#మేరా భారత్ మహాన్🇮🇳
*ఇంటింటికీ ఓ జవాన్… ఆసియాలోనే అతి పెద్ద గ్రామం… ఆర్మీ గ్రామం…❗*
October 1, 2025🇮🇳
( రమణ కొంటికర్ల ) …..
గంగానదీ తీరాన ఆ గ్రామమంతా దేశభక్తులే. ఇంటింటికీ ఓ సైనికుడు తప్పనిసరి. ఆసియా ఖండంలోనే ఆర్మీ సేవల్లో అతి ఎక్కువ మంది కల్గిన గ్రామంగా కూడా గహ్మార్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతేనా.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గ్రామం కూడా గహ్మారే కావడం విశేషం. మరి ఆ ఊరు కథ తెలుసుకుందాం రండి.
కొన్ని దశాబ్దాలుగా వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కనిపిస్తోంది. అయినప్పటికీ భారత్ అంటే గ్రామీణమే. వ్యవసాయమే మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్ను అన్నంతగా ముద్రపడిపోయింది. అలాంటి ఓ గ్రామం ఆసియాలోనే అతి పెద్ద వ్యవసాయాధారిత గ్రామంగా… గంగానదీ తీరంలో దేశభక్తులకు కేంద్రంగా ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. అందుకే ఆ ఊరును సైనికుల గ్రామమని పిలుస్తుంటారు.
ఇంతకీ ఆ సైనికుల గ్రామమెక్కడ..?
ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలో ఉంది గహ్మార్. ఇప్పుడీ గ్రామం భారతదేశంలోనే కాదు.. అత్యధిక మంది సైనికులున్న ప్రాంతంగా.. తప్పనిసరిగా ఇంటికొక్క సైనికుడు ఉద్భవించే ఊరుగా కూడా రికార్డులకెక్కింది.
జిల్లా కేంద్రం ఘాజీపూర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే గహ్మార్.. సుమారు 22 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఆసియాలోనే అతి పెద్ద గ్రామంగా కూడా గుర్తింపు పొందింది. ఒక ఊరు ఏదైనా ప్రత్యేకతను కల్గి ఉండాలంటే.. విశేషమై నిలవాలంటే ఇదిగో గహ్మార్ ఓ ఉదాహరణ.
అతి పెద్ద గ్రామం కావడమన్నది విశేషమే అయినా.. గ్రామంలో ఇంటింటికీ ఓ సైనికుణ్ని తయారు చేసే సంస్కృతే ఇక్కడి ప్రత్యేకత. ఈ గ్రామంలో 22 వార్డులుంటే… ఒక్కో వార్డుకు అమరవీరుల పేర్లు.. లేదా పేరు మోసిన సైనికుల పేర్లు కనిపిస్తాయి.
మరి గహ్మార్ జనాభా ఎంత..?
గహ్మార్ జనాభా సుమారు లక్షా 20 వేల నుంచి లక్షా 50 వేల మధ్యలో ఉండొచ్చని ఓ అంచనా. ఇక ఇతరత్రా ఉపాధి, ఉద్యోగాలు, చదువుల కోసం బయటకు వెళ్లినవారిని కూడా కలుపుకుంటే అతి ఎక్కువ అంటే సుమారు 2 లక్షల మంది జనాభా కల్గిన గ్రామంగా కూడా గహ్మార్ కు గుర్తింపు ఉంది.
వాస్తవానికి ఒక గ్రామంలో ఇంత జనాభా ఉండటం కనిపించదు. ఎందుకంటే, గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల కంటే కూడా తక్కువ జనసాంద్రను కల్గి ఉంటాయి. ఈ గ్రామంలో 25 వేల మంది నమోదిత ఓటర్లున్నారు. ప్రధానంగా రాజ్ పుత్ సమాజానిదే ఈ ఊళ్లో ఆధిపత్యం. ఎందుకంటే అక్కడి మొత్తం జనాభాలో 60 శాతం వీరే కనిపిస్తారు. ఆ తర్వాత యాదవులు, బ్రాహ్మణులెక్కువ.
సైనికుల గ్రామంగా ఎప్పట్నుంచి ముద్రపడింది..?
గహ్మార్ గ్రామానికి ఓసారి వెళ్లి ఇల్లిల్లూ తిరిగితే.. సుమారు 15 వేల మంది మాజీ సైనికులు కనిపిస్తారు. ఇక మరో 12 వేల మంది ప్రస్తుత భారత సైన్యం, పారామిలిటరీ దళాల్లో పనిచేస్తున్నారు. జవాన్ నుంచి కల్నల్ వరకూ వివిధ హోదాల్లో ఈ గ్రామంలోని వారు మిల్ట్రీలో కనిపించడమే గహ్మార్ సైనిక గ్రామంగా పేరు సంపాదించుకోవడానికి కారణం.
మూడు తరాల నుంచీ ఆర్మీకి తమ పిల్లల్ని పంపి.. ఈ గ్రామం అపారమైన సేవలందిస్తోంది. అందుకే, ఈ గ్రామంలో గంగానది ఒడ్డునే మథియా మైదానంలో ఇక్కడి యువత సైనిక పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఏకంగా 16 వందల మీటర్ల ట్రాకునే ఏర్పాటు చేసి పెట్టారు.
అలా మొత్తంగా ఆసియాలోనే అతి పెద్ద గ్రామంగా.. అలాగే ఇంటికో సైనికుడితో దేశభక్తిని రగిలిస్తున్న గ్రామంగానూ గహ్మార్ ది భారతీయ గ్రామీణ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం…
