అజ్ఞానం నుంచి మేలుకొలుపు!
ఆరో పాశురం PASURAM 6 🙏🙏🙏🙏🙏
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మెళ్ళ ఎళుంద్ వారి ఎన్జీన్జ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
ఆరవ పాశురం నుంచి 15వ పాశురం వరకు ఆండాళ్ పది మంది గోపికలను మేల్కొల్పిన వర్ణనలు ఉన్నాయి. పూర్వా చార్య సంప్రదాయానుసారం ఈ తొమ్మిది పాశురాలు ఆండాళ్ తన 'తండ్రులై'న ఆళ్వారులకు (మధురకవి ఆళ్వార్ కాకుండా) పాడిన మేల్కొలుపు (ఆల్వార్కళ్ తిరుపళ్ళియు లొచ్చి)గా పరి గణన పొందుతోంది.
ఇంకా నిద్రపోతున్న మొట్టమొదటి భక్తురాలిని ఆండాళ్ ఈ పాశురంలో ఇలా నిద్ర లేపుతోంది: “పక్షుల కిలకిలారావాలు ఇంకా నీ చెవిని పడలేదా? ఆలయంలో గరుడారూఢుడైన భగవానుని సుప్రభాతసేవలో పూరించిన శంఖనాదం వినిపిం చటం లేదా? పూతనాసంహారం, శకటాసురభంజనం చేసి, ఆదిశేషునిపై యోగనిద్రలో ఉన్న పరమాత్ముణ్ణి మునులు, యోగిపుంగవులు తమ హృదయాలలో ప్రతిష్ఠించి ఏడు మార్లు గావిస్తున్న హరినామస్మరణ పవిత్రఘోష మాకు వినిపించి మేము నిద్ర మేల్కొన్నాం సఖీ, నువ్వూ నిద్ర లేచిరా!"
విషాన్ని స్తన్యంగా ఇచ్చిన పూతన సంహారం, బండి రూపంలో చంపవచ్చిన రాక్షసుడిని పసికాలితో తన్ని చేసిన శకటాసురవధ శ్రీమద్భాగవతంలో తొట్టతొలిగా వర్ణించిన కృష్ణలీలలు. "ఈ లీలలను తలచుకొని ఉప్పొంగి పోతూ, 'హరీ, హరీ!' అని శేషసాయిని స్తుతిస్తూ సాధు జనులు నెమ్మదిగా.... తమ హృదయస్థుడైన పరమాత్మ నుంచి మనసు చెదరకుండా, అతి నెమ్మదిగా తమ యోగనిద్ర నుంచి మేల్కొని చేసే అఖండ నామోచ్చారణ గొప్ప మేఘనాదమై నలుదిక్కులా ప్రతిధ్వనిస్తుంటే చెవినబడి మేము నిద్రలేచాం. చెలీ! నీవు కూడా లే!" అంటోంది ఆండాళ్.
_అందరం ఆయన కింకరులం_
భగవద్- భాగవత అనుభవంలో ఏ మాత్రం అవగాహన లేని గోపికను ఆండాళ్ 'పిళ్ళాయ్!' అని సంబోధిస్తోంది. “నీకు భాగవతానుభవం కొత్త కాబట్టి అజ్ఞానమనే తన మాయ ముసుగులో నిద్ర మత్తు నిన్ను గట్టిగా బంధించింది. ఈ 'పిల్లతనమనే (అజ్ఞానం) నిద్రను విదిలించి, భాగవతా నుభవంలోని రసాన్ని రుచి చూడు. ఆ రసా స్వాదనలో విశేషజ్ఞురాలివి కావాలి.
లే! భగవానుడు హంసావతారం దాల్చితే ఆచార్యవర్యులు ఆయన కృపావిశేషం వల్ల పరమహంస లైనారు. వారు మనకు ఉపదేశం ఇస్తున్నారు.
"భోగాలు దుఃఖకారకాలు. మేల్కొనగానే 'హరి'ని తలుచుకుంటాం. నడయాడేటప్పుడు 'కేశవుని' స్మరిస్తాం. భుజించేటప్పుడు 'గోవింద' నామం జపిస్తాం, 'మాధవుని' తలచుకుంటూ నిద్రిస్తాం. మునులు, సాధువులు చేసే హరినామస్మరణ గొప్ప ఘోషగా ప్రతిధ్వనిస్తోంది” అంటూ ఆండాళ్ సఖిని మేల్కొల్పుతున్నది.
ఆండాళ్ తిరువడిగళే శరణం🙏
#గోదాదేవి (ఆండాళ్) తిరుప్పావై పాశురాలు (మంగళకరమైన మేలుకొలుపు) #ఆండాళ్ తిరువడిగలే శరణం #ఆండాళ్ తిరుప్పావై పాశురం #ఆండాళ్ #ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏


