శివుని పదిహేడు తత్త్వములు................!!
బ్రహ్మమునకు సంబంధించి ముఖ్యముగా 17నామములు లేదా గౌణముల రహస్య తత్త్వరహస్యములను తెలుసుకొని శివునిగా ఉపాసిస్తారు.
ఆ రహస్యాన్ని అనామయ స్తవంలో స్తవకర్త రహస్యంగా మనకి అందించారు.
అందరూ ఈ 17తత్త్వములను గూర్చి తెలుసుకొని
దాని పై విచారణ చేసి శివునుపాసింతురుగాక..
వందే రుద్రం వరద మమలం దండినం ముండధారం
దివ్యజ్ఞానం త్రిపురదహనం శంకరం శూలపాణిం
తేజోరాశిం త్రిభువనగురుం తీర్థమౌళిం త్రినేత్రం
కైలాసస్థం ధనపతిసఖం పార్వతీనాధ మీశమ్.
రుద్రం = రుద్రుడు
(జీవుల పాప పుణ్య ఫలప్రదుడై,
పాప ఫలము ననుభవింపజేయు రుద్ర స్వరూపము, ఆశ్రయించినవారి పాప ఫలమునుకు రుద్రుడై
ఆ పాపఫలితాన్నితొలగించ గలవాడు ఐన లయకారక తత్త్వంతో ఉనన్ రుద్రతత్త్వం)
వరదం = వరప్రదుడు
(అతి సులభుడు, ప్రాపంచిక - పారలౌకిక కోరికలను
అతి సులువుగా తీర్చగలవాడు)
అమలం = నిర్మలుడు
(అన్నియూ తానేఐనా, తనవేఐనా , తనకేదీ అంటనివాడు, అన్నపూర్ణ భర్తయైనా అంటులేనివాడు అని రుద్రం వ్యాఖ్యానించిన పెద్దలు సూచించారు అదే, దరిద్రత్+నీలలోహిత మంత్రాలలో రుద్రంలో చెప్పబడేది)
దండినం = దండాన్ని ధరించినవాడు (రక్షకుడు)
ముండధారం = కపాలధరుడు
(కపాలము భ్రూమధ్యనుంచి బ్రహ్మరంధ్రం వరకు అక్కడనించి సరిగ్గా భ్రూమధ్య రేఖ వెనకవేపుకు పాయింట్ వరకు సరిగ్గా ఉన్న అర్థ చంద్రాకారమే రుద్రంలో చెప్పిన ధనస్సు, దానికి సంకేతమే కపాల ధారణం, శ్రీవిద్యా రహస్యంగాకానీ, శివోపాసన రహస్యములుగా కానీ పెద్దల ద్వారా ఇవి తెలుసుకోవచ్చును)
దివ్యజ్ఞానం = అందరూ దేనిగూర్చి తెలుసుకోవాలో
ఆ దివ్యజ్ఞానస్వరూపుడు
త్రిపురదహనం= త్రిపురములను దహించినవాడు
(స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను దహింపజేసి జ్ఞానాన్ని ఇవ్వగలిగినవాడు, జ్ఞాన స్వరూపుడు)
శంకరం = శం కరోతి ఇతి శంకరః - ఎల్లప్పుడూ శుభమునే కూర్చేవాడు (వంశ వృద్ధికావించి అందరినీ మంగళప్రదులుగా చేసేవాడు అంటే సృష్టికార్యం నిర్వహించే చతుర్ముఖబ్రహ్మతత్త్వంగానూ, స్థితికారకత్వంతో విష్ణుతత్త్వంగానూ ఉండేవాడు)
శూలపాణిం = శూలమును ధరించేవాడు
(త్రిశూలము పైన మూడుగా ఉన్నా ఆధారముగా ఉన్న కర్రవంటిదాన్ని ధరించే వాడు, అంటే మూడింటికి ఆధారమైన వస్తువును చేతిలో పట్టుకున్నవాడు లేదా తానే ఆధారమైనవాడు)
తేజోరాశిం = అనంత తేజోరాశి, అజ్ఞాన దాహకత్వానికి కావలసిన సంపూర్ణమైన తేజోపుంజం
త్రిభువనగురుం = మూడులోకములకూ గురు స్వరూపము ఐనవాడు (లేదా ఈ భువనములో ముఖ్యంగా మూడు రూపములలో గురువుగా ఉండేవాడు అవే తల్లి, తండ్రి, ఆచార్యుడు అని కూడా వ్యాఖ్యానమున్నది)
