##😁 పొలిటికల్ ట్రోల్స్ #ap politics #political trolls 😆😅😄 #political punch #political jokes #చంద్రబాబు నాయుడు
*బాబును నివేదికలు భయపెడుతున్నాయా❓*
OCTOBER 6, 2025🎯
పాలనపై వివిధ సర్వే సంస్థల నివేదికలు భయపెడుతున్నాయా? అంటే ఔనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. క్షేత్రస్థాయిలో సుమారు 90-100 నియోజకవర్గాల్లో కూటమి ప్రజాప్రతినిధుల పనితీరుపై వ్యతిరేకత ఉన్నట్టు చంద్రబాబుకు నివేదికలు అందినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే సీఎం చంద్రబాబు సభల్లో పదేపదే మళ్లీ జగన్ను ఆదరించొద్దని
కోరడాన్ని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.
కూటమి ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. పలుమార్లు తానే పిలిపించుకుని మాట్లాడినా ఎలాంటి మార్పు రావడం లేదనే ఆవేదన, ఆగ్రహంతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో కూటమి నేతల్ని కట్టడి చేయాలనే బాధ్యతల్ని ఎందుకు మరిచిపోయారని జిల్లా ఇన్చార్జ్ మంత్రులపై చంద్రబాబు కస్సుబుస్సులాడడాన్ని గమనంలో పెట్టుకోవాలి.
చంద్రబాబును అధికారం వుంటుందా? వుండదా? అనే బెంగ వెంటాడుతోన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజల్లో బాగా వ్యతిరేకత వున్న టీడీపీ ఎమ్మెల్యేలను పిలిపించుకుని తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారని సమాచారం. ఇదంతా నాలుగు గోడల మధ్య సాగుతున్న వ్యవహారం. ప్రజలంతా చూసేలా గత పాలకులు అంటూ వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇంకా ఎన్నికలకు మూడున్నరేళ్లకు పైగా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రీతిలో వైఎస్ జగన్కు అధికారం ఇవ్వొద్దని బాబు వేడుకోవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. అసలు ఆయనకు అధికార మార్పిడి జరుగుతుందనే అనుమానం ఎందుకొస్తోందని ఆరా తీయగా... సర్వే నివేదికలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి ఏదో జరుగుతుందన్న భయం లేకపోయినప్పటికీ, భవిష్యత్ మాత్రమే ఆయన్ను ఆందోళనకు గురి చేస్తోందని సన్నిహితులు అంటున్నారు.
వైసీపీ పాలనపై బహిరంగంగా ఎన్నెన్నో విమర్శలు చేస్తున్నా, కూటమి ప్రజాప్రతినిధులు వాళ్ల కంటే బిన్నంగా ప్రవర్తించడం లేదన్న హెచ్చరిక చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తోంది. చంద్రబాబు ఎంతో జాగ్రత్త మనిషి. అయినప్పటికీ, కూటమి ప్రజాప్రతినిధులు చేయిదాటి పోతున్నారన్న అభిప్రాయం ఆయనలో వుంది. అలాగని కట్టడి చేయాలని అనుకుంటున్నా, అది సాధ్యం కావడం లేదు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు, అలాగే రానున్న ఎన్నికలకు మళ్లీ సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు, మంత్రులున్నారు.
సంపాదన తప్ప, మరే మాట ప్రజాప్రతినిధుల చెవికెక్కడం లేదు. మంచీచెడుల గురించి ఆలోచించే తీరిక అసలు వుండడం లేదు. అందుకే కూటమి ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత. అయితే దీనంతటిని వైసీపీ ఏ రకంగా రాజకీయంగా సొమ్ము చేసుకుంటుందనే సామర్థ్యంపై అధికారం ఆధారపడి వుంటుంది. అసలే సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో వైసీపీకి మరేదీ సాటి రాదు. రానున్న రోజుల్లో కాలం ఎన్నెన్ని మార్పులు తీసుకొస్తుందో చూడాలి.


