ShareChat
click to see wallet page
search
ఆయనకు రాజకీయంగా ఒక్క శత్రువు కూడా లేరు: సీఎం చంద్రబాబు డిసెంబర్ 11 నుంచి 25 వరకు 'అటల్ సందేశ్ యాత్ర' యాత్రలో పాల్గొనాలని కూటమి ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు పిలుపు వాజ్‌పేయిని రాజకీయ భీష్ముడిగా అభివర్ణించిన వైనం పోఖ్రాన్ అణుపరీక్షలు, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు వాజ్‌పేయి ఘనతలేనని కితాబు రాష్ట్ర అభివృద్ధికి వాజ్‌పేయి ఎంతగానో సహకరించారని గుర్తుచేసుకున్న చంద్రబాబు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించనున్న 'అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన' యాత్రను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే కూటమి నేతలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 11 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ యాత్రలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. మంగళవారం ఆయన ఎన్డీయే ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, యాత్రకు సంబంధించిన పలు సూచనలు చేశారు. వాజ్‌పేయి అందించిన సుపరిపాలన సందేశాన్ని ప్రజల్లోకి, ముఖ్యంగా యువతలోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ యాత్రను నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వాజ్‌పేయిని 'రాజకీయ భీష్ముడు'గా అభివర్ణించారు. ఆయన శత జయంతి వేడుకల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయి బలమైన పునాదులు వేశారని, ఆయన అమలు చేసిన విధానాలే దేశాభివృద్ధికి బీజాలు వేశాయని కొనియాడారు. "వాజ్‌పేయికి రాజకీయంగా శత్రువులు లేరు. ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని ఆయన దేశానికి అందించారు" అని చంద్రబాబు పేర్కొన్నారు. వాజ్‌పేయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, తన అవిరళ కృషితో అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. తొమ్మిదిసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికవ్వడమే ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుడని కొనియాడారు. 1998లో పోఖ్రాన్-2 అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారతదేశ సత్తాను చాటారని, కార్గిల్ యుద్ధంలో శత్రువులకు దీటైన జవాబు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. వాజ్‌పేయి హయాంలో చేపట్టిన స్వర్ణ చతుర్భుజి (గోల్డెన్ క్వాడ్రిలేటరల్) రహదారి ప్రాజెక్టు దేశ గతిని మార్చేసిందని చంద్రబాబు అన్నారు. టెలికాం, విమానయాన రంగాల్లో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కూడా ఆయనేనని తెలిపారు. "ఆయనతో నాకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో సహాయం చేశారు. రాష్ట్రం తరఫున ఏది అడిగినా కాదనే వారు కాదు. ప్రజలకు ఏది ఉపయోగమో అదే చేసేవారు. విధానాల రూపకల్పనలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు" అని చంద్రబాబు తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎన్టీఆర్, వాజ్‌పేయిలను చూస్తే సుపరిపాలన ఎలా ఉండాలో అర్థమవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కూడా ఒక విలక్షణమైన వ్యక్తిత్వమున్న నేత అని, ఆయన ఎప్పుడూ ప్రజలకు మంచి చేయాలనే తపనతో ఉండేవారని అన్నారు. "అప్పుడు అణుపరీక్షలు అయినా, ఇప్పుడు సిందూర్ ఆపరేషన్ అయినా.. నిన్నటి చతుర్భుజి అయినా, నేటి సాగర్‌మాల అయినా.. అన్నీ ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలే" అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2047 నాటికి దేశాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని, యువతకు గొప్ప స్ఫూర్తినిస్తున్నారని ఆయన ప్రశంసించారు. #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
📰జాతీయం/అంతర్జాతీయం - UISI ! IEIIDER 17 M H UISI ! IEIIDER 17 M H - ShareChat