చిన్నారులతో గడిపేలా.. 7-7-7 ఫార్ములా!
పిల్లలకు సమయం కేటాయించండి ఇలా..
పారాడే వయసులో ముద్దులు కురిపిస్తారు.. బుజ్జాయిల వయసు పెరిగే కొద్దీ వారితో గడిపే సమయం తగ్గిస్తూ వస్తారు. పాఠశాల ప్రాయం రాగానే.. మార్కులు, ర్యాంకుల పేరిట ఆటపాటలకు అడ్డుకట్ట వేస్తారు. చదువు.. హోంవర్కులంటూ పరుగులు పెట్టిస్తారు.. ఎదిగే వయసులో బిడ్డల మనసు ఎప్పుడైనా తెలుసుకున్నారా! సరికొత్తగా 7-7-7 నిబంధన (పేరెంటింగ్ రూల్)తో తల్లిదండ్రులకు పిల్లల మనసెరిగే అవకాశం ఉందంటున్నారు మనస్తత్వ నిపుణులు.
ఏమిటా ఫార్ములా..?
తల్లిదండ్రులు ప్రతిరోజూ 7 నిమిషాలపాటు మూడుసార్లు(7-7-7) సమయం కేటాయించాలనేది నిబంధన. ఇది పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు సహకరిస్తుంది. బంధం బలపడుతుంది. ఇంటా, బయటా ఎదురయ్యే ఘటనలను స్వేచ్ఛగా పంచుకుంటారు.
ఉదయం 7 నిమిషాలు: పిల్లలతో గడిపితే వారు రోజంతా సానుకూలంగా ఉంటారు.
సాయంత్రం 7 నిమిషాలు: వారితో కూర్చొని ఆరోజు పాఠశాల, తరగతి గదిలో అనుభవాలు తెలుసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న విషయాలు. ఆసక్తికరమైన అంశాలు పంచుకునే వాతావరణం కల్పించాలి.
రాత్రి 7 నిమిషాలు: నిద్రకు ఉపక్రమించేవేల కథలు చెప్పాలి. తప్పొప్పులు తెలుసుకునేలా నైతిక అంశాలను వివరించాలి. నిద్రపోయే ముందు పిల్లలను దగ్గరకు తీసుకొని కౌగిలించుకోండి. అది వారిలో సురక్షిత, భద్రతమైనచోట ఉన్నామనే నమ్మకాన్ని కలిగిస్తుంది.
#తెలుసుకుందాం #parenting tips #parenting #parenting. #family


