#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*🔥క్లీన్ చిట్ రాజకీయాన్ని క్లీన్ బౌల్డ్ చేద్దాం..💥*
మన కాళ్లకి మనం దణ్ణం పెట్టుకోవడం భక్తి అవుతుందా ?
మన నెత్తిన మనమే అక్షింతలు వేసుకుంటే అది ఆశీర్వాదం అనగలమా ?
అలాగే, మనకి మనమే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం నైతికత ఎలా అవుతుంది ? ఫైబర్ నెట్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చుకోవడం చూసిన తర్వాత - ఇదెక్కడి బరితెగింపు బాబూ అనకుండా ఉండలేకపోతోంది ఆలోచన గల ఆంధ్రప్రదేశ్ !
ఈ దేశంలో కేసులు కొత్త కాదు. రాజకీయ నాయకులు ఆరోపణలు ఎదుర్కోవడం అంతకన్నా కొత్త కాదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ల మీద కేసులకి అసలు కారణం కూడా చాలా సందర్భాల్లో రాజకీయమే అన్నది కూడా ఓపెన్ సీక్రెట్టే ! సందేహం లేదు.
కాకపోతే ఇలాంటి విషయాల్లో విచారణ ఎలా ఎదుర్కొన్నారు ? న్యాయ స్థానాల్లో చట్టబద్ధంగా ఎలా పోరాడారు ? నైతిక పరీక్షకు ఎంత వరకూ నిలబడ్డారు అనేదే నిబద్ధతకు కొలబద్ద !
మళ్లీ మళ్లీ చెబుతున్నా ..
ఆరోపణలు రాజకీయమే కావొచ్చు. కానీ రాజ్యాంగ బద్ధంగా, చట్ట సహితంగా ఎంత వరకూ నైతికతతో ఉన్నాము, నిలబడ్డాము అనేదే కదా అసలు పాయింటు !
ఈ దేశంలో మహా మహా నాయకులు, తలపండిన వాళ్లు, తిరుగులేని పదవుల్లో ఉన్నవాళ్లు కూడా కేసులు ఎదుర్కొన్నారు. వాళ్లెవరూ తమకు ఉన్న అధికారాన్ని వాడి, కుర్చీలో ఉన్నాం కదా అనే అహంభావంతో తమ మీదున్న కేసుల్ని, విచారణల్ని అడ్డగోలుగా కొట్టేసుకున్న చరిత్ర మనకి కనపడదు !
వీపీ ప్రధానిగా ఉండగా జేఎంఎం ముడుపుల కేసు లాంటివి వచ్చి పడ్డాయ్. ప్రధానిగానే ఆయన కోర్టుకు హాజరయ్యారు. నిరూపణకి ఎదురు నిలిచి గెలిచారు. ఇదో ఉదాహరణ మాత్రమే !
మన పక్క రాష్ట్రం కర్ణాటకలో లోకాయుక్త అనే విధానం ఉంది. బలమైనది. నాటి ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యెడ్యూరప్ప మీద ఆరోపణలు, అవినీతి కేసులు వస్తే ఆయన ఎదుర్కొన్నారు. ఆధారాలు ఉన్నప్పుడు పదవికి రాజీనామా చేశారు తప్పితే, అధికారాన్ని వాడి తారుమారు తకరారు చేయలేదు. అంతెందుకు ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తున్నాం ! ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఎన్సీపీ చీలిక వర్గం నాయకుడు అజిత్ పవార్ తనయుడి మీద 300 కోట్ల భూ కుంభకోణం ఆరోపణలు వస్తే చివారణ జరుగుతోంది.
అంతే కానీ అధికారాన్ని వాడి, అధికారుల్ని ప్రలోభపెట్టి బయట పడటం అక్కడ వీలు కావడం లేదు. ప్రజాస్వామ్యం బతికి ఉంది, రాజ్యాంగ స్ఫూర్తి నడిపిస్తోంది అని చెప్పడానికి ఇలాంటి నిదర్శనాలు రుజువులు మన చుట్టూ ఎన్నో ఉన్నాయ్ !
మరి ఫైబర్ నెట్ కేసులో ఏం జరిగింది ?
2024కి ముందు అప్పటి జగన్ ప్రభుత్వం - ఫైబర్ నెట్ పేరుతో నిధుల దుర్వినియోగంపై, 2019కి ముందుకు జరిగిన వ్యవహారాలపై విచారణకి ఆదేశించింది. సీఆర్పీసీ 164 ప్రకారం వాంగ్మూలాలు నమోదు చేసి, ఆధారాలు సేకరించి సీఐడీ విచారణ జరిపింది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు అధికారం మారింది. బాబు సీఎం కుర్చీలో ఉన్నారు. అందుకే తన నెత్తిన తానే అక్షింతలు వేసుకొని దీవించుకున్నట్టుగా - తనకి తానే సర్టిఫికెట్ ఇచ్చుకునేందుకు తెగించారు.
అప్పట్లో ఆరోపణలు నిజం అని వాంగ్మూలం ఇచ్చిన అధికారితోనే ఇప్పుడు తిరగ వాంగ్మూలం చెప్పించి క్లీన్ చిట్ తెచ్చుకున్నారు.
333 కోట్ల టెండర్ల వ్యవహారంలో 120 కోట్లకిపైగా గోల్ మాల్ జరిగిందనేవి ఆరోపణలు. టెర్రాసాఫ్ట్ కంపెనీకి నేరుగా ప్రయోజనం చేయడంతోపాటు, అసలు ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి ఆగమేఘాల మీద తొలగించి టెండరు రేసులోకి తీసుకురావడమే కాదు, ఆ సంస్థలో పని చేస్తున్న హరిప్రసాద్ వేమూరిని ప్రభుత్వ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా నియమించడం లాంటి ఎన్నో అనుమానాస్పద అడుగులు, ఆధారాలు ఈ కేసులో ఉండగా - క్లీన్ చిట్ ఊడిపడటం నిజంగా ఆశ్చర్యమేనంటారు చాలా మంది మేధావులు !
క్లీన్ చిట్ అంటే మార్గదర్శి చిట్ అంత ఈజీనా ?
ఇండియన్ డెమోక్రటిక్ స్ఫూర్తిలో ఓ మాట ఉంటుంది. అధికారం టెంపరరీ. కానీ ప్రభుత్వం మాత్రం పర్మనెంట్ అని !
ప్రభుత్వం అంటే, మన కార్య నిర్వాహక వ్యవస్థ, అధికార యంత్రాంగం.
executive (civil services/bureaucracy), which ensures administrative continuity regardless of which political party is in power అని చెబుతారు !
అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా అధికారులు, బ్యూరోక్రసీ మాత్రం రాజ్యాంగానికి విధేయులు, బద్ధులు. అంతేతప్ప… అధికారంలో ఉన్న వాళ్లకి వంతపాడి - కేసుల మాఫీ చేసుకునేందుకు ఆయుధాలు, సాధనాలు కారాదన్నది ఉద్దేశం. ఇదే రాజ్యాంగ స్ఫూర్తి !
మనమేమో ఓ పక్కన రాజ్యాంగ దినోత్సవం పేరుతో ప్రచారం చేసుకుంటాం. చిన్నారుల్ని రంగంలోకి దించి, రాజకీయ స్కిట్లు చేయిస్తుంటాం ! రాజకీయాన్ని ముందు పెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎర్ర పుస్తకాల పేరుతో అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం !
ఆఖరికి కేసుల విషయంలో కూడా సెటిల్ మెంట్ తరహా విధానాలకు తెరతీస్తాం ! హవ్వ !
ఒకవేళ, చంద్రబాబు ఫైబర్ నెట్ విషయంలో తప్పు చేయలేదు అనుకుంటే - విచారణ ఎదుర్కోవచ్చు కదా !
న్యాయ పోరాటం చేసి గెలిచి - ఇదీ నా నిబద్ధత అని నిరూపించొచ్చు కదా !
క్లీన్ చిట్ ముద్రలు గుద్దు కోవడం ఎందుకు ? పైగా సిట్ ల పేరుతో నిరంతర రాజకీయాలు నడుపుతున్నప్పుడు - ప్రత్యర్థుల మీద ప్రయోగించేందుకు సిట్ అనే ముల్లు కర్రల్ని నిరంతరం వాడుతున్నప్పుడు ఇలా - క్లీన్ చిట్ ఇచ్చుకోవడం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మర్చిపోతే ఎలా ?
అసలు ఎన్ని కేసులు ? ముందు ముందు మరెన్నో !
2019కి ముందు, చంద్రబాబు హయాంలో జరిగిన వ్యవహారాలపై ఇంకొన్ని కేసులు కూడా ఉన్నాయ్ ! ఫైబర్ నెట్ తరహాలో ఈ కేసుల్లో కూడా క్లీన్ చిట్ కి ప్లాన్ చేస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
లిక్కర్, ఐటీ, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూములు వ్యవహారాల్లో విచారణ 2024 ఎన్నికల నాటికి జరుగుతూ ఉంది. మద్యం కేసునే తీసుకుంటే -
నోట్ ఫైల్స్ మీద సంతకాలు చేయడం, ఐదు కంపెనీలకే 69 శాతం ఆర్డర్లు ఇవ్వడం, కేబినెట్ అప్రూవల్ లేకుండా బాబు సంతకం చేశారంటూ కాగ్ తప్పు పట్టడం లాంటి వ్యవహారాలు చర్చనీయంగా ఉన్నాయ్. స్కిల్ ఆరోపణల వ్యవహారంలో డిజైన్ టెక్ కంపెనీకి 370 కోట్లకుపైగా మంజూరు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆధారాలు ఉన్నాయ్ అంటూ కేసు నమోదైంది. బాబు అరెస్టుకు ఇదే ప్రధాన కారణం కూడా అదే !
ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం కొండ చిలువలా మారిపోవడం మరో కేసు. అలైన్ మెంట్ ఉన్నట్టుండి దక్షిణానికి మూడు కిలోమీటర్లు ఎందుకు జరిగింది అని ఆరా తీస్తే అసలు లోతులు కనిపిస్తాయ్ అనేది అభియోగం !
అనుయాయుల భూములున్న ప్రాంతాలకు లబ్ది చేసేందుకు అలైన్ మెంట్ మారడం మీద ఆధారాలు, ప్రాథమిక రుజువులు ఉన్నాయ్ అని అప్పట్లో సీఐడీ క్లైమ్ చేసింది. కేసు విచారణలో ఉందిప్పుడు !
ఇక ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో బయట పడిన ఆధారాలతో కార్పొరేట్ కంపెనీల వరకూ పాకిన ఐటీ ఆరోపణల వ్యవహారం మరో అధ్యాయం.
బాబు సన్నిహితుడు, సుదీర్ఘకాలం పీఏగా కూడా పని చేసిన శ్రీనివాస్ ప్రమేయం పైన కూడా అభియోగాలు నమోదై ఈ కేసు రసపట్టులో ఉంది !
ఇక అమరావతిలో ఐదు వేల ఎకరాల అసైన్డ్ భూమల వ్యవహారంపై కూడా అఫ్పటి జగన్ ప్రభుత్వ హయాంలో అభియోగాల నమోదు, విచారణలు నడి మధ్యలో ఉన్నాయ్. ఈ వ్యవహారాలు అన్నిటిలోనూ వన్ బై వన్ క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు, తెచ్చుకునేందుకు బాబు పథక రచన చేశారు అని ఆల్రెడీ విపక్షం నుండి గట్టిగా వినిపిస్తున్న మాట ! చూడాలి ఇదే మాట నిజం అవుతుందేమో !
