#🕉️🙏కాళికా దేవిఅమ్మవారు 🙏 🕉️ #Kalika Devi #kalika devi photo #పురాణం కాళికా పురాణం* *అధ్యాయం - 1* *కామదేవ జననం* శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ॥ అగజానన పద్మార్కం గజాననం అహర్నిశమ్ అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ॥ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥ పరమ కళ్యాణ స్వరూపుడయిన నారాయణునకు, పరమ పుణ్యమూర్తి అయిన నరునకు, పురుషోత్తముడయిన విష్ణు భగవానునకు వందనము. చదువుల తల్లి అయిన సరస్వతీ దేవికి, వేద పురాణ ఇతిహాస దురంధరుడయిన వ్యాసదేవునకు వందనమొనర్చి అటు పిదప పురాణ పఠనము నొనర్చ వలెను. అత్యంత పుణ్యప్రదులు, వివేకశీలురు, ప్రశాంత చిత్తులు అయిన యోగులు తమ హృదయాంతరాళములందు ఎవరి పదకమలములను నిరంతరము ధ్యానించుచుందురో, ఎవరి పదకమలములనుండి ధరిత్రి మొదలు పదునాల్గు భువన భాండములు ఆవిర్భవించినవో, అట్టి కళ్యాణ గుణాకరుడు విష్ణు భగవానుని పదాంభోజములు మమ్ము రక్షించు గాక. ఎవరు సర్వజీవుల హృదయాంతరాళములందు నిబిడీకృతమై యున్న అజ్ఞానాంధకారము పారద్రోలు సూర్య స్వరూపిణియో, ఎవరు యతీశ్వరులకు ముక్తిదాతయో, ఎవరు సమస్త జీవరాశిని మోహము నందు ముంచెత్తుచున్నారో, ఎవరు శుద్ధబుద్ధిని ఉత్పన్నమొనర్చి కుబుద్ధిని నాశము చేయుచున్నారో, ఎవరు పరమాత్ముని మాయాశక్తి అయిన పరమేశ్వరియో, ఆ శక్తి మమ్ములను రక్షించుగాక. సంసారమునకు ఆదిభూతుడయిన చతుర్ముఖ బ్రహ్మదేవునికి, పురుషోత్తముడయిన విష్ణు భగవానునికి, లయకారకుడయిన శంకరునికి ప్రప్రథమముగ ప్రణామము లాచరించి నేను నిత్య జ్ఞానమయమయిన శ్రీకాళికా పురాణమును ప్రవచించుచున్నాను. ఒకనాటి మాట. పరమ పవిత్రము, ప్రశాంతము, ఏకాంతమయిన హిమాలయ శృంగ సానువుల పరిశర ప్రాంతమందు వేదజ్ఞుడు, త్రికాలవేత్త అయిన మార్కండేయ మహర్షిని సమీపించి కమరాది మునీశ్వరులు సాంజలి బంధకముగ ప్రణామములాచరించిరి. ఇట్లు ప్రశ్నించిరి, ఓ మహానుభావా, మీరు సర్వ శాస్త్ర విశారదులు. మీరు సమస్త వేదరాశిని షడంగ సహితముగ మథించి అద్దాని సారాంశమును వ్యాఖ్యారూపముగ మాకందరకు అందించిరి. మార్తాండుడు తమోరాశిని విచ్ఛిన్నము చేయునటుల సమస్త వేద శాస్త్రముల యందలి మా సంశయములను మీరు మీ ఉపదేశము చే నివృత్తి గావించిరి. ఓ ద్విజోత్తమా, దీర్ఘజీవాగ్రేసీ, బ్రహ్మదేవ ప్రతిపాదితమయిన ధర్మశాస్త్రమును మీ శుభకటాక్షము చే సాంగోపాంగముగ అధ్యయనము చేసి కృతార్థులమైతిమి. ఈనాడు మా మనసులందు ఒక ఆఖ్యానమును వినవలెనను కోరిక పొడసూపినది. అయ్యది ప్రాచీన కాలమందు భగవతి కాళికాదేవి ఏ ప్రకారముగ సతీరూపము ధరించి శంకర భగవానుని మోహితుని కావించినది. సదైవధ్యానస్థితుడు, యమనియమాది దీక్షలందు సర్వదా స్థితగతుడు, సంసార విముఖుడు అయిన ఆ కామదహనుని ఆ తల్లి ఎట్లు వ్యాకులుని గావించినది. సతీదేవి దక్షప్రజాపతి గర్భము నుండి ఎట్లు ఉత్పన్నమయినది. శంకర భగవానుడు దారాగ్రహణమునకు ఎట్లు