✨ నారాయణ_నారాయణ_నామస్మరణ
✨ శ్రీమన్నారాయణ నామస్మరణ మహాత్మ్యం🙏
ఒకసారి నారద మహర్షికి ఒక సందేహం కలిగింది.
“నారాయణ నామస్మరణ వలన నిజంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?” అని.
ఆ సందేహ నివృత్తి కోసం నారద మహర్షి వెంటనే వైకుంఠానికి వెళ్లి, తన అనుమానాన్ని శ్రీమన్నారాయణుని ముందు ఉంచాడు.
అప్పుడు భగవంతుడు నారద మహర్షితో ఇలా అన్నాడు –
“నారదా! ఇప్పుడే భూలోకంలో నైమిశారణ్యంలో ఒక కీటకం జన్మించింది. నీవు వెళ్లి దానిని ఈ ప్రశ్న అడుగు.”
భగవంతుని ఆజ్ఞ మేరకు నారద మహర్షి ఆ కీటకం వద్దకు వెళ్లి,
“నారాయణ నామస్మరణ వలన ప్రయోజనం ఏమిటి?” అని అడిగాడు.
ఆ మాట వినగానే ఆ కీటకం గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిచింది.
విషాదంతో నారద మహర్షి తిరిగి వైకుంఠానికి వెళ్లి జరిగిన విషయం శ్రీమన్నారాయణునికి తెలియజేశాడు.
అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు –
“అలాగా! అయితే మళ్లీ భూలోకానికి వెళ్లి, కశ్యప మహర్షి ఆశ్రమంలో జన్మించిన ఒక ఆవుదూడను అదే ప్రశ్న అడుగు.”
నారద మహర్షి అక్కడికి వెళ్లి ఆ ఆవుదూడను ప్రశ్నించాడు.
ఆ ప్రశ్న వినగానే ఆ ఆవుదూడ కూడా తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది.
ఇది చూసి నారద మహర్షి ఆశ్చర్యచకితుడై తిరిగి వైకుంఠానికి వచ్చి విషయం తెలియజేశాడు.
అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడు –
“నారదా! ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. నీవు వెళ్లి ఆ శిశువును నీ ప్రశ్న అడుగు.”
అందుకు నారదుడు భయంతో ఇలా విన్నవించాడు –
“ప్రభూ! నా వల్ల ఒక కీటకం, ఒక ఆవుదూడ ప్రాణాలు కోల్పోయాయి.
ఇప్పుడు శిశువుని వద్దకు వెళ్తే, శిశుహత్యా పాతకం నాపై పడుతుందేమో!”
అప్పుడు శ్రీమన్నారాయణుడు అభయమిస్తూ –
“నారదా! నీకు ఎలాంటి పాతకం తగలదు.
వెళ్లి నీ సందేహానికి సమాధానం పొందు.” అన్నాడు.
భగవంతుని ఆజ్ఞ మేరకు నారద మహర్షి కాశీరాజుకు జన్మించిన శిశువు వద్దకు వెళ్లి తన అనుమానం తీర్చమని అడిగాడు.
అప్పుడు ఆ శిశువు పకపక నవ్వుతూ ఇలా చెప్పింది –
“ఓ మహర్షి!
నేను గత జన్మలలో చేసిన అనేక పాపాల ఫలితంగా నీచమైన కీటక జన్మను పొందాను.
ఆ జన్మలో నీవు వచ్చి ‘నారాయణ’ అనే పవిత్ర నామాన్ని నా చెవిలో వినిపించావు.
ఆ నామస్మరణ వలన నా పూర్వజన్మల పాపాలు నశించి, పవిత్రమైన గో జన్మ లభించింది.
ఆ జన్మలోనూ నీవు మళ్లీ అదే నామాన్ని నాకు వినిపించావు.
ఆ పుణ్యఫలంతోనే ఇప్పుడు నేను కాశీరాజుకు కుమారుడిగా జన్మించాను.
ఇంతకన్నా నారాయణ నామస్మరణ మహాత్మ్యం🙏 ఇంకేముంటుంది చెప్పు, ఓ మహర్షి!”
అని చెప్పి ఆ శిశువు మళ్లీ తన బాల్యావస్థలో లీనమైంది.
నారద మహర్షి పరమానందభరితుడై,
శ్రీమన్నారాయణుని అనేక విధాలుగా స్తుతించి
తన ఆశ్రమానికి తిరిగి వెళ్లాడు.
నారాయణ నారాయణ నారాయణ🙏
#🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః #ఓం నమో నారాయణాయ #🙏🏻భక్తి సమాచారం😲 #దేవుళ్ళ స్టేటస్


