*_MAAGHA PURANAM -- 3_*
*_మాఘపురాణం - 3వ అధ్యాయము_*
*_వింధ్య పర్వతము:_*
*వశిష్ఠుడు మరల ఈ విధముగా దిలీపునకు చెప్పా సాగెను. భూపాలా! నేను చెప్పే ఈ విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి చాలా నష్టము జరిగినది*. *అందువలన జనులు యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకొను మునీశ్వరులు సహితము ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస వెళ్ళిపోతున్నారు. భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు, పంటభూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు.*
*మహాతపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక ఎన్నో సంవత్సరములనుండి ఆ ప్రాంతము నందు ఉండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసవెళ్ళి పోయాడు*.
*హిమాలయ పర్వతములకు పడమటి దిక్కున కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఒక తెల్లని కొండచరియ ఉన్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావముతో ప్రార్థించారు. ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరిస్తు ఉంటారు” అని వివరించారు*.
*దిలీపుడు వశిష్ఠునితో - “ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగ చేస్తున్నవి.* *ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించాడు.*
*వశిష్ఠులవారు “రాజా! నీ అభీష్టం ప్రకారమే వివరిస్తాను* *సావధానుడవై ఆలకించు*.
*“ ఆ పర్వతరాజము ఎంతో వింతయినది. దానిపైనున్న వింత చెట్లు, వన్య మృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతం ముప్పది యోజనముల పొడవు కలిగి, పది యోజనములు ఎత్తు కలిగి అలవారుచుండెను. ఆ ప్రాంతమునకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించి తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించుకుని ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతము మీదకి వచ్చి తపము చేసుకొనుచున్న భృగుమహర్షిని చూచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును చెప్పసాగాడు*.
*_గంధర్వ యువకుని వృత్తాంతము_* -
*“భృగుమహర్షీ! నా కష్టము ఏమని చెప్పను? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినది. కానీ నాకు పులి ముఖము కలిగినది. ఏ కారణము చేత అలా కలిగినదో బోధపడకున్నది. నా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. నా ఈ రూపమునకు కారణమును వివరించి నా మనోబాధను తొలగింప చేయమ” ని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము ఆలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని*-
*“ఓ గంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడు కృంగదీయు విషయములు. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానము పరమ ఔషధము. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. నువ్వు నీ భార్యతో గూడ ఈ పర్వతము నుంచి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. ఇది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూరుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ తీరుతుంది. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను*.
*ఆ గంధర్వుడు, ఆతని భార్య కూడా భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా విని మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను*. *ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై దగ్గరలో ప్రవహించుచున్న నదిలో స్నానం చేయగా వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను*. *ఆ గంధర్వ దంపతులు అమితానందము పొంది వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసారు. భృగువు వారలను దీవించి పంపివేసాడు.*
*ఈవిధముగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకు తెలియ చేసి “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతము? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన గొప్ప ఫలితములు కలుగును* #మన సంప్రదాయాలు సమాచారం