అంగీకరించెను. దక్షునిపై కోపించి సతీదేవి ఎట్లు శరీరత్యాగము కావించినది. తిరిగి హిమవత్పుత్రిక అయిన హైమవతిగా ఎట్లు జన్మించెను. ద్విజోత్తమా, ఆ తల్లి తిరిగి ఎట్లు కామారి అయిన శంభుని అర్ధాంగిగా ప్రాప్తించెను. ఈ విషయములన్నియు రహస్య సహితముగా, విస్తారముగ వివరింపవలసినది. ఎందుకనగా ఈ సంశయకార్యమందు మీకు తుల్యులు వేరొకరు లేరు, ఇకముందు ఉండబోరు. ఓ అత్యజ్ఞాన స్వరూపా, విప్రేంద్రా, మాకు సులభముగ అర్థమగురీతిని ఈ వృత్తాంతమును వినిపింప కోరి ప్రార్థించుచున్నాము. మార్కండేయుడు ఇట్లనెను, మునిసత్తములారా, మీ ప్రశ్న కడు శ్లాఘనీయము. కానీ ఈ వృత్తాంతము అత్యంత గోపనీయములకు కూడా గోపనీయము. అతి పవిత్రము, శ్రేష్ఠము, సర్వ శుభ సంయక్ జ్ఞాన ప్రదాయకము. ఇయ్యది సమస్త కామనలను ఈడేర్చే శ్రీకాళికా పురాణము. దీనిని అత్యంత శ్రద్ధాభక్తులతో ఆలకింపవలసినది. దీనిని తొలుత బ్రహ్మదేవుడు మహాత్ముడయిన నారదునకు ఉపదేశించెను. నారదుడు వాల్మీక్యులకు, వారు యవక్రీతునకు, యవక్రీతుడు అసితునకు ఉపదేశించిరి. పుణ్య ప్రదుడయిన అసితుడు విస్తారముగ నాకు ప్రసాదించెను. నేను సమస్త బ్రహ్మాండములకు స్వామి, చక్రధరుడయిన విష్ణు భగవానునకు సాంజలి బంధకముగ ప్రణామములు గావించుచు ఈ ఆఖ్యానమును మీకు వినిపించెదను. సదసద్రూపుడు, వ్యక్తావ్యక్త స్వరూపుడు, స్థూల సూక్ష్మ రూపములతో అన్నిటా అంతటా వ్యక్తమగుస్వామి, విధాత, శాశ్వతుడు, నిత్య జ్ఞానానంద స్వరూపుడు, నిర్వికారుడు, విద్యావిద్యా స్వరూపుడు, సర్వ చైతన్యమూర్తి, కాలరూపి అయిన పరమాత్మునకు నమస్కారము. నిర్గుణుడు, షడూర్ములు లేనివాడు, షడ్వికార రహితుడు, విరాగి, సర్వవ్యాపకుడు, విశ్వసృష్టి స్థితి లయలకు కారకుడు, సర్వప్రాణుల అంతఃకరణము నందు ప్రకాశించు పరంజ్యోతి, యోగి జనుల ఆత్మచింతనకు హేతువయిన పరమేశ్వరునికి నమస్కరించుచున్నాను. ఇటువంటి పరమేశ్వరునికి ఆరాధన మొనర్చి లోకపితామహుడయిన చతుర్ముఖ బ్రహ్మ దక్షాది దశ ప్రజాపతులను, దేవతా దైత్య మనుష్యాది జీవులను సృష్టించెను. అటు పిదప మరీచి, అత్రి, పులహుడు, అంగిరుడు, క్రతువు, పులస్త్యుడు, వశిష్ఠుడు, నారదుడు, ప్రాచేతసుడు, భృగువు మొదలగు పదిమంది మానస పుత్రులను సహితము సృజించెను. అటు పిమ్మట ఒక విచిత్రము జరిగినది. ఆయన మనసు నుండి అత్యంత సుందర శరీరిణి, కోమల మృదులాంగి, సాయం సంధ్యా స్వరూపిణి అయిన ఒక కన్యకామణి ఉద్భవించెను. ఆ తరుణీమణి సంధ్యా. ఆమెతో సమానమయిన రూప, యవ్వన, గుణశాలి మూడు కాలముల యందు, దేవ, మనుష్య, రసాతలాది లోకములందు లేరనిన అతిశయోక్తికాదు. ఆ కన్యక తన స్వాభావ సిద్ధ రూపముతో, ఒత్తైన నల్లని కురులతో, వర్ణకాలపు మయూరము వలె భాసించుచుండెను. ఆమె లలాటము ఇంద్ర ధనుపు వలె వంపు తిరిగి, లాలిత్యభరితమై, ఆకర్ణాంతము విస్తరించిన కనుబొమలు గూడి బాలచంద్రుని వలె శోభించుచున్నది. ఆ చపలనయన రమణీయ కనుబొమలు కామదేవుని ధనువును తోపించుచున్నవి. బ్రూమధ్యము