#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#జై శ్రీకృష్ణ భగవద్గీత శ్లోకములు🙏
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*49. ఓం పరాభక్తి ప్రదాయై నమః*
1. పరాభక్తి 2. అపరాభక్తి అనే రెండు భక్తి పద్ధతులు మన ముందున్నాయి. అపరా భక్తిపరుడు ఒక మూర్తి లేదా విగ్రహాన్ని ఆరాధిస్తూ తన భక్తిని వెల్లడిస్తాడు. యజ్ఞ యాగాదులు, పూజా పురస్కారాల వంటి రకరకాల పద్ధతులను పాటిస్తాడు. అది సగుణోపాసన. దేహాభిమానం గల వారికి, ఇంద్రియ నిగ్రహం అంతగా లేనివారికి సగుణోపాసన మిక్కిలి సులభంగా ఉంటుంది. ఇది అపరాభక్తి.
నిర్గుణ పరమాత్మయందే మనస్సుని, బుద్ధిని స్థిరంగా నిలపటం పరాభక్తి. అపరాభక్తి కంటె పరాభక్తి క్లేశంతో కూడుకొన్నది. అవ్యక్త (నిర్గుణ) పరబ్రహ్మమునందు ఆసక్తి గలవారికి సగుణోపాసకుల కంటె ప్రయాస అధికం. దేహాభిమానం గలవారికి నిర్గుణ ఉపాసనామార్గం కష్టంగా ఉంటుంది అంటున్నారు పరమాత్మ.
నిర్గుణ ధ్యానం కష్టమే గానీ మోక్షం పొందాలి అనుకొన్నప్పుడు సగుణ ధ్యానంతో అది సాధ్యం కాదు. నిర్గుణధ్యానం ద్వారానే మోక్షం పొందటం కుదురుతుంది. అనన్యభావంతో ఎవరైతే తనను ధ్యానిస్తున్నారో వారిని ఆ భగవానుడే ఉద్ధరిస్తున్నారు.
ఎవరు సమస్తకర్మలను నా యందు సమర్పించి, నన్నే పరమగతిగా తలచినవారై, అనన్య చిత్తంతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తున్నారో, నాయందు చిత్తమును చేర్చిన అట్టివారిని ఈ సంసార సాగరం నుండి నేను శీఘ్రంగా, చక్కగా ఉద్ధరిస్తున్నాను అంటున్నారు పరమాత్మ.
అట్టి పరాభక్తిని ప్రసాదిస్తున్న గీతామాతకు భక్తితో ప్రణామం చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏

