*_మాయా గంగాళం (విదేశీ జానపద కథ)_*
*ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను చానా దుర్మార్గుడు.* *ఎక్కువ పని చేపించుకొని తక్కువ కూలి ఇచ్చేవాడు. ఆపదల్లో అధిక వడ్డీకి అప్పులిచ్చి తీర్చలేకపోతే వాళ్ళ పొలాలు, ఇల్లు గుంజుకునేవాడు.* *పదిమంది గుండాలు ఎప్పుడూ వెంట వేసుకొని తిరిగేవాడు*. *జనాలు పన్నెత్తి మాట్లాడినా, కన్నెత్తి చూసినా వాళ్ళు దాడి చేసేవాళ్లు. దాంతో ఆ ఊరిలోని వాళ్ళందరూ వాని పేరు చెబితే చాలు భయంతో వణికిపోయేవారు*.
*ఆ ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు*. *ధనవంతుని పొలం పక్కనే అతని పొలం ఉండేది. ఒకసారి ఆ ముసలోని పెళ్ళాం జబ్బు పడింది.* *సమయానికి డబ్బు లేక ధనవంతుని దగ్గర అప్పు చేశాడు. దాన్ని తీర్చడానికి అతని పొలంలోనే కూలీగా పని చేశాడు. కానీ ఎన్ని రోజులు పని చేసినా ''నీ జీతం వడ్డీకి కూడా సరిపోలేదు''* *అంటూ బలవంతంగా పొలం గుంజుకొని తరిమేశాడు.*
*పాపం ముసలాయన పెళ్ళాంతో కలసి ఊరి బయట వున్న ఒక పాడుబడిన కొట్టంలోకి చేరుకున్నాడు. రోజుకి ఒక పూట తినడం కూడా చానా కష్టంగా మారింది. వాళ్ల దగ్గర ఒక ఆవు ఉంది. అది గూడా తినడానికి పచ్చగడ్డి లేక బాగా బక్కచిక్కిపోయింది*. *ఒకరోజు ముసలామె ''ఈ అవును మనం పెంచలేం గానీ సంతకుపోయి అయినకాడికి అమ్ముకొని రాపో'' అని పంపించింది*.
*ముసలోడు ఆవును తీసుకొని పోతావుంటే దారిలో ఒక మరుగుజ్జు కనపడ్డాడు. సరిగ్గా మోకాలంత ఎత్తు ఉన్నాడు. వానికి నాలుగింతల పెద్దగా వున్న ఒక గంగాళాన్ని మోసుకుంటా ఎదురుగా వచ్చాడు*.
*ఆ మరుగుజ్జు ముసలోన్ని చూసి ''ఏం తాతా... ఆవును అమ్మడానికి తీసుకొని పోతున్నావా. నాకు ఇవ్వు. ఈ గంగాళాన్ని నీకు ఇస్తా'' అన్నాడు*.
*''ఈ గంగాలాన్ని నేనేం చేసుకుంటా...* *తినడానికి పనికొస్తుందా తిరగడానికి పనికొస్తుందా...* *నాకొద్దు'' అన్నాడు ముసలోడు.*
*వెంటనే ఆ గంగాళం మరుగుజ్జు భుజంపై నుండి ఎగిరి కిందికి దూకి*
*''వద్దనకు వద్దనకు ఓ తాత*
*వెంటనే తీసుకో ఓ తాత*
*బాధలే తీరుస్తా ఓ తాత*
*నీ తలరాతనే మారుస్తా ఓ తాత'' అంది.*
*అది మాట్లాడ్డం చూసి ముసలోడు అదిరిపడ్డాడు*. *''కొంపతీసి దీంట్లో దయ్యం గానీ, భూతం గానీ లేదు కదా'' అన్నాడు వణికిపోతూ.*
*మరుగుజ్జు నవ్వేసి ''ఇది అల్లాటప్పా మామూలు గంగాళం కాదు. మాయా గంగాళం. మంచోళ్ళకు మంచి, చెడ్డోళ్లకు చెడు చేస్తాది. భయపడకు తీసుకో. నా మాట నమ్ము. నీ సమస్యలన్నీ తీర్చి మరలా నా దగ్గరికి వచ్చేస్తాది. ఈ మధ్యనే నాకు కూతురు పుట్టిది.* *పాపకు పాలు అవసరం'' అన్నాడు.* *మరుగుజ్జు అంతగా చెబుతా వుంటే ముసలోడు కాదనలేకపోయాడు. తన దగ్గర వున్న ఆవుని ఇచ్చి ఆ మాట్లాడే మాయా గంగాళాన్ని తీసుకొని బయలుదేరాడు*.
*గంగాళాన్ని నెత్తిన పెట్టుకొని ఇంటికొచ్చిన మొగున్ని చూసి ముసలామెకు కోపం ముంచుకొచ్చింది.* *బంగారం లాంటి ఆవుని ఇచ్చి పనికిరాని తుప్పు పట్టిన ఈ గంగాళాన్ని తీసుకొస్తావా... ఏం చేయాల దీన్ని. నెత్తిన పెట్టుకొని ఊరేగమంటావా... లేక దేవుని గూట్లో పెట్టి పూజ చేయమంటావా'' అంటూ విసుగ్గా విసిరి మూలకు పడేసింది.*
*కింద పడిన గంగాళం చిన్నపిల్లోని మాదిరి ఎగురుకుంటా అవ్వ దగ్గరికి వచ్చి*
*''కోప్పడకు కోప్పడకు ఓ అవ్వ*
*ముసలోన్ని తిట్టకు మా అవ్వ*
*వచ్చాను వచ్చాను మీ ఇంటికి*
*మేలు చేసి పోతాను మా ఇంటికి'' అంది.*
*గంగాళం అలా మాట్లాడతా వుంటే అవ్వ భయంతో నోరెళ్లబెట్టింది*.
*అంతలో ముసలోడు జరిగిందంతా చెప్పాడు*.
*దాంతో ఆమె సరేనని దాన్ని తీసుకుపోయి జాలాడిలో వేసి తుప్పు అంతా వదిలిపోయేలా తెల్లగా తోమింది.* *ఎండకు అది తళతళా మెరవసాగింది.*
*అంతలో ఆ గంగాళం ఎగురుకుంటా అవ్వ దగ్గరికి వచ్చి*
*''అవ్వా అవ్వా పొయ్యంటించు*
*పొయ్యి మీదకు నన్నెక్కించు*
*సుర్రుమంటే తుర్రుమంటా*
*దొరికిందంతా తెస్తా ఉంటా'' అంది*.
*సరే ఈ తమాషా ఏదో చూద్దామనుకొని ముసలామె గంగాళాన్ని పొయ్యి మీదికి ఎక్కించి కింద మంట పెట్టింది. అది సలసలసల కాగడం ఆలస్యం పొయ్యి మీద నుంచి ఎగిరి కిందికి దూకింది*.
*''అవ్వా అవ్వా పోయొస్తా*
*దొంగోనిల్లు చూసొస్తా*
*తినడానికన్నీ తెచ్చేస్తా*
*కడుపులన్నీ నింపేస్తా''*
*అంటూ కిటికీలోంచి ఎగిరి బైటికు దుంకింది.*
*ఆరోజు ధనవంతుని ఇంటికి చానామంది బంధువులు వచ్చారు.* *వచ్చినవాళ్ళ ముందు ధనవంతుడు తన గొప్పతనాన్ని చాటుకోడానికి పెళ్ళాంతో ''ఏమే*... *మా వాళ్ళ కోసం బళ్లారి కొబ్బరి, మంచి నెయ్యి వేసి తియ్యని పాయసం చెయ్*. *గోడంబి, ద్రాక్ష డబ్బా మొత్తం వేసెయ్. ఒక్క చుక్క నోట్లో పోసుకుంటే చాలు కమ్మగా అదిరిపోవాల చూడు'' అన్నాడు*.
*ఆ ధనవంతుని పెళ్ళాం సరేనని పాయసానికి కావలసిన సరుకులన్నీ తెచ్చి వంటింట్లో కుప్పబోసింది.* *అంతమందికి సరిపోయే పాత్ర ఏముందబ్బా అని చూడసాగింది. సరిగ్గా అదే సమయానికి ఆ మాయాగంగాళం కిటికీలోంచి చప్పుడు కాకుండా లోపలికి దూరి ఒక మూలన కూర్చుంది. వంట పాత్ర కోసం వెతుకుతా వున్న ధనవంతుని పెళ్ళానికి అది కనపడింది. ''అరే...* *ఇది ఎప్పుడు కొనుక్కొచ్చాడు నా మొగుడు. ఒక్కటి కూడా సరిగా చెప్పడు''* *అనుకుంటూ గంగాళాన్ని తీసుకుపోయి పొయ్యి మీదికి ఎక్కించింది .*
*సెనగబ్యాళ్లు, పాలు, నెయ్యి, బెల్లం, ద్రాక్ష, జీడిపప్పు... అన్నీ వేసి ఘుమఘుమలాడేలా కమ్మని పాయసం చేసింది*. *బంధువులందరినీ అన్నానికి కూర్చోమని చెప్పి పాయసం తీసుకురావడానికి లోపలికి పోయింది*. *వంటింట్లోంచి ఆమె అట్లా పక్కకు పోవడం ఆలస్యం ఆ గంగాళం కన్నుమూసి తెరిచేంతలోగా పాయసంతో సహా ఎగిరి బయటకు దుంకింది. సంబరంగా ఎగురుకుంటా పోయి ముసలోని ఇంటికి చేరింది.*
*''అవ్వా అవ్వా పాయసం*
*తియ్యాతియ్యని పాయసం*
*కమ్మ కమ్మగా తినండి*
*కడుపునిండా మెక్కండి'' అంది*.