నుండి బయలుదేరిన నాసిక సువ్వుల పువ్వుము వలె కొనదేరి మూర్తీభవించిన లావణ్యము అధికమై లలాటము నుండి క్రిందికి జారినదా అన్నట్లుయున్నది. ఆ ఇందువదన ముఖము ఎర్రకలువ వలె భాసించుచూ, పూర్వ చంద్రుని ప్రభను దీప్తించుచున్నది. ఎర్రని పెదవుల కాంతి ముగ్గిన దొండపండ్లను పరిహసించుచున్నది. ఆ ఇంతి వక్షోజములు పుష్టియై, కమల కోశముల వలె ఉవ్వెత్తున ఉబికి, ఉన్నతములై యుండి ముసలను సహితము మత్తిభ్రమణము కావించుచున్నవి. ఆమె నడుము పట్టు వస్త్రము వలె త్రివళీయుక్తమై, పిడికిట పట్టునంత సన్నమై, ఎల్లరకు మదన మందిర దర్శనము కావించుచున్నది. ఏనుగు తొండముల వంటి తొడలు, ఆ గజరాజగమన కదలికకు మరింత సొంపు చేకూర్చుచున్నవి. ఆ లలన చరణ ద్వయము ధరిత్రి పై అంకురించిన అరుణ కమలముల వలె గోచరించుచూ, సున్నితమయిన వేళ్ళు కాముని అస్త్రముల వలె భాసించుచున్నవి. ఆ మరాళగమన వదనము సుందర దంత పంక్తియుతమై, సుచిన్నితమై, సుతిమెత్తని రోమావళి, అలతి అలతి స్వేదబిందు యుక్తమై, విశాల నేత్రములతో విరాజిల్లుచున్నది. చిబుకము, నాభి, యోని మండలము మొదలగు మూడు అంగములు లోతుగా యుండి, కపోలములు, స్తనద్వయము, శ్రోణీమండలము ఎత్తుగా యున్న ఆ అరాళకుంతలను గాంచి చతుర్ముఖ బ్రహ్మ చిత్తమున కలిగిన చాంచల్యము చే చింతితుడై ఒక్క ఉదుటున పైకి లేచెను. ఈ విధముగా సృష్టింపబడిన వరవర్ణినిని కాంచిన దక్షాది ప్రజాపతులు, చతుర్ముఖ బ్రహ్మా, మరీచాది మునులు నిశ్చేష్టితులై ఇట్లు యోచింప దొడంగిరి, సృష్టి యందు ఈ కాంతామణి చే కాగలిగిన కార్యము ఏమున్నది, ఈ మగువ ఎవరిని వరించును. ఆ సమయమున బ్రహ్మదేవుని మనసు నుండి మరియొక మహోజస్వి అయిన మనోహర పురుషుడుదయించెను. ఆతని దేహఛాయ పుటము పెట్టిన బంగారు చూర్ణము వలె భాసించుచుండెను. శిరసుపై ఉంగరములు తిరిగిన నల్లని ఒత్తైన కుంతలములు, చంచలములయిన విశాల కనుదోయి, భ్రూమధ్యమున కలిసిన కనుబొమలు, ప్రఫుల్ల కమలదళముల వంటి నేత్రములు, సుందర దంతపంక్తి కలిగి ముఖ కమలము పూర్ణచంద్రుని పోలియుండెను. గళము శంఖము వలె యుండి, క్రింద వక్షస్థలము విశాలమై, రోమావళితో సుసంపన్నమైయుండెను. బాహుద్వయము ఐరావత తొండము వలె పుష్టిగా, దీర్ఘములుగాయుండి, భుజములు మదించిన గోళాకారము పోలియుండెను. సన్నని నడుముపై విశాల వక్షస్థలము సుస్థిరముగ యుండెను. ఆ సుందర పురుషని ముఖము, నేత్రములు, కాళ్ళు, చేతులు, వేళ్ళు రక్త వర్ణముతో శోభించుచున్నవి. ఆ కమల లోచనుని అంగముల నుండి పుష్పపరాగ సుగంధము వెలువడుచున్నది. మీనధ్వజుడై ఆ విశాలకాయుడు మొసలి వాహనము పై ఏతెంచెను. ఆ యువకుడు భుజముపై పుష్పధనువుతోడై, పుష్పబాణ సదృశుడై తన మధుర కటాక్ష వీక్షణములతో ఎల్లరనూ పరికించుచుండెను. సుగంధభరిత వాయు సమేతుడు, శృంగార రస సేవితుడు అయిన ఆ సుందర పురుషని వీక్షించగనే బ్రహ్మా, దక్షాది ప్రజాపతులు, మరీచాదిమునులు తమ మనసులు వివిధ వికారము లోంద విస్మితులైరి. ఆ పురుషుడు జగత్సృష్టి, సృష్టికర్త