ShareChat
click to see wallet page
search
యద్భావం తద్భవతి ... ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు. ముందు నాస్తికుడు చనిపోగా.. ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని వెళ్లి అక్కడ సభలో విష్ణువును చూపించారు. ఆహా తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు. ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు,ఇంతలో విష్ణు దూతలు వచ్చి అతణ్ని ‘‘పద.. పద’’ అని సభలోంచి తీసుకెళ్లడం ప్రారంభించారు. దానికి అతడు అయోమయంతో.. ‘‘ఎక్కడికి తీసుకుపోతున్నారు?’’ అని వారిని అడిగాడు. ‘‘నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది. తిరిగి భూలోకానికి తీసుకుని పోతున్నాం’’ అని విష్ణుదూతలు చెప్పారు. ‘‘నా పుణ్యం అయిపోవడం ఏమిటి? నేను గొప్ప విష్ణు భక్తుణ్ని. నిత్యం ఆ స్వామిని కొలిచాను’’ అన్నాడు ఆస్తికుడు. ‘‘అది నిజమే. కానీ నువ్వు మూడు కారణాలవల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్లిపోతున్నావు. ఒకటి.. నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక విధినిర్వహణలా పూజచేస్తూ మిగిలిన సమయంలో విష్ణువును ఆలోచనలలోనికి కూడా రానిచ్చేవాడివి కాదు. రెండో కారణం.. ‘స్వామీ! నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు.’ అని రోజూ ఆ దేవదేవుని కోరేవాడివి అంటే.. నీకు మళ్లీ పుట్టాలని, అదీ ధనవంతునిగా జన్మించాలని కోరిక ఉంది. ఇక మూడో కారణం.. రోజూ పూజ పూర్తవగానే ‘ఒక్కసారి కనబడు తండ్రీ.. చాలు’ అని కోరేవాడివి. అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనం అయింది. మళ్లీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళ్తున్నావు’’ అని చెప్పారు. అదే సమయంలో.. ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో అతడు నివ్వెరపోయాడు. వీడెలా వచ్చాడిక్కడికి ? వీడు నాస్తికుడు కదా?’’ అని అతడు విష్ణు దూతలను అడిగాడు. దానికి వారు.. ‘‘అవును, నిజమే. అయితే, బతికి ఉన్నంతకాలం ఇతడు ‘దేవుడు లేడు. దేవుడు లేడు’ అంటూ.. తెలియక చేసినా నీకంటే ఎక్కువగా భగవన్నామ స్మరణ చేశాడు. ఎలాగైనా తప్పులు పట్టాలనే ఆలోచనతో పురాణ ఇతిహాసాలను, ఉపనిషత్తులను ఎన్నో మార్లు చదివాడు. వ్యతిరేకంగానైనా సరే.. నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు. మరొక ముఖ్యకారణం. ఇతడి ఇంట్లో ఇతడు తప్ప అందరూ ఆస్తికులే. ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు. కొడుక్కి నారాయణ అని పేరుపెట్టుకుంది. గడచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది. వీడు ఇంటి అరుగు మీద కూర్చుని ఆ పాయసం తింటుండగా పొలమారింది. విపరీతంగా దగ్గుతూ ‘నారాయణా చచ్చిపోతున్నానురా!’ అంటూ కొడుకుని పిలిచి, అతడు మంచినీళ్లు తెచ్చేలోపునే మరణించాడు. ఏ కోరికా లేకుండా తన ప్రసాదం తిని, నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీమహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు’’ అని చెప్పారు. భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే.. మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు. మనసారా విష్ణువును కొలిచి, చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు ధారపోయడం ద్వారా పాప, పుణ్యాలు అంటని మహా యోగి అయ్యాడు. తెలియక చేసినా భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే.. మరుజన్మలో స్వామిని త్రికరణశుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు. జనన, మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు. ఓం నమో నారాయణాయ #🙏 ఓం నమో నారాయణ #🙏 Om Namo Narayana 🙏 #Om namo narayana #🙏🌼 ఓం నమో నారాయణయ 🌼🙏 #om namo narayanaya
🙏 ఓం నమో నారాయణ - BHUSHAN_priHi | BHUSHAN BSHANM ARKOISNEY &DRH BHUSHAN_priHi | BHUSHAN BSHANM ARKOISNEY &DRH - ShareChat