సిట్ ల రాజ్యంలో ఇదేం ధోరణి ?
ధార్మిక ఆరోపణల విషయంలో సిట్. నకిలీ మద్యం డంపులు బయటపడితే సిట్. సీబీఐ విచారణ అడిగినా, డిమాండ్ చేసినా కుదరదట ! సిట్ అనేదే తమ స్టాండ్ అని చెబుతారు చంద్రబాబు !
మరి అలాంటప్పుడు - 2029లో అధికారం మారితే ఏం జరుగుతుంది ? రెండు పరిణామాలు ఉంటాయ్. ఒకటి : ఇప్పటికి క్లీన్ చిట్ వ్యవహారాలను, వాటి వెనక లావాదేవీలను తిరగదోడి మళ్లీ విచారణ జరిపే నైతిక హక్కు అప్పటి ప్రభుత్వానికి ఉండి తీరుతుంది.
ఎందుకంటే అనైతికతను తిరగకొట్టడమే కదా నైతికత అంటే ! రెండోది : నీవు నేర్పిన విద్యయే - అంటే, సైడ్ ఎపెక్ట్స్ చాలానే ఉంటాయ్. ఇప్పటి సిట్ విచారణలన్నిటి మీదా క్లీన్ చిట్ వచ్చేస్తుంది. బాబు చూపిన బాటలోనే ! ఇలాంటి సంప్రదాయం తిరగబెట్టి తీరుతుంది కదా ! ఇప్పుడు విచారణల పేరుతో సాగిస్తున్న ఎత్తుగడలు, నిరంతరం అల్లుతున్న కథలు అన్నీ టైమ్ పాస్ యవ్వారాలుగా… కాలంలో కరిగిపోక తప్పదు కదా అనిపిస్తుంది !
అలాంటప్పుడు కనీసం ప్రశ్నించే హక్కు కూడా బాబుకి ఎక్కడ ఉంటుంది ?
అంటే - ఇప్పుడు ఇచ్చుకుంటున్న క్లీన్ చిట్ లు కేవలం తాత్కాలిక పైపై పూతలే అనుకోవాలేమో ! గోడకు కొట్టిన సున్నం వెలిసిపోయినట్టు - ఇలాంటి ఎత్తుగడలు వీగి - మళ్లీ విచారణలు, వాస్తవాలు బయటకు రాక తప్పదేమో ! కాకపోతే ఈ మార్గమధ్యంలో జరిగాల్సిన తతంగం చాలా ఉంది. జనం తెలుసుకోవాల్సిన, కళ్లు తెరిచి చూడాల్సిన నిక్కచ్చి నిజాలు ఎన్నో ఉన్నాయ్ !
ప్రజాస్వామ్యంలో అధికారం అంటే ధర్మకతృత్వం. నిధులు, విధులు అన్నీ ప్రజలకు చేరేలా చూడటమే ప్రభుత్వ బాధ్యత. అంతే తప్పితే -
ఆరగించడమో, అనుభవించడమో చేసే హక్కు ధర్మకర్తలకు ఎప్పటికీ ఉండదు. ఈ లాజిక్ మరచి, తమకు దక్కిన అధికారం రాజదండం అన్నట్టుగా భ్రమించి - సొంత కేసులు మాఫీ చేసుకుంటూ, మసిపూసి మారేడు చేస్తూ, ప్రత్యర్థుల్ని మాత్రం రాజకీయ శూలాలతో వెంటాడుతూ నయా సంస్కృతికి అంటు కడితే ఆంధ్రప్రదేశ్ అరణ్యం అయిపోయే ప్రమాదం పొంచి ఉంది.
అందుకే - తెలివితో, ఆలోచనతో, వివేకంతో, వివేచనతో ఆలోచించాలి. సెల్ఫ్ క్లీన్ చిట్ ల సంస్కృతిని ఆదిలోనే క్లీన్ బౌల్డ్ చేయాలి !


