ShareChat
click to see wallet page
search
కోనసీమ సంక్రాంతి సంబరాల్లో అత్యంత ప్రధానమైనది ప్రభల తీర్థం.* కోనసీమ వ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా దాదాపు 160 ప్రాంతాల్లో ప్రభల జాతరలు నిర్వహిస్తారు. అయితే వీటన్నింటిలో జగ్గన్న తోట ప్రభల జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ఈ ఉత్సవానికి తాజాగా రాష్ట్ర పండుగ (స్టేట్ ఫెస్టివల్) హోదా లభించింది. సుమారు 450 ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గన్న తోట ప్రభల జాతరను ప్రతి ఏడాది కనుమ పండుగ రోజు అంబాజీపేట మండలం మొసలిపల్లి గ్రామ శివారులోని జగ్గన్న తోట వద్ద ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంప్రదాయాన్ని చుట్టుపక్కల 11 గ్రామాల ప్రజలు తరతరాలుగా కొనసాగిస్తున్నారు. 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా ప్రసిద్ధి చెందిన రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు, “ఏకాదశి రుద్రులంతా ఒకచోట కలవాలి” అనే ఆచారానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచే కనుమ పండుగ రోజున ఈ ప్రభల తీర్థం అనివార్య సంప్రదాయంగా కొనసాగుతోంది. ఏకాదశ రుద్ర ప్రభలు – 11 గ్రామాల నుంచి అంబాజీపేట పరిసర ప్రాంతాల్లోని 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్ర ప్రభలు జగ్గన్న తోటకు తరలివస్తాయి. గంగలకుర్రు అగ్రహారం నుంచి – వీరేశ్వర స్వామి గంగలకుర్రు నుంచి – చెన్న మల్లేశ్వర స్వామి వ్యాఘ్రేశ్వరం నుంచి – వ్యాగ్రేశ్వర స్వామి ఇరుసుమండ నుంచి – రామేశ్వర స్వామి వక్కలంక నుంచి – కాశీ విశ్వేశ్వర స్వామి పెదపూడి నుంచి – మేనకేశ్వర స్వామి ముక్కామల నుంచి – రాఘవేశ్వర స్వామి మొసలిపల్లి నుంచి – భోగేశ్వర స్వామి నేదునూరు నుంచి – చెన్న మల్లేశ్వర స్వామి పాలగుమ్మి నుంచి – చెన్న మల్లేశ్వర స్వామి పుల్లేటికుర్రు నుంచి – అభినవ వ్యాగ్రేశ్వర స్వామి ఈ ఏకాదశ రుద్రులు లోక కళ్యాణం కోసం చర్చలు జరుపుతారని, అందువల్లే కోనసీమ సుభిక్షంగా ఉంటుందనే గట్టి నమ్మకం స్థానికుల్లో ఉంది. ప్రభల విశేషత వెదురు కర్రలను అర్థచంద్రాకారంలో అమర్చి ప్రభలను తయారు చేస్తారు. ఒక్కో ప్రభకు టన్నుల కొద్దీ బరువు ఉండటంతో కనీసం 30 మంది భక్తులు మోయాల్సి ఉంటుంది. కొన్ని ప్రభలను రహదారుల మీదుగా తీసుకువస్తే, మరికొన్నింటిని పంట పొలాలు, నదుల మీదుగా తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణ. గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారాల ప్రభలు అప్పర్ కౌశిక నదిని దాటే డ్రోన్ దృశ్యాలు భక్తులను కట్టిపడేస్తాయి. పంట పొలాల మీదుగా ప్రభలు వెళ్లి పంటలు నష్టపోయినా రైతులు బాధపడరు. సాక్షాత్తు శివుడు తమ పొలాల మీదుగా వెళ్లాడని భావిస్తారు. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా కోనసీమ వాసులు ప్రభల తీర్థానికి తప్పనిసరిగా స్వగ్రామాలకు చేరుకుంటారు. ఖరీదైన కార్లు ఉన్నా, కొందరు భక్తులు ఎడ్ల బండ్లలోనే జగ్గన్న తోటకు రావడం ఈ సంప్రదాయంపై ఉన్న భక్తిని చాటుతుంది. అందుకే కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలన్నీ ఒకే రోజు, ఒకే చోట చూడాలంటే ప్రభల జాతరే ప్రతిబింబం. జాతీయ స్థాయిలో గుర్తింపు కోనసీమ జగ్గన్న తోట ప్రభల వైభవం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్లో శకటం (ట్యాబ్లో) రూపంలో ప్రదర్శితమైంది. ఈ ప్రదర్శనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రభల తీర్థం వైభవాన్ని ప్రశంసించారు. తాజాగా కూటమి ప్రభుత్వం జగ్గన్న తోట ప్రభల ఉత్సవానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది. మండపేట పర్యటన సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడును ప్రభల ఉత్సవాల వేద పండితులు, నిర్వాహకులు కలిసి ఆశీర్వదించారు. భారీ ఏర్పాట్లు ఈ ఏడాది ప్రభల జాతరకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఏకాదశ రుద్రుల ఆలయాలు ఉన్న 11 గ్రామాల ప్రజలు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని జాతర నిర్వహణకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈసారి సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో జగ్గన్న తోట పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. #🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:19