* #పవన్ కల్యాణ్ న్ను బద్నాం చేస్తున్నదెవరు❓*
NOVEMBER 14, 2025🎯
డిప్యూటీ సీఎం పవన్ ఏదో చేసి, తానో ప్రత్యేక లక్షణాలు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాలని తహతహలాడుతుంటారు. ఈ క్రమంలో సంచలనమని భావించి, అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలు చేస్తుంటారు. ఆ తర్వాత పవన్ను రాజకీయంగా పవన్ను బద్నాం చేస్తుంటాయి. పవన్ రాజకీయ ప్రస్థానంలో స్థిరత్వం, విశ్వసనీయతకు చోటు వుండదు. ఎప్పుడేం మాట్లాడుతుంటారో, ఆయనకే తెలియదు.
జనసేన స్థాపించిన పదేళ్లకు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. బాబు కేబినెట్లో డిప్యూటీ సీఎం హోదాను అనుభవిస్తున్నారు. రాజకీయాల్లో జయాపజయాలు స్థిరంగా వుండవు. రుతువులు మారినట్టుగా అవి మారుతూ వుంటాయి. అయితే మాటలోనూ, రాజకీయ పంథాలోనూ నిలకడ అవసరం. అది లేకపోతే ఎక్కువ కాలం రాజకీయాల్లో రాణించలేరు.
2014 నుంచి పవన్ రాజకీయ పంథాను గమనిస్తే, ఊసరవెల్లి కంటే ఎక్కువగా రాజకీయ రంగులు మార్చిన ఘనత పవన్కే దక్కుతుందనే విమర్శ వుంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కేంద్రంపై సానుకూలంగా, వ్యతిరేకించిన సందర్భంలో తీవ్ర విమర్శలు పవన్కే చెల్లు. విభజిత ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ పవన్ గర్జించారు. ఏపీ హక్కుల సాధన కోసం పవన్ పోరాటం చేస్తారని, ఆ సందర్భంలో అంతా భావించారు.
తీరా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అధికారం అండ లేనిదే నెలలైనా వుండలేనని నిరూపించుకున్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నీడలో ఆయన సేదదీరారు. వైసీపీపై తీవ్ర విమర్శలకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ఏకంగా 30 వేల మందికి పైగా అమ్మాయిలు అదృశ్యమైనట్టు తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని ఆరోపించి ఆశ్చర్య పరిచారు. అలాగే సుగాలి ప్రీతి కేసులో అదేదో జగన్ హయాంలో జరిగినట్టు పవన్ చేయని ఆరోపణ లేదు.
అధికారంలోకి వచ్చిన తర్వాత, తానేమీ చేయలేనని చేతులెత్తేయడం పవన్కే చెల్లింది. తనను విమర్శించిన వారిపై ఎదురు దాడికి దిగారు. అలాగే అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలలో వాడిన నెయ్మిలో కల్తీ జరిగిందని అలవోకగా ఆయన ఆరోపించారు. అయితే అలాంటిదేమీ లేