భగవద్గీత అంటే ఏమిటి?*
జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
రిటైర్‌మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
అది కేవలం హిందువులదా?
పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
కాదు
అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్ ప్రిస్కిప్షన్ ఫర్ లైఫ్’
సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి..
భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.
సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.
సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.
ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.
అసలు భగవద్గీత ఏం చెబుతుంది?
ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
కర్తవ్యం గురించి చెబుతుంది.
నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.
అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది..
*భగవాన్ ఉవాచ....*
రణసీమలో గీతను బోధించిన పరమాత్మ చివరకు ‘కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ! త్వయైకాగ్రేణ చేతసా / కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనుంజయ!’... చెప్పినదంతా జాగ్రత్తగా విన్నావా? అజ్ఞానం వల్ల ఏర్పడ్డ భ్రమ తొలగిందా? అని అర్జునుడిని అడిగాడు. ఫలానా పని చెయ్యమని గానీ, వద్దని గానీ చెప్పలేదు కృష్ణ పరమాత్మ. ఏది మంచో, ఏది చెడో విడమరిచి చెప్పాడంతే.
‘చెప్పాల్సిందంతా చెప్పాను... ఇక నీ ఇష్టం’ అన్నాడు. ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగితే మనిషి మహనీయుడవుతాడు. జ్ఞానం... సాధనతోనే సాకారమవుతుంది. భగవానుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని, ఆదేశాలుగా భావించి పాటిస్తే జీవితం ధన్యమవుతుంది. దానికోసం మరో ముహూర్తమెందుకు?ఈ రోజే మొదలుపెడితే సరి..
ఆదిశంకరాచార్యులు తన భజగోవిందంలో ‘గేయం గీతా నామ సహస్రం’; ’భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికా పీతా...’
గీతా శ్లోకం ఒక్కటి పారాయణ చేసినా గంగా జలాన్ని తాగినంత పుణ్యం వస్తుందంటూ కొనియాడారు.
‘యే యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహమ్’ (కర్మ సన్యాసయోగం).
ఎవరు ఏ దృష్టికోణంతో చూస్తారో వారికి అలాగే కనిపిస్తానంటాడు పరమాత్మ. జరుగుతున్న సంఘటనలపై నీ దృష్టికోణం మార్చుకోమంటుంది భగవద్గీత. జరిగిన సంఘటన నేరుగా ఏ ఫలితాన్నీ ఇవ్వదు. నీ మనసు చేసే మాయాజాలమే ఆనందం, విచారాలు. అందుకే జరిగినదాన్ని ఓ పాఠంగా భావించు. మంచి మాత్రమే స్వీకరించు.
‘ఆశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే/ గతాసూనగతాంసూశ్చ నాను శోచంతి పండితాః’ (సాంఖ్యయోగం)
అనవసరమైన ఆలోచనలు మన బుద్ధిలో వేగాన్ని మందగింపజేస్తాయి. సరైన ఆలోచనల్ని అడ్డుకుంటాయి. గతాన్ని తలచుకుంటూ బాధపడటం మానేసేి భవిష్యత్తులో సాధించాల్సిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకో.
‘ధూమేనావ్రియతో వహ్ని ర్యథాదర్శోమలేన చ’ (కర్మయోగం)
అద్దం మురికి పడితే తన ప్రకాశాన్ని కోల్పోతుంది. మన మనసు కూడా అలాంటిదే. ఆకర్షణలనే మాయ పొరలు మనసును కమ్మితే ఇక చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలేస్తాం. ఏది మంచో ఏది చెడో విచక్షణతో ఆలోచించాలి. లేదంటే కోల్పోయేది బుద్ధి మాత్రమే కాదు.. భవిష్యత్తు కూడా.
‘అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ’ (భక్తియోగం)
సమస్త ప్రాణులపై ద్వేషం లేకుండా ప్రవర్తించాలని గీత బోధిస్తుంది. సమాజం నుంచి తాను ఏం కావాలని కోరుకుంటాడో సమాజానికి తాను కూడా దాన్ని అందించాలి. ప్రకృతికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఓర్పు, దయ, శాంతి, సహనం, క్షమతోనే అద్భుతమైన జీవితం సాధ్యమవుతుంది.
‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్... స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే’ (శ్రద్ధాత్రయ విభాగయోగం)
ఇతరులకు బాధ కలిగించకుండా వారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేలా మాత్రమే మాట్లాడాలి. ఇది కూడా తపస్సే అవుతుంది. ఎప్పుడైతే పరుషమైన పదం మన నోటి నుంచి రాదో అప్పుడు మనల్ని ద్వేషించేవారెవ్వరూ ఉండరు. అంతిమంగా మనకు ఏవిధమైన అశాంతి కలగదు.
‘ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిదీయతే’
‘క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత’ (క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం)
దేహాన్నే క్షేత్రం అంటారు. దీన్ని తెలుసుకున్నవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఎన్నో నియమాలు పాటిస్తూ, జీవితకాలమంతా తపస్సు చేసి, ఏ భగవంతుడిని దర్శించటానికైతే మనస్సు తహతహలాడిపోతుందో ఆ దేవుడు మనలోనే ఉంటాడు. మనలో ఉన్న దైవత్వాన్ని అంగీకరించి, సాటి ప్రాణుల్లో ఉన్నది కూడా ఆ పరతత్త్వమేనని గుర్తించగలగాలి. దాన్ని మోక్ష సాధన అంటారు.
‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా’ (కర్మ సన్యాసయోగం)
అభ్యాసం జీవితకాల ప్రక్రియ.నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి.. నేర్చుకోవాలనుకున్న వ్యక్తి గురువు దగ్గరకు వినయంతో వెళ్లాలి. శరీరం, మనస్సు, బుద్ధి... మూడింటిలోనూ విధేయతను ప్రకటించాలి. గురువును శరణాగతి పొంది జ్ఞానాన్ని ఆర్జించాలి.
‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ఠ పరంతప’ (సాంఖ్యయోగం)
మనిషి విజయానికి మనసే మూల కారణం.ధైర్యం లేని మనసు ఏ ప్రయత్నాన్ని చెయ్యలేదు. ఏ విజయాన్ని సాధించలేదు. అన్యాయాన్ని ఎదుర్కోలేదు. అందుకే పరమాత్మ బోధించినట్లు మనోదౌర్బల్యాన్ని విడిచిపెట్టాలి. సాహసాన్ని శ్వాసగా చేసుకోవాలి.
వరాహ పురాణంలో గీతామహాత్మ్యాం విస్తృతంగా వర్ణించారు. దీంతోపాటు గీతకు ప్రత్యేకంగా 18 పేర్లను ఈ పురాణం సూచిస్తుంది. అవి గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్థమాత్ర, చిదానంద, భవఘ్ని, భయనాశిని, వేదత్రయి, పర, అనంత, తత్త్వార్థ జ్ఞానమంజరి..*
సుఖజీవన గీత భగవద్గీత....
గీత జయంతి సందర్భంగా...
సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతాజ్ఞానమంతా 18 అధ్యాయాలుగా, పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతోంది. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు.
"గీతా శ్రవణ పఠనాలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను' అని భగవానుడు అర్జునుడితో చెప్పిన దాన్ని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది.
భగవద్గీతకు (1.8 అధ్యాయాలున్నట్లే) 18 పేర్లున్నాయి. అది 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి.
గీత అంటే...: సాక్షాత్తూ విష్ణుదేవుడంతటి వాడితో పోల్చదగినవాడు వ్యాస మహాముని ఒక్కడే అలాంటి వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగారు. అలా భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు, లోకానికి అందించాడు. గీత అనే వదంలో '' అంటే త్యాగం, 'తే' అంటే తత్త్వ జ్ఞానం. అంటే త్యాగాన్నీ, తత్వజ్ఞానాన్నీ బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి.
శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా తొలుత విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథ ధ్వజం పై ఉన్న ఆంజనేయుడు.
గీతా మాహాత్మ్యాన్ని శివుడు పార్వతికీ, విష్ణువు లక్ష్మీదేవికీ, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే సతులకు గీతా మాహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. స్నానం చెయ్యడం వల్ల శరీరంపైన ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చెయ్యడం వల్ల సంసారమనే మాలిన్యం తొలగిపోతుంది.
ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కానీ, జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి లాంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం. ఎలాగో వివరించిన గ్రంథం ఇది. కాబట్టి దీన్ని మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం మరొకటి లేదని చెప్పవచ్చు.
మనిషిలోని కోరికలనూ, బాధలనూ నశింపజేయడానికీ, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికీ గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగా, ఔషధగుళికగా వాడుకోవచ్చు.
యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూర్చిన గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతం ఉండదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్దాలు పుట్టుకొస్తుంటాయి. మనం తెలిసి కానీ, తెలియక కానీ చేసే పాపాలన్నీ గీతాపఠనం వల్ల తక్షణమే. నశించిపోతాయి. గీతా మకరందాన్ని సేవించడమే కాదు, అందులోని మంచిని ఆచరిద్దాం కష్టాల కడలి నుండి సుఖాల. తీరానికి చేరుద్దాం..*
గీత చదువుకో...
నీ రాత మార్చుకో.....
#🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏 #గీతా జయంతి శుభాకాంక్షలు #గీతా జయంతి శుభాకాంక్షలు 💐 ,శ్రీకృష్ణ #గీతా జయంతి శుభాకాంక్షలు💐 #భగవద్గీత🙏


