#అంతర్యామి #కాలచక్రం...
🍁మనిషి జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. జీవన పయనంలో మూడు ప్రధాన శక్తులు మనల్ని ముందుకు నడిపిస్తాయి. అవి భావం, కర్మ, కాలం. భావం మన మనసులో ఆకాంక్షలను రేకెత్తిస్తుంది, కర్మ వాటిని కార్యరూపంలో పెడుతుంది. కానీ కాలం మాత్రం అన్నింటికి పరిమితులు విధిస్తుంది.
కాల గమనాన్ని ఎవరూ అడ్డుకోలేరని విదురనీతి చెప్పిన మాట మనందరికీ అనుభవైకవేద్యమే. ప్రాచిన భారతీయ తాత్వికులు, మునులు అందరూ కాలాన్ని జీవనాధారమైన సత్యంగా చూశారు. కాలం మహాశక్తిమంతమైంది. అది సృష్టిలోని అన్నిటినీ తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. బలవంతుడు, జ్ఞానవంతుడు, ధనవంతుడు ఎవరైనా కాలం ముందు సమానమే. పనులు వాయిదా వేయడమంటే కాలానికి లొంగిపోయినట్లే.
🍁సమయాన్ని వృథా చేయడమంటే జీవితాన్ని వృథా చేసుకోవడమే. నేటి వేగవంతమైన ప్రపంచంలో సమయ పాలన ముఖ్యమైన జీవన నైపుణ్యం.
🍁'సమయాన్ని సద్వినియోగం చేయడమనేది భక్తిలో మొదటి మెట్టు' అనే గురువుల బోధన అర్ధం చేసుకుంటే జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. సమయాన్ని మిత్రుడిగా అవగాహన చేసుకున్నవారు మాత్రమే లక్ష్యసాధనలో ముందుంటారు. కాలాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేవారు స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాధాన్యాలు నిర్ణయించుకోగలరు. ఒత్తిడికి గురవ్వరు.
🍁 రోజు ముగిశాక ఆ వేళ తన సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నాను అని స్వీయపరిశీలన చేసుకుంటారు. ఆ క్రమంలో చేసిన సత్కార్యాన్నో, గతంలో మొదలెట్టిన పని పురోగతినో నమోదు చేసుకోవాలి. ఇది మరింత బాగా పనిచేసేందుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కాలం ప్రవహిస్తున్న నదిలాంటిది. దాన్ని ఆపలేం కానీ దాన్ని ఎలా ఉపయోగించాలన్నది మాత్రం మన చేతిలోనే ఉంది.
🍁కాలం నిశ్శబ్ద గురువు. ఎవరిని ఎలా తీర్చిదిద్దాలో దానికి తెలుసు..
🍁'నేనే కాలం. లోకాల సంహారకుడిగా, వాటిని నశింపజేయడానికి ఇక్కడ ప్రవృత్తుడనై వచ్చాను' అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కాలం అనేది సృష్టిలయల నిత్యచక్రంలో భాగం. మనకు లభించిన సమయమే మన యుద్ధక్షేత్రం. దాన్ని వృథా చేయకుండా కర్తవ్యాన్ని ఆచరించడమే గీతా మార్గం. మన కర్తవ్యాన్ని సమయానికి చేయడం అంటే దైవసంకల్పానికి అనుగుణంగా జీవించడం. సత్సంగం మనకు సమయాన్ని విలువైనదిగా చూసే దృష్టినిస్తుంది. కాలం మన శత్రువు కాదు, అది మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. మన జీవితాన్ని నిర్మించగల శక్తి ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి క్షణానికీ ఉంది.
🍁 కానీ స్వార్థానికి, ఇహలోకపు ఆకర్షణలూ ఆడంబరాలకు బానిసలమై పరమాత్మ ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. ప్రతి వ్యక్తీ పడుకునే ముందు ఇవాళ నేను ఆ సర్వాంతర్యామికి చేరువయ్యే పని ఏదన్నా చేశానా అని ప్రశ్నించుకోవడం అలవరచుకుంటే సమయం సద్వినియోగం అయితీరుతుంది.🙏
✍️బాలాంత్రపు సత్య కుమారీ
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
#భగవంతుడు సర్వంతర్యామి 🙏🙏🙏 #తెలుసుకుందాం #🗣️జీవిత సత్యం