగ్రహంగా లభించిన తిరుప్పావై పాశురాల పఠనాన్ని ఆఖరున దివ్య కల్యాణంతో ముగించి, శ్రీ గోదా రంగనాథుల కృపకు పాత్రులవడం భక్తులందరి పరమ లక్ష్యంగా నిలిచింది.* *శ్రీ విల్లిపుత్తూరులో వటపత్రశాయిగా వేంచేసిన స్వామివారికి తులసి, దమనకాది పవిత్ర పుష్పాలతో మాలలను కూర్చి సమర్పించటం శ్రీ విష్ణుచిత్తుల నిత్య కైంకర్యం. ఆ విష్ణుచిత్తులకు భూదేవి అంశగా లభించిన గోదాదేవి, తండ్రి భక్తి, జ్ఞానం, తత్త్వబోధలకు ప్రతిరూపంగా దినదినాభివృద్ధి చెందింది. తండ్రి స్వామికై కూర్చిన పుష్పమాలలను ముందుగా తానే ధరించి, “స్వామికి నేను ఎంతవరకు తగుదునో” అని నీటి బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని, ఆ మాలలనే మళ్లీ స్వామి కైంకర్యానికి సిద్ధం చేసేది.* *ఈ విషయం గమనించిన విష్ణుచిత్తులు, ఆమెను మందలించి, ఇలా ముందుగా మాలలు ధరించడం అపచారమని భావించి ఆ కైంకర్యాన్ని నిలిపివేశారు. అయితే స్వామి స్వయంగా స్వప్నంలో దర్శనమిచ్చి, గోదాదేవి ధరించిన మాలలే తనకు అత్యంత ప్రీతికరమని, అవే తనకు సమర్పించాలని ఆజ్ఞాపించెను. అప్పుడే ఆమె సామాన్య మానవకాంత కాదని, భూదేవి స్వరూపమేనని గ్రహించిన విష్ణుచిత్తులు, స్వామి ఆజ్ఞ మేరకు మాలాకైంకర్యాన్ని కొనసాగించారు.* *కాలక్రమేణా యుక్తవయస్సుకు చేరుకున్న గోదాదేవిని వివాహం చేయాలనే సంకల్పంతో, విష్ణుచిత్తులు — “అమ్మా! నీకు పెండ్లివయస్సు వచ్చింది. నీ మనసు ఎవరిని వరించాలనుకుంటుందో చెప్పు. నీ కోరిక ప్రకారమేo వివాహం చేస్తాను” అని అన్నారు. తండ్రి మాటలు విన్న గోదాదేవి, లజ్జావదనయై — “సర్వజ్ఞులైన మీకు తెలియనిదేముంది? పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని తప్ప మరెవ్వరినీ నేను వరించను” అని తన అంతరంగ కోరికను స్పష్టం చేసింది.* *ఆపై విష్ణుచిత్తులు కొమడల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని, వటపత్రశాయి వైభవాన్ని, నూట ఎనిమిది దివ్యదేశాలలో అర్చామూర్తులుగా వేంచేసిన పెరుమాళ్ల మహిమలను వర్ణించసాగారు. ఆ క్రమంలో చివరికి “అజికియ మనవాళన్” అయిన శ్రీరంగనాథుని దివ్య మంగళ స్వరూపాన్ని వర్ణించగానే, గోదాదేవి హృదయం సంపూర్ణంగా ఆయన రూపంతో నిండిపోయి, “జితాస్మి” అన్న భావంతో పరవశించింది.* *ఆ స్థితిని గమనించిన విష్ణుచిత్తులు తీవ్ర చింతలో నిద్రకు ఉపక్రమించగా, శ్రీరంగనాథుడు స్వప్నంలో ప్రత్యక్షమై — “నీ పుత్రిక గోదాదేవిని మాకు సమర్పించుము. మేమే ఆమెను పాణిగ్రహణం చేసుకొందుము. వివాహ మహోత్సవానికి కావలసిన సమస్త సామగ్రితో, పాండ్య మహారాజు ఛత్రచామరాలతో, రత్నాభరణాలతో అలంకరించిన దంతపు పల్లకిలో మిమ్ములను స్వయంగా ఆహ్వానిస్తాడు” అని ఆజ్ఞాపించెను.* *విష్ణుచిత్తులు మేల్కొని అపార ఆనందంతో తన జన్మ సార్థకమైందని భావించి, మంగళవాయిద్యాల నాదమధ్య గోదాదేవిని శ్రీరంగానికి తోడ్కొని వెళ్లారు. అక్కడ పాండ్య మహారాజుతో సహా సమస్త ప్రజల సమక్షంలో జరిగిన ఆ దివ్య కళ్యాణాన్ని దర్శించినవారందరూ ధన్యులయ్యారు.* **ధనుర్మాసం నెలనాళ్లూ గోదాదేవి రోజుకొక్క పాశురంతో తిరుప్పావై గానంతో శ్రీరంగనాథుని అర్చించింది. ఇట్లు అండాళ్ తల్లి, తాను ఆచరించిన ధనుర్మాస వ్రత ఫలితంగా పరమాత్ముని పొందడమే కాక, మనందరికీ మోక్షమార్గాన్ని చూపిన మార్గదర్శినిగా నిలిచింది. శ్రీరంగనాథుడు స్వయంగా ఆమెను వరించి పాణిగ్రహణం చేయడమే ఈ దివ్య గాథ యొక్క పరమార్థం. అదే సంప్రదాయంగా భోగి పండుగనాడు మనం భోగ్యంగా జరుపుకుంటున్నాం.* *శ్రీ గోదా రంగనాథుల కళ్యాణాన్ని దర్శించినా, నిర్వహించినా, ఈ కథను విన్నా లేదా చదివినా — సకల శుభములు చేకూరుతాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు.* 🌹🌹🌹🌹🌹 #తెలుసుకుందాం #🔥భోగి శుభాకాంక్షలు🌾 #goda devi kalyanam