తీర్థమౌళిం = తీర్థమును ధరించినవాడు, గంగాధరుడు (నీరు ప్రాణములను నిలబెట్టునది, ప్రాణములను నిలబెట్టు నీటిని తన అధీనంలో ఉంచుకొనేవాడు, తద్వారా సృష్టి రక్షకుడు దీనినే స్థితికారకత్వమైన విష్ణుతత్త్వం అని తెలుసుకోవలె)
త్రినేత్రం = మూడు కన్నులు కలిగినవాడు (సూర్య, చంద్ర, అగ్నిలుగా ఉండి లోక సాక్షిగా ఉన్నవాడు)
కైలాసస్థం = కైలాస వాసి, కేళి జరుగు స్థలమున నుండు వాడు
ధనపతిసఖం = కుబేరునకు మిత్రుడు
( తాను అందరికీ ఇచ్చేవాడు తనకేమీ ఇవ్వనవసరంలేనివాడు, అన్నిటా పరిపూర్ణుడు)
పార్వతీనాథం = పార్వతీ దేవికి పతిఐనవాడు
(పర్వతం లేదా గిరి అంటే అనంత వేద రాశి, దానినధిష్టించినది లేదా దాని చివరల ఉన్నది
నాద రూపమైన పరబ్రహ్మ తత్త్వం ప్రణవం అదే ఓం కారం, దానికి సూచనే గిరీశుడు అన్నపేరు లేదా పార్వతీనాథుడన్నపేరు)
ఈశం= ఈశ్వరుడు, శివుడు
వందే = నమస్కరించుచున్నాను
బ్రహ్మాండ, పిండాండములలో లేదా సాధనలో సహస్రార చక్రములో అమృతధారలు కురిపిస్తున్నటువంటి చంద్రుని కళలు 16 ఇందులో 15 కళలు శుక్ల, కృష్ణ పక్షములలో క్షయ వృద్ధిని పొందుతూనే ఉంటాయి,
ఇక పదహారవ కళ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది
అదే శివుని తలమీది చంద్రవంక.
అది సదా ఉంటుంది కాబట్టి దానికి సాదా కళ ని పేరు దాన్నే బృ.ఉ లో ’ధృవా’ అని చెప్పారు.
ఈ పదహారవ కళ సంకేతమే శివునికన్న అభిన్నమైన శక్తి రూపము అని.
అందుకే ఇద్దరికీ ఈ చంద్రకళ ఉంటుంది.
ఆ శక్తి ఏ తత్త్వాన్ని ఆశ్రయిస్తుందో అది సర్వాతీతమైన తత్త్వం. అదే శివుడు.
దీని సూచన ఏమిటి? ఏం చెప్తోందిది?
అంటే సర్వాతీతమైన అద్వితీయమైన పరబ్రహ్మం గురించి, ఆయన జరిపే ఈ అనంత సృష్టి క్రమం గురించి ఎన్నో గ్రంధరాజాలు సమస్త వాజ్ఞ్మయమూ చెప్పినదాన్ని సూచకంగా ఒక్క శ్లోకంలో ఈ పదిహేడు తత్త్వాలలో రహస్యంగా ఇమడ్చబడి చెప్పబడింది..
చంద్రుని 16వ కళ శివునికన్నా అభిన్నమైన శక్తి స్వరూపమని తెలియబడింది కదా,
అంటే శివుని నుండి వ్యక్తమైనది అది ఎన్నటికీ మారదు, ఆయననే అంటిపెట్టుకొని ఉంటుంది,
అందుండి మరో పదిహేను కళలు బయటికొచ్చాయి
ఇవి కాలంలో పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. సృష్ట్యాంతంలో ఇవి తిరిగి 16వకళలోకి వెళ్లిపోతాయి
ఆ పదహారవదైన సాదా కళ శివునికన్నాభిన్నముగాకాక శివునియందే ఉండిపోతుంది.
17వ తత్త్వమైన శివమొక్కటే శాశ్వతము, అద్వితీయమైనదిగా ఉండిపోతుంది,
అదే వేదాంత ప్రతిపాదితమైన పరబ్రహ్మస్వరూపము.
ఓం నమః శివాయ..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
#తెలుసుకుందాం #చిదానంద రూప శివోహం శివోహం #🕉️హర హర మహాదేవ 🔱 #om Arunachala siva🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ


