#ఏపీ అప్ డేట్స్..📖 #విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪
*బాబుతో తప్పు చేయిస్తున్న అధికారం❗*
NOVEMBER 17 2025🎯
విశాఖలో సీఐఐ సదస్సు పేరుతో రెండు రోజుల పాటు చంద్రబాబు సర్కార్ హడావుడి చేసింది. లక్షల కోట్లు పెట్టుబడులు, వందలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయంటూ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఆకాశమే హద్దుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ మీడియా కూడా అదే ప్రచారంలో మునిగి ఉండగా, చంద్రబాబు నోరు జారారు.
విశాఖ ఉక్కు కార్మికులు, సంబంధిత సంఘాల నాయకులపై ఆయన నోరు పారేసుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టపోవడానికి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులే సోమరితనమే కారణమని అర్థం వచ్చే రీతిలో బహిరంగంగానే ఆయన అన్నారు. చంద్రబాబు ఎంత ఫ్రెండ్లీగా వుంటారో కానీ, ప్రశ్నిస్తే చాలు ఆయన తట్టుకోలేరు. చేతిలో అపరిమితమైన అధికారం వుందనే కారణం కావచ్చు, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఆయన అనుకుంటున్నట్టున్నారు.
సీఐఐ సమ్మిట్ వల్ల వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులపై ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా టీడీపీకి తీవ్ర నష్టం తెచ్చేలా ఉన్నాయి. బాబు చేసిన నష్టాన్ని, పూడ్చేందుకు అన్నట్టుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వీడియో విడుదల చేశారు. బాబు మాటల్ని వక్రీకరించారని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం.
చంద్రబాబు ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో పౌర సమాజం వుందని పల్లా శ్రీనివాసరావు భావిస్తున్నారా? అనే ప్రశ్న ఎదురవుతోంది. గతంలో తమ సమస్యలు చెప్పుకోడానికి వెళ్లిన నాయీ బ్రాహ్మణులపై నడిరోడ్డుపై చంద్రబాబు చిందులు తొక్కారు. తోకలు కట్ చేస్తానని, వారి వృత్తిని అవమానించే రీతిలో బాబు మండిపడడాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు.
మరోవైపు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును నిలుపుకోలేక పోతుండడంతో పాటు ఇంకా పెట్టని ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తుందని ఆయన చెప్పడం విశేషం. ప్రైవేటీకరణపై చంద్రబాబు మోజు మరోసారి బయటపడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చంద్రబాబు పాలనంటే చాలు ప్రైవేట్కు స్వర్గధామం. విద్య, వైద్యం, పరిశ్రమలు ఇలా ఒక్కటేమిటి అన్నీ ప్రైవేట్పరమే. కేవలం తమ పదవుల్ని మినహాయించుకుని, అన్నింటినీ ప్రైవేట్పరం చేయడానికి చంద్రబాబు వెనుకాడడం లేదని వామపక్షాల నాయకుల విమర్శలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు కామెంట్స్ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీకి నష్టం తెచ్చేలా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. బాబు చెప్పింది వినాలే తప్ప, ఎదురు ప్రశ్నిస్తే ఆయన స్పందన అట్లే వుంటుందనే మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నాయకుడిగా మరోలా వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లు అని సీపీఐ నాయకుడు కె.రామకృష్ణ ఆరోపణ చర్చనీయాంశమైంది.

