ShareChat
click to see wallet page
search
💐శ్రీ మహావిష్ణు పురాణం💐 🌼గజేంద్ర మోక్షము1 🌼 సూత మహర్షి శౌనకాది మునులకు శ్రీమహావిష్ణువు లీలలలో ఒకటైన గజేంద్ర మోక్షము కథ వినిపించ సాగాడు. "శౌనకాది మునులారా! శ్రీహరి లీలలు అనంతం. అనేకం. తన భక్తులను రక్షించడానికి ఎప్పు డైనా ఎక్కడికైనా ఎలాగైనా వస్తాడు అని నిరూపించే కధ ఈ గజేంద్ర మోక్షము. తనను ఆరా ధించేవారుదేవతలు,మానవులు, దానవులు, జంతువులు, పశు పక్షులు అనే బేధం చూపకుండా వేగమే వచ్చి రక్షిస్తాడుశ్రీమన్నారా యణుడు. ఇక గజేంద్ర మోక్షము కథ చదవం.డి. పూర్వము ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ధర్మ పరిపాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ఇంద్రద్యుమ్నుడు శ్రీహరి భక్తుడు. నిత్యం అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణాయ స్మరిస్తూ ఉండేవాడు. ప్రజలందరు సుఖశాంతులతో జీవించేవారు. కుమారుడు పెరిగి పెద్దవ్వగానే వివాహం చేసి, పట్టాభిషేకం చేసి రాజ్యపాలన అప్పగించి ఇంద్రద్యుమ్నుడు భార్యతో కలసి అడవులకు వానప్రస్థానికి వెళ్లిపోయాడు. ఆశ్రమం నిర్మించుకుని మౌనదీక్ష స్వీకరించి శ్రీహరి నామం జపిస్తూ తపస్సు చేయసాగాడు. ఒకరోజు అగస్త్య మహర్షి భార్యతో, శిష్యులతో పుణ్యతీర్థాలు దర్శిస్తూ ఇంద్రద్యుమ్నుడి ఆశ్రమం వైపు వచ్చాడు. తపోనిష్ఠలో మునిగిన ఇంద్రద్యుమ్నుడు అగస్త్య మహర్షి రాకను గమనించ లేదు. అగస్త్య మహర్షి పలకరించినా కళ్ళు తెరచి చూడలేదు, మాట్లాడలేదు. అగస్త్య మహర్షి ఆగ్రహించి "ఇంద్రద్యుమ్నా! వానప్రస్థం స్వీకరించి వానప్రస్థాశ్రమ ధర్మం మరిచావు. అతిథి అభ్యాగతుల సేవ వానప్రస్థ ముఖ్య ధర్మం. ఇది మరిచి మదమెక్కిన గజము లాగా ప్రవర్తించిన నీవు ఏనుగువై జన్మిస్తావు!! ఏ శ్రీహరి నామం జపిస్తూ ధర్మం మరిచావో ఆ శ్రీహరి అనుగ్రహం కోసం తపించి పోతావు" అని శపించాడు. అగస్త్య శాపం తపస్సులో ఉన్న ఇంద్రద్యుమ్నుడి హృదయానికి బాణంలా గుచ్ఛుకుంది. చటుక్కున కళ్ళు తెరచి చూస్తే అగస్త్య మహర్షి దంపతులు కనిపించారు. మహర్షి పాదాల పై పడి కన్నీటితో కడుగుతూ తెలియక జరిగిన అపరాధాన్ని మన్నించమని ప్రాధేయపడ్డాడు. అగస్త్య మహర్షికి ఆగకుండా హరి నామ జపం చేస్తున్న ఇంద్రద్యుమ్నుడి హృదయ స్పందన తెలిసింది. కరుణాసముద్రుడై ఇంద్రద్యుమ్నుడి హరిభక్తికి సంతసించి అతనిని లేపి "ఇంద్రద్యుమ్నా! శాపం ఇచ్చింది నేనైనా, నా చేత అలా ఇప్పించినవాడు ఆ నారాయణుడే! ఈ జన్మలో నీకు మోక్షం లభించే అవకాశం లేదు. నీవు ధర్మంగా రాజ్యం చేసినా, నీ ప్రజలలో కొందరు అధర్మ కార్యాలు చేశారు. రాజువైనందున, ప్రజల పాపాల ఫలంలో కొంత భాగం నీవు అనుభవించాలి. వచ్చే జన్మలో గజరాజువై జన్మించి శ్రీహరి దర్శనం, అనుగ్రహం పొంది మోక్షమొందుతావు" అని ఆశీర్వదించి ఆతిథ్యం స్వీకరించి వెళ్లి పోయాడు. ఇంద్రద్యుమ్నుడు శ్రీహరి నామ జపం చేస్తునే కొంతకాలానికి మరణించాడు. అమృతసాగరంలో పదివేల యోజనాలు విస్తీర్ణం, ఎత్తుగల త్రికూట పర్వతము ఉంది. ఆ పర్వతానికి స్వర్ణ శిఖరం, రజత శిఖరం, లోహ శిఖరం అనే మూడు శిఖరాలు ఉన్నాయి. ఆ శిఖరాల నుండి అనేక జల ప్రవాహాలు కిందికి ప్రవహించి సరస్సులుగా మారాయి. ఆ సరస్సుల చుట్టూ దట్టమైన అరణ్యాలు ఏర్పడ్డాయి అరణ్యాలలో మృగాలు, జంతువులు అనేకం మందల మందలుగా జీవిస్తున్నాయి. ఇంద్రద్యుమ్నుడు త్రికూట అరణ్యంలో ఏనుగుగా జన్మించాడు. పూర్వజన్మ పుణ్యఫలం వలన హరిభక్తి కలిగి హరినామ స్మరణ మనస్సులో చేసేవాడు. హరిభక్తుడైన ఆ గజరాజుని అనేక ఆడ ఏనుగులు వరించి భర్తను చేసుకున్నాయి. రోజూ తన ఆడ ఏనుగుల మందతో కలసి త్రికూట అర్యణాలలో విహరిస్తూ సరస్సులలో నీరు త్రాగుతూ జలక్రీడలు ఆడేవాడు. అదే సమయంలో గంధర్వలోకం నుంచి గంధర్వ జంట (దంపతులు) త్రికూట పర్వత వనాలకు విహారానికి వచ్చి ఒక నీటి సరస్సులో జల క్రీడలు ఆడసాగారు. నీటి సుగంధ పరిమళాలకి మైమరచి ఒకరి పై ఒకరు నీళ్ళు ఆకాశంలోకి ఎత్తి ఎత్తి మీద చల్లుకుంటూ ఆడుకోసాగారు. ఆ నీటి జల్లులు గాలికి వెళ్లి సరస్సు సమీపాన తపస్సు చేసుకుంటున్న ముని మీద పడి తపోభంగం చేసాయి. ముని కోపంతో కళ్ళు తెరచి జలక్రీడలు ఆడుతున్న గంధర్వ జంటను చూసి "గంధర్వా! పవిత్ర సరోవర జలాన్ని అహంకారంతో నీ భార్యతో కలసి జలక్రీడలు ఆడి చిందర వందర చేసి తపోభంగం చేసావు. నీవు, నీ భార్య ఇదే సరస్సులో మొసళ్ళుగా జన్మించండి. నీ అహం తొలగినప్పుడే మీకు శాప విముక్తి లభిస్తుంది" అని శపించి ఆ ప్రదేశము వదలి వెళ్లి పోయాడు. గంధర్వ దంపతులు మొసళ్ళుగా మారి ఆ సరస్సులో దొరికే జలచరాలు తింటూ జీవిస్తున్నారు. అడవులలో స్వేచ్ఛగా తన ప్రియ సతులైన ఆడ ఏనుగులతో, ఏనుగు పిల్లలతో తిరుగుతున్న గజేంద్రుడు ఒకరోజు దారి తప్పి శాపగ్రస్తుడై మొసలిగా జీవిస్తున్న గంధర్వుడు ఉండే సరస్సు సమీపానికి వచ్చాడు. దారి కోసం తిరిగి తిరిగి అలసిన ఆ ఏనుగుల గుంపు సరస్సు కనపడగానే అక్కడ వృక్షాలకు గల పళ్ళు తిని దాహం తీర్చుకోవడానికి సరస్సులో దిగాయి. మధురమైన నీరు త్రాగగానే అలసట పోయి అమిత ఉత్సాహం ఇచ్చాయి. జలక్రీడల పై మోజు కలిగి సరస్సు మధ్యన గజరాజు చుట్టూ ఆడఏనుగులు చేరి తొండాలతో నీళ్లు చిమ్ముతూ ఆడ సాగాయి. తరువాత ఒకరి మీద ఒకరు చల్లుకోసాగాయి. సరస్సు జలాలు ఏనుగు ఆటలతో అల్లకల్లోలమై సుడులు తిరుగుతూ కిందకు చేరి సరస్సు అడుగున విశ్రాంతి తీసుకుంటున్న మొసలిని చికాకు పరిచాయి. ఆ మొసలి కోపంతో మహావేగంగా పైకి వచ్చి గజరాజు తొండాన్ని కరచి పట్టుకుంది. గజేంద్రుడు గట్టిగా ఘీంకరిస్తూ తొండాన్ని గట్టిగా విదిలించి మొసలిని దూరంగా నీటిలోకి విసిరివేసింది. మొసలిని చూసిన ఆడ ఏనుగులు భయపడి తమ పిల్లలతో పరిగెత్తి ఒడ్డుకి చేరాయి. దూరాన నీటిలో పడ్డ మొసలి ప్రతీకారంతో నీటిలో దూసుకువచ్చి గజేంద్రుని కాలు పట్టుకుని మరింత లోతుకి లాగసాగింది. గజేంద్రుడు ఎంత బలంగా విదిలించుకున్నా మొసలి పట్టు విడువలేదు. తన దంతాలతో మరింత గట్టిగా పట్టుకుంది. ఇరువురి మధ్య ఆధిపత్య పోరు ఆరంభమైంది. భూమి పైన ఏనుగుని మించిన బలమైన జంతువు లేదు. నీటిలో మొసలిని మించిన బలమైన జంతువు లేదు. ఈవిధంగా భూ, జల చరాలలో బలవంతులైన కరి మకరాల మధ్య ద్వంద్వ యుద్ధం ఆరంభమైంది. 💐సర్వం శ్రీకృష్ణార్పణమస్తు💐 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲 #గజేంద్ర మోక్షం ఓం నమో నారాయణయ నమః
🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 - ShareChat