ప్రభల తీర్థం :
🍁🍁🍁🍁🍁
అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలోని జగ్గన్నతోటలో ప్రభలతీర్థం జరుగుతుంది. మొసలపల్లి భోగేశ్వర స్వామి వారి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మరో పది పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు జగన్నతోటలోని ఏడెకరాల ప్రదేశానికి తరలివస్తాయి. లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమవుతారని ప్రజల విశ్వాసం. ఆ పదకొండుమంది ఎవరంటే...
గంగలకుర్రు అగ్రహారంలోని వీరేశ్వరస్వామి, చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరంలోని వ్యాఘ్రేశ్వర స్వామి, పెదపూడిలోని మేనకేశ్వర స్వామి, ఇరుసుమండలోని ఆనందరామేశ్వర స్వామి, వక్కలంక గ్రామదైవం కాశీవిశ్వేశ్వర స్వామి, నేదునూరు - చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల - రాఘవేశ్వర స్వామి, పాలగుమ్మి - మల్లేశ్వర స్వామి, పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వర స్వామితో పాటు మొసలపల్లి భోగేశ్వరస్వామి.
వీరందరి సమావేశానికి ఆయా దేవాలయాల నుంచి ప్రభలు బయలుదేరుతాయి. ప్రభలను వెదురుకర్రలతో, రంగురంగుల వస్త్రాలతో, పూలతో తయారు చేస్తారు. వాటిని శివునికి ప్రతిరూపంగా భావిస్తారు. వీటిని మామూలు రహదార్లపై తీసుకురారు. పొలాల మధ్యగా ఊరేగింపుగా తీసుకువస్తారు. పొలాల మధ్యనుంచి ప్రభలు రావడం వల్ల పంటలు బాగా పండుతాయని రైతులు భావిస్తారు. ప్రభలన్నింటినీ వరుసగా నిలిపివుంచి నృత్యవాయిద్యాలతో శివునికి ప్రీతి కలిగిస్తారు. భక్తులు ప్రభలకు నమస్కరించి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభల తీర్థానికి వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే ఏక సంథాగ్రాహి ఉండేవాడు. అతడు కౌశికీ నది ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకిందే ఎప్పుడూ ఉండేవాడు. ఆ చెట్టుకింద గ్రామదేవత నెలకొని ఉండేది. విఠల జగ్గన్నపై ఈర్ష్యకలిగినవారు కొందరు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో నిజాం నవాబుని కలిసినప్పుడు జగ్గన్న ప్రతిభ బయటపడింది. అతని పాండిత్యాన్ని చూసి మెచ్చుకున్న నవాబు, ఆ మర్రిచెట్టుతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చాడు. ఫిర్యాదు చేసిన ప్రజల ఆనందం కోసం జగ్గన్న మొదటిసారి ప్రభల తీర్థం జరిపాడు. దేవుడికి గుళ్లు గోపురాలు అవసరం లేదని, దైవానికి మైల అంటదని చెప్పేందుకే ప్రభల తీర్థం ప్రారంభమైంది. కులమతాలకు అతీతంగా ప్రభలను ఎవరైనా మోయవచ్చు.🙏🙏🙏🙏🙏
#హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #తెలుసుకుందాం #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡


