కాలభైరవాష్టకం..అర్ధంతో...............!!
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
దేవేంద్రునిచే పూజించబడిన పాదపద్మములు కలిగిన,
సర్పమును యజ్ఞోపవీతముగా కలిగినవాడు,
చంద్రుని ధరించిన వాడు, కృపాకరుడు,
దిక్కులనే వస్త్రములుగా కలిగినవాడు,
నారదాది మునులచే పూజించబడినవాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
కోటి సూర్యుల వలె ప్రకాశించువాడు,
భవ సాగరాన్ని దాటించేవాడు,
జగదీశ్వరుడు, నీలకంఠుడు, కామ్యములను తీర్చేవాడు, మూడు నేత్రములు కలిగినవాడు,
యముని సంహరించినవాడు,
పద్మములవంటి కన్నులు కలవాడు,
అజేయమైన త్రిశూలము కలవాడు,
నాశనము లేని వాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించినవాడు,
నల్లని మేను కలవాడు, సనాతనుడు,
నాశనము లేనివాడు, మొదటి వాడు,
రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు,
విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడేవాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్
వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
కోరికలు తీర్చి, మోక్షాన్ని ప్రసాదించేవాడు,
పేరుగాంచిన సౌందర్యమున్న దేహము కలవాడు,
శివుని రూపమైనవాడు (స్థిరమైన వాడు),
భక్త ప్రియుడు, లోకేశ్వరుడు,
వేరు వేరు రూపములలో విలసించేవాడు,
చిరుగజ్జెలు కలిగిన బంగారు మొలత్రాడు ధరించినవాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశనం
కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుమ్
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
ధర్మమనే సేతువును పాలించేవాడు,
అధర్మ మార్గములను నాశనము చేసేవాడు,
కర్మ బంధములనుండి తప్పించేవాడు,
మనము చేసే తప్పులను తెలియచేసి మనకు సిగ్గును కలిగించేవాడు,
బంగారు రంగులో ఉన్న పాశము,
సర్పములు దేహ భాగములకు ఆభరణములుగ కలిగిన వాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
రత్నములు పొదిగిన పాదుకలచే అలరారు పాదములు కలిగిన వాడు,
అంతటాయున్న వాడు, రెండవసాటి లేనివాడు,
ఇష్ట దైవమైన వాడు, కామ్యములు తీర్చేవాడు, మానవులకు మృత్యు భయమును తొలగించేవాడు,
తన దంతముల ద్వారా మోక్షమును కలిగించేవాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
బ్రహ్మచే సృష్టించబడిన వాటిన తన అట్టహాసముతో నాశనము చేయ గలిగినవాడు,
సర్వ పాపహారము చేసే వీక్షణములు కలవాడు,
తెలివైన వాడు, చండ శాసనుడు,
అష్ట సిద్ధులను ప్రసాదించే వాడు
(అణిమ, గరిమ మొదలగునవి),
కపాలముల మాల ధరించిన వాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
భూత నాయకుడు, ఎనలేని కీర్తిని ప్రసాదించే వాడు,
కాశీ పురవాసుల మంచి చెడును విచారించేవాడు,
నీతి మార్గములో నిపుణుడు, శాశ్వతుడు, జగత్పతి,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
ఫల శ్రుతి.
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం
శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్
తాత్పర్యము:
అనంతమైన జ్ఞాన మూలమైన,
సత్కార్యముల ఫలమును పెంచే,
శోకము, మోహము, దారిద్ర్యము, కోరిక, క్రోధము నశింపచేసే ఈ మనోహరమైన కాలభైరవాష్టకం
పఠించే వారికి ఆ భైరవుని సన్నిధి ప్రాప్తించును.
ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం.
కాలభైరవుడు:
దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు
ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.
తీక్ష్ణ దంష్ట్ర!మహాకాయ!కల్పాంతదహనోపమ |
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||
కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ.
రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు.
దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం.
కుక్కను వాహనంగా చేసుకుని తిరిగేవాడే తప్ప
ఆయనే కుక్క కాదు.
కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు.
రక్షణకు కూడా తిరుగులేని పేరు.
సమయోచిత జ్ఞానానికి ప్రతీక.
కాలస్వరూపం ఎరిగిన వాడు.
కాలంలాగే తిరుగులేనివాడు.
ఎంత వ్యయమైనా తరిగిపోనివాడు.
శాశ్వతుడు, నిత్యుడు.
వీరభద్రుడిలా భైరవుడు కూడా శివుడు నుంచి ఆవిర్భవించినవాడే.
తన విషయంలో అవమానకరంగా వ్యవహరించిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలోనే 'భైరవుడు' ని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు.
మహా పరాక్రమవంతుడైన భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల అయిదు శిరస్సుల్లో ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు.
ఆ తరువాత బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి తాను ఏం చేయాలో చెప్పమని భైరవుడు అడుగుతాడు.
ఖండించినటు వంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఉండమనీ,
ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో,
అక్కడితో ఆయన పాపం ప్రక్షాళన అవుతుందని శివుడు చెబుతాడు.
భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కిందపడిన ప్రదేశమే నేడు 'బ్రహ్మ కపాలం' గా పిలవబడుతోంది.
ఆ తరువాత శివాజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి చేరుకున్న భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు.
భైరవుని రూపాలు ఎనిమిది...
1) కాలభైరవ
2) అసితాంగ భైరవ
3) సంహార భైరవ
4) రురు భైరవ
5) క్రోధ భైరవ
6) కపాల భైరవ
7) రుద్ర భైరవ
8 ) ఉన్మత్త భైరవ
ఇవే కాక
భీష్మ భైరవ,
స్వర్ణాకర్షణ భైరవ,
శంబర భైరవ,
మహా భైరవ,
చండ భైరవ
అనే రూపాలు కూడా ఉన్నాయి.
స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం.
ఈ స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు.
తలపై చంద్రుడు ఉంటాడు.
4 చేతులు ఉంటాయి.
ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది.
స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
వారణాసి లో కాలభైరవాలయాన్ని దర్శిస్తే తప్ప కాశి యాత్ర పూర్తికాదు.
ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు.
రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి.
కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు
''ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే,
తన్నో కాలభైరవ ప్రచోదయాత్''
అని ప్రార్థిస్తారు.
మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి.
ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది.
ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు.
నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.
కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు.
ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు.
తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు.
కాలభైరవుడు ప్రయాణీకులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు.
అందుకే సిద్ధులు 'ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు.. ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేప్పుడు కాలభైరవునికి జీడిపప్పుల మాల నివేదించి, దీపారాధన చేసి పూజించాలని,
అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా వుంటాడని చెప్తారు.
కాలభైరవుని వాహనం శునకం.
కనుక కుక్కలకు ఆహారం పెట్టి,
వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ,
అనురక్తితో సాకినట్లయితే,
పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే.
కాల భైరవాష్టమి:
ఇది పరమ పవిత్రమైన రోజు.
ఆరోజు కాలభైరవుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనేక శివాలయాల్లో కాలభైరవుని విగ్రహాన్ని వుంచుతారు. దాంతో అవి మరింత పవిత్ర ప్రదేశాలుగా గుర్తింపు పొందుతాయి.
అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు వుండటాన వాటిని ప్రత్యేకంగా కీర్తిస్తారు.
కాశీలోని కాలభైరవుని ఆలయాన్ని కాలభైరవ ఆరాధకులు తప్పక దర్శించుకుంటారు.
భక్తిగా కొలుస్తారు.
దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.
తీక్ష్ణ దంష్ట్ర!మహాకాయ!కల్పాంతదహనోపమ |
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||
శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాలవారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది.
శ్రీ కాలభైరవుడి విగ్రహానికిగాని, చిత్రపటానికిగాని
పూజ చేయవచ్చు.
శనివారం, మంగళవారాలు కాలభైరవుడికి అత్యంత ప్రితికరమైన రోజులు.
పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి.
కాలభైరవ పూజని సాయంత్రం 5 – 7 గం..ల మధ్య చేస్తే మంచిది.
శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.
ఇక కాలభైరవాష్టకం విష్ణు సహస్ర, లలితా సహస్ర నామాల్లా ఎంతో విశేషమైంది.
రాహువుకు అధిపతి.
రాహు సంబంధమైన అరిష్టాలు ఉన్నవారు
కాలభైరవ అష్టకాన్ని స్మరించుకున్నట్టయితే
వాటినుండి వెంటనే విముక్తులౌతారు.
మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి.
మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు,
బట్టల భైరవుడు దర్శనమిస్తారు.
విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైంది.
కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది.
ఢిల్లీలో పురాన్ ఖిల్లా వెనక గోడకి దగ్గరగా కాలభైరవుడు ఉన్నాడు.
ఆ కాలభైరవుని భీముడు తీసుకువచ్చాడు. రాజసూయయాగం పాండవులు చేసేటప్పుడు నిర్విఘ్నంగా జరగాలంటే ఏమిటి ఉపాయం?
అంటే కాలభైరవుని ఆశ్రయించు. విఘ్నాలు రావు అన్నారు.
ఆయనను సేవిస్తే నేను వస్తున్నా పో అన్నారు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో
అష్ట భైరవుడున్నాడు.
అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్ కొట్టయ్, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి,
మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.
భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని,
ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని,
నిరంతరం ఆపదలనుండి కాపాడాలని
భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు.
ఓం నమః శివాయ..!!
#Sri Kalabhirava Swamy
లోకా సమస్తా సుఖినోభావంతు..!!
#తెలుసుకుందాం ##kalabhirava


