ఇప్పటివరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసింది గోరంత,చేయాల్సింది కొండంత!
లేదా
దేశవ్యాప్తంగా 60% శాతానికి పైగా ప్రజలు ఇప్పటికి వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న నేపథ్యంలో అయా రంగ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా శ్రద్ద వహించాలి,దృష్టి పెట్టాలి!
ఇప్పటివరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి కొద్దో గొప్పో ప్రాముఖ్యత ఇచ్చే పనిలో భాగంగా పీఎం కిసాన్ నిధి,రైతు భరోసా,కొన్ని పంటలకు మాత్రమే ఇస్తున్న నష్ట పరిహారం,రైతు పండించే పంటలకు అతి కొద్ది శాతం మాత్రమే ఇచ్చే సబ్సిడీ విత్తనాలు,ట్రాక్టర్,వ్యవసాయ పరికరాల కొనుగోలు వంటి వంటి వాటిపై అరకొరగా మాత్రమే రైతులకు సబ్సిడీగా అందజేస్తున్నారు అనే మాట సత్య దూరం కాదు.అయితే దేశ వ్యాప్తంగా 60 % శాతానికి పైగా ప్రజానీకం ఇప్పటికి వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నేపథ్యంలో అయా రంగ అభివృద్ధిపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా శ్రద్ద కనబరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వున్న రైతులలో చాలా మటుకు ఎక్కువ భాగం చిన్న,సన్నకారు రైతులు వున్న నేపథ్యంలో వారికున్న అరకొర ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి పెన్షన్ సౌకర్యం కలిగించడంతో పాటు ఏదేని కుటుంబాన్ని పోషించే రైతు అనుకోని పరిస్థితుల్లో ఏదేని ప్రమాదం వల్లనో లేక అన్యూహమైన రీతిలో ఆ రైతుకు మరణం సంభవించినప్పుడో ఆ రైతు తరపున ఆ కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు లభించేలా ఆ రైతు తరపున లైఫ్ ఇన్సూరెన్సు సౌకర్యం మన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడితే వారి జీవితాలకు ఎనలేని భరోసాను కల్పించిన వారవుతారు.అదేవిధంగా ఓక చిన్న,పెద్ద కుటుంబాన్ని పోషించే రైతు దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలు అయితే ఆయనపై ఆధారపడిన కుటుంబం ఆ రైతుకు వచ్చిన జబ్బును నయం చేసేందుకు తగినంత ఆర్థిక వనరులు వారి దగ్గర లేకపోవొచ్చు అలాంటి సందర్భాలలో హెల్త్ ఇన్సూరెన్సు అత్యంత అవశ్యకం. ఈ స్కీమ్ సైతం అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవశ్యకత ఎంతైనా వుంది.ఇంకా చెప్పుకుంటూ పోతే రాత్రనక,పగలనక, వాననక, ఎండనక ఆరుగాలాలు శ్రమించి పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా ఈ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కృషి సల్పాల్సిన గురుతర బాధ్యత వారి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.అదేవిధంగా రైతు సోదరులు పంటలు విత్తే విషయంలో వారు తీసుకునే విత్తనాలపై సబ్సిడీ సౌకర్యం,అలాగే పంట వేసిన తరువాత వాటిని కాపాడే నిమిత్తమై వాడే బయో ఫర్టిలైజర్,బయో ఫెస్టిసైడ్స్ మందులపై సబ్సిడీ సౌకర్యాన్ని ప్రవేశపెడితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సోదరులకు ఎంతో మేలు చేసిన వారవుతారు. ఇలాంటి సౌకర్యాలు అన్ని ప్రతి రైతు పొందేలా వారికి ఓక ప్రత్యేక కార్డును అందజేస్తే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఒక్క రైతు వీటి వల్ల లబ్ది పొందగలడు.అన్నింటికి మించి ఇప్పటి కాలంలో వ్యవసాయరంగం అనేది మోయలేని భారం వంటిది అని ప్రతి ఒక్కరూ భావిస్తూ అయా రంగం వైపు వెళ్లాలంటేనే జంకే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో,ప్రస్తుత యువతరం సైతం ఈ రంగంపై ఆనాశక్తి కనబరుస్తున్న నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఒకటికి,రెండు సార్లు అలోచించి ఎలాంటి స్ఫూర్తిదాయకమైన సంస్కరణలు వ్యవసాయరంగంలో చేపడితే యువత వ్యవసాయరంగంపై మెగ్గు చూపుతారో,అయా వ్యవసాయ నిపుణులతో చర్చించి మరీ కసరత్తు చేయాల్సిన తక్షణ కర్తవ్యం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై ఎంతైనా వుంది.
ఏదిఏమైన అనాదిగా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలలో ఓక భాగంగా వుంటూ రావడమే కాదు నిన్న,మొన్నటి వరకు ఓక వెలుగు వెలిగిన వ్యవసాయరంగం అనేక కారణాల రీత్యా,ఓక విధంగా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న తరహాలో ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వ్యవసాయ రంగం తిరిగి పూర్వపు వైభవం దిశగా పయనించేలా,అది ప్రస్తుత,రాబోయే తరం యువతకు మంచి లాభదాయకమైన వృత్తిగా మారేలా చేయాల్సిన గురుతర బాధ్యత మాత్రం ముమ్మాటికీ మన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల పెద్దలదే అనడంలో ఇసుమంతైనను సందేహం లేదు.ఏమైనా యావత్ దేశానికి పట్టేడు అన్నం పెట్టే అన్నదాతలు తమ వ్యవసాయ రంగంలో ఎలాంటి ఇబ్బందులు, ఒడిదుడుగులు,ఆటుపోట్లు,ప్రతికూల,దయనీయ పరిస్థితులు ఎదుర్కొనకుండా పచ్చగా,సుబిక్ష్యంగా ఉంటేనే మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయేది అనే మాట అక్షర సత్యం.ఎందుకంటే ఇప్పటికి దేశావ్యాప్తంగా కూడా మెజారిటీ ప్రజలు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయరంగం మీదే కాబట్టి మన దేశ పాలకులు ఎక్కువగా వ్యవసాయరంగం మీద మరింతగా ఫోకస్ చేసి,యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక శ్రద్ధాశక్తులు చూపించి ఆ రంగ అభివృద్ధికి పెద్ద పీట వేయగలిగితే మన దేశ రూపురేఖలు,ఆర్థిక స్థితిగతులు సమూలంగా మారిపోవడంతో పాటు,రైతన్నల బాగుదలకు కూడా ఒక బంగారు బాటను చూపినవారవుతారు అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.జై కిసాన్! అన్నదాత సుఖీభవ!దేశావ్యాప్తంగా కూడా వ్యవసాయ రంగం మరో పది కాలాల పాటు అత్యంత కనులపండుగగా సాగిపోతూ,అత్యంత తేజోవంతంగా ఒక వెలుగు వెలగాలి!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల, నంద్యాల జిల్లా! #farmers