*వాళ్ళు ఆ పాయసాన్ని చూసి సంబరంగా తాము తిని చుట్టుపక్క వాళ్ళనంతా పిలిచి కడుపునిండా పెట్టారు*.
*ధనవంతుని పెళ్ళాం అందరూ అన్నానికి కూర్చున్నాక వడ్డిద్దామని పాయసం కోసం లోపలికిపోయింది*. *చూస్తే ఇంకేముంది... గంగాళమూ లేదు*. *పాయసమూ లేదు. ఉత్త పొయ్యి వెక్కిరిస్తా కనపడింది. ఉత్త చేతులు ఊపుకుంటా వచ్చిన ఆమెను చూసి బంధువులంతా ''ఛీ...* *ఛీ... పాయసం పాయసం అంటూ పొద్దున్నుంచీ ఊరించి ఊరించి ఇప్పుడు ఉత్త చేతులు చూపి అవమానిస్తారా...* *ఇంకెప్పుడు సచ్చినా ఇట్లా అబద్ధాలు చెప్పే నీలాంటోళ్ళ ఇంటి గడప అసలు తొక్కగూడదు''* *అంటూ పెట్టే బేడా సర్దుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు*.
*ముసలామె తర్వాతరోజు పొద్దున్నే మరలా ఆ గంగాళాన్ని పొయ్యి మీదికి ఎక్కించి కింద మంట పెట్టింది*. *అది సలసలసల కాగడం ఆలస్యం పొయ్యి మీద నుంచి ఎగిరి కిందికి దుంకి*
*''అవ్వా అవ్వా పోయొస్తా*
*పొలాలన్నీ తిరిగొస్తా*
*ఇంటికి ధాన్యం* *తెచ్చేస్తా*
*సంచులన్నీ నింపేస్తా'' అంటూ కిటికీలో నుంచి ఎగిరి బైటకు దుంకింది.*
*ధనవంతుని పొలంలో కోతలన్నీ పూర్తయ్యాయి*. *దాన్యం కుప్పలు పోసి ఉన్నాయి. వాటిని సంచీలకు ఎత్తుతా వున్నారు. గంగాళం పోయి ఒక ధాన్యం కుప్ప పక్కన నిలబడింది*.
*దాన్ని చూసి వాళ్ళు ''ఓహో... దీన్ని కూడా ధాన్యం నింపడం కోసం ఇక్కడ తెచ్చి పెట్టినట్లు ఉన్నారు'' అనుకొని* *ధాన్యం పోయసాగారు. కానీ ఎంత పోసినా అది నిండడం లేదు*. *పోసినవి పోసినట్లు లోపలికి పోతావున్నాయి*. *చూస్తుండగానే కుప్ప ఖాళీ అయింది.* *అంతే... ఆ గంగాళం నెమ్మదిగా జరుగుతా జరుగుతా వెనక్కి వెళ్ళిపోయింది*. *ఎవరూ చూడని సమయంలో* *ఒక్కసారిగా ఎగురుకుంటూ ముసలోని ఇంటికి చేరుకుంది.*
*''అవ్వా అవ్వా* *సంచులు తియ్*
*ధాన్యంతోనా నింపేసెయ్*
*చుట్టూ పక్కల పిలిచేసెయ్*
*తలాకొంచం పంచేసెయ్'' అంది.*
*ముసలామె సంబరంగా ఇల్లంతా నింపుకొని మిగిలినవి చుట్టుపక్కల జనాలకు పంచి పెట్టింది*.
*తర్వాతరోజు పొద్దున్నే ముసలామె ఎప్పట్లాగే గంగాళాన్ని మరలా పొయ్యి మీదికి ఎక్కించి మంట పెట్టింది.*
*అది సలసలసల కాగడం ఆలస్యం ఎగిరి కిందికి దుంకింది.*
*''అవ్వా అవ్వా పోయొస్తా*
*వీధీ వీధీ తిరిగొస్తా*
*మోసగాళ్లనే మోసం చేస్తా*
*దొంగోళ్లనే దోచుకోస్తా''* *అంటూ ఎగురుకుంటా బయటికి పోయింది.*
*సరిగ్గా అదే సమయానికి ఆ ధనవంతుడు తన గదిలో కూర్చుని సంపాదించిన బంగారు వరహాలన్నీ కుప్ప పోసి లెక్క పెట్టుకుంటా ఉన్నాడు.*
*ఆ గంగాళం నెమ్మదిగా కిటికీలోంచి లోపలికి దూరి చప్పుడు చేయకుండా ధనవంతుని వెనుకకు పోయి నిలబడింది*. *ధనవంతుడు బంగారాన్ని ఎక్కడ దాచిపెడదామా అని చుట్టూ చూస్తావుంటే ఈ గంగాళం తళాతళా మెరిసిపోతా కనపడింది.*
*''అరే... ఇది భలేగుందే. నా పెళ్ళాం కొత్తగా కొన్నట్లుంది''* *అనుకొని ఆ వరహాలన్నీ దాంట్లో వేసి నింపాడు.*
*అంతే... అది మరుక్షణమే అక్కడినుంచి ఎగిరి కిటికీలోంచి బయటకు దూకింది*. *ధనవంతుడు లబలబలాడుకుంటూ బైటికి వచ్చేసరికి కనపడకుండా మాయమైంది.*
*పాయసం ఎత్తుకుపోయిందీ*, *ధాన్యం కొట్టుకపోయిందీ,* *వరహాలు మాయం చేసిందీ... ఆ గంగాళమే అని తెలుసుకొని... దాన్ని6 ఎలాగైనాసరే పట్టుకోవాలని వెతుక్కుంటా బయలుదేరాడు*.
*ఆ గంగాళం ఎగురుకుంటా ముసలవ్వ ఇంటికి చేరుకుంది.*
*''అవ్వా అవ్వా వచ్చేసెయ్*
*వరహాలన్నీ దాచేసెయ్*
*పేదవారికీ దానంచెయ్*
*మంచిగ నువ్వూ బతికేసెయ్'' అంది.*
*ఆ ముసలామె ఆ వరహాలన్నీ తీసుకుని ఎవరికీ కనబడకుండా భద్రంగా దాచి పెట్టింది.*
*తర్వాతరోజు పొద్దున్నే ముసలామె ఆ గంగాళాన్ని తీసుకొని ఎప్పటిలాగే పొయ్యి మీదికి ఎక్కించి మంట పెట్టింది. అది ఎర్రగా సలసలసల కాగడం ఆలస్యం పొయ్యి మీద నుంచి ఎగిరి కిందికి దూకింది.*
*''అవ్వా అవ్వా పట్టుకుపోతా*
*దొంగోన్నింకా ఎత్తుకుపోతా*
*పట్టిన శనిని వదిలించేస్తా*
*ఊరికంతా మేలే చేస్తా'' అంటూ ఎగురుకుంటా బయటికి పోయింది.*
*ధనవంతుడు ఆ గంగాళాన్ని వెతుక్కుంటూ పొలాల్లో పిచ్చిపట్టినవానిలా తిరుగుతా ఉన్నాడు. వానికి కనపడేలా ఒక చెట్టు కిందకు వచ్చి ఆగింది. దానిని చూడగానే ధనవంతుడు సంబరంగా ''హమ్మయ్య దొరికింది. దీన్ని ఇంక అస్సలు వదలిపెట్టకూడదు'' అనుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా దగ్గరకొచ్చి ఎగిరి గట్టిగా వాటేసుకున్నాడు.*
*అంతే... మరుక్షణమే ఆ గంగాళం ఆ ధనవంతంతో సహా వేగంగా గాలిలో ఎగురుకుంటా సర్రున దూసుకుపోయింది. అది వాగులు దాటింది. వంకలు దాటింది. కొండలు దాటింది. అడవులు దాటింది. అలా అది ఎక్కడికి పోయిందో... ఏమయిందో ఎవరికీ తెలీదు. ఆ ఊరివాళ్ళు ఆ గంగాళాన్ని గానీ, ధనవంతునితో గానీ మరలా ఎప్పుడూ ఎక్కడా చూడలేదు.* #మన సంప్రదాయాలు సమాచారం