అయిన చతుర్ముఖ పరమేష్ఠిని గాంచి వినమ్రుడై అంజలి ఘటించి ఇట్లనియె, హే బ్రహ్మన్, విధాతా, నేనెల సృష్టింపబడితిని, నా కార్యమేమి, నా వంటి పురుషునకు ఉచితమయిన, న్యాయమయిన వృత్తిని నిర్ణయింపవలసినది. ఓ లోకేశ్వరా, మీరు జగత్ సృష్టి దాయకులు, మరియు నియామకులు. అందువలన నా నామధేయము, యోగ్యమయిన స్థానము, నాకు కాగలిగిన వృత్తి నిర్ణయము దయచేసి నిర్ణారింప వలసినది. ఈ విధముగ పలికిన పలుకులు వినియునూ, తన స్వవిశే నిశ్చేష్టితుడయిన బ్రహ్మ ఒక్క క్షణ వర్యంతము మాటలు రాక మూగబోయి, ఇంతలో తేరి, తన ఆశ్చర్యమునూ, చిత్త చాంచల్యమునూ పూర్తిముగ విడనాడి మనసున సంయముడై ఇట్లనియె. ఇప్పటి వరకూ బ్రహ్మ మానస సృష్టి జరిగినది. ఇక నుండి నీవు సుందర రూపుడవై, పుష్పబాణ సహితుడవై, స్త్రీ పురుషులను మోహింపజేయుచూ సనాతనము, పారంపరికము అయిన సృష్టికార్యమును నెరవేర్చుము. ఇకనుండి నీ బాణధాటికి దేవ, గంధర్వ, కిన్నెర, కింపురుష, మహోరగ, అసుర, దైత్య, దానవ, విద్యాధర, రాక్షస, యక్ష, వినాయక, భూత, పిశాచ, గుహ్యక, సిద్ధ, సాధ్య, మనుష్య, పశు, పక్షి, జంతు, కీట, పతంగ, జల చరములన్నియునూ తలొగ్గి వలసినదే. ఒక్క మాటలో నీ పుష్ప బాణములకు మోహింపబడని వారుండరు. వేయేల, నేను, వాసుదేవుడయిన విష్ణువు, స్థాణువయిన శివుడు కూడా నీకు వశ్యులగుదురని, మిగిలిన ప్రాణుల గూర్చి తలంచనేల. నీవు ప్రాణుల మనసును నీ బాణ లక్ష్యముగ ఎంచి సమస్త ప్రాణులందు కామోద్రేకము గావించి సురతానందము ఉత్పన్నము కావింపుము. ఈ విధముగ సృష్టి ప్రవర్ధన కార్యము నీ విధి. ఇప్పుడు నీకు యోగ్యమయిన నామమును వచించెదను. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఈ విధముగ పలికి తన మానస పుత్రుల మనోభావముల గమనించుచూ, వారిని పరికించి చూచుచూ నెమ్మదిగా తన పద్మాసనమందు సుస్థితుడాయెను. తలొగ్గి వలసినదే, ఒక్క మాటలో నీ పుష్ప బాణములకు మోహింపబడని వారుండరు. వేయేల, నేను, వాసుదేవుడయిన విష్ణువు, స్థాణువయిన శివుడు కూడా నీకు వశ్యులగుదురని, మిగిలిన ప్రాణుల గూర్చి తలంచనేల. నీవు ప్రాణుల మనసును నీ బాణ లక్ష్యముగ ఎంచి సమస్త ప్రాణులందు కామోద్రేకము గావించి సురతానందము ఉత్పన్నము కావింపుము. ఈ విధముగ సృష్టి ప్రవర్ధన కార్యము నీ విధి. ఇప్పుడు నీకు యోగ్యమయిన నామమును వచించెదను. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఈ విధముగ పలికి తన మానస పుత్రుల మనోభావముల గమనించుచూ, వారిని పరికించి చూచుచూ నెమ్మదిగా తన పద్మాసనమందు సుస్థితుడాయెను. *శ్రీ కాళికా పురాణమందలి కామ ప్రాదుర్భావ వర్ణనమను ప్రథమోధ్యాయము సమాప్తము* *కాళికా దేవి ప్రార్థనా శ్లోకం* *కాళికాం కాలరూపాం చ* *కాలాతీతాం కలావతీమ్* *కాలరాత్రిం కామరూపాం* *కాళికాం ప్రణమామ్యహమ్ ॥* *సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే* *శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే ॥*
9 shares