అశ్వియుజ పౌర్ణమి -- శ్రీ వాల్మీకి జయంతి
పూజ్య గురుదేవులు బ్రహశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారు సంపూర్ణ రామాయణ ప్రవచనాంతర్భాగముగా వాల్మీకి మహర్షి గురించి చెప్పిన విశేషములు, శ్రీ వాల్మీకి జయంతి సందర్భముగా...
వల్మీకము (పుట్ట) లోంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అన్నారు. ఋషులు గంగాతీరంలో భగవధ్యానం చేయమని ఆదేశించగా కుశస్థలి అనే ప్రదేశంలో వాయులింగేశ్వరుడు అనే శివలింగాన్ని ప్రతిష్ట చేసి విశేషంగా ఆరాధన చేయగా పరమశివుని అనుగ్రహంతో వాల్మికీ రామాయణాన్ని రచించారు.
ఒకే పరబ్రహ్మము సృష్టి, స్థితి, లయలలో సృష్టి చేయునప్పుడు బ్రహ్మ గారిగా, స్థితి చేయునప్పుడు శ్రీమహావిష్ణువుగా, లయము చేయునప్పుడు పరమేశ్వరునిగా ఉంటుంది. ఒకే పరబ్రహ్మము మూడుగా ఉంటుంది కనుక అపారమైన శివారాధన చేసిన ఫలితం చేత మహేశ్వరానుగ్రహముతో వాల్మీకి మహర్షి విష్ణుకథను చెప్పే అదృష్టాన్ని పొందారు. ఆయనకు విష్ణుకథ చెప్పటానికి ఉపదేశము చేసినది బ్రహ్మ గారు. వాల్మీకి త్రిమూర్తుల అనుగ్రహాన్ని పొందారు. చేసినది మహేశ్వరారాధన, పొందినది బ్రహ్మ అనుగ్రహం, చెప్పినది శ్రీమహావిష్ణువు కథ.
తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షి ఒక నూరు శ్లోకములలో సంక్షిప్త రామాయణాన్ని తపస్వియైన వాల్మీకిమహర్షి కి చెప్పి నారదుడు వెళ్ళిపోయారు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందముగా ఉన్నది. ఆ రోజు మధ్యాహ్న సమయములో తమసా నదితీరాన ఒక చెట్టు మీద సంభోగ క్రియలో ఉన్న రెండు క్రౌంచపక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణముతో ఉన్న మగ క్రౌంచపక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది.
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్||
ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణముతో ఉన్న రెండు క్రౌంచపక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టిచంపినవాడా ! నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక ! అని శపించారు. ఆయన స్నానము ముగించి ఆశ్రమానికి బయలుదేరారు కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచపక్షులే కనిపిస్తున్నాయి. ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు. అది శ్లోకరూపము దాల్చింది. చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకిమహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. బ్రహ్మగారు అన్నారు "ఓ వాల్మీకి ! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం ---
"నిషాద" అంటే బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్తలోకములు తనయందున్న నారాయణుడని ఒక అర్ధం. "మా" అంటే లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః" అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా! నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక! " అని ఒక అర్థము. ‘యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్’ కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ - మండోదరులలో రావణుడు అనే క్రౌంచపక్షిని నీ బాణముతో కొట్టి చంపిన ఓ రామా ! నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్ధం మారింది.
ఈ ఒక్క శ్లోకంలో మొత్తం రామాయణం వచ్చేసింది.
‘మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ సమాః |యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్ || ‘మా నిషాదః’ – లక్ష్మిని పొందినవాడా – సీతమ్మతల్లి పరిణయం – రామాయణములో బాలకాండ వచ్చేసింది.‘ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ సమాః’ – రాజ్యమునందు ప్రతిష్టింపబడవలసిన రాముడు సత్యవాక్యమునందు తండ్రిని నిలపెట్టడము కోసము రాజ్యత్యాగము చేసి అరణ్యవాసము చేసాడు. అయోధ్యకాండ, అరణ్యకాండ వచ్చేసాయి. ‘యత్ క్రౌంచ మిథునా దేకమ్’ - రెండు క్రౌంచములలో దారితప్పి కామమోహితమైన క్రౌంచపక్షుల జంటలోని క్రౌంచపక్షిని కొట్టినవాడా – అన్నయిన వాలి తమ్ముడైన సుగ్రీవుడు జీవించి ఉండగా తమ్ముని భార్య అయిన రుమతో కామసుఖాన్ని అనుభవించాడు. ధర్మము తప్పిన వాలిని సంహరించాడు కాబట్టి అరణ్యకాండ. తరవాత కిష్కింధకాండ చెప్పెయ్యడము జరిగింది. రావణసంహారము కూడా చెప్పారు కాబట్టి యుద్ధకాండ అయిపోయింది. మరి సుందర కాండ ఎలా పూర్తవుతుంది? ‘క్రౌంచౌ’ అనడము చేత – శరీరము అంతా శుష్కించిపోయినవారిని ఆ పేరుతో పిలుస్తారు. సుందరకాండలో సీతమ్మతల్లి ఉపవాసములచేత శుష్కించి తన తపస్సు చేత రావణుని నిహతుని చేసింది. అందుచేత సుందరకాండ చెప్పబడింది. ఈ విధముగా రామాయణములోని ఆరుకాండలు ఆ శ్లోకములోకి వచ్చేసాయి.
బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహము చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా! నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణం వ్రాద్దామని మొదలుపెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినది మాత్రమే కాక వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతములు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధము, కల్పితము కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం వ్రాయడము మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానము చేసి కూర్చోగానే బ్రహ్మ గారి వరమువల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. రామాయణం రచన ప్రారంబించారు.
కనుక వాల్మీకి రామాయణము పరమ ఆర్షము, పరమ సత్యము, పరమ ప్రామాణికము.
#👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం #వాల్మీకి జయంతి #మహర్షి వాల్మీకి జయంతి జై వాల్మీకి జై జై వాల్మీకి🙏🙏🙏🙏💪💪💪💪🌹🌹🌹🌹🌺🌺🌺🌺 #🙏🏻భక్తి సమాచారం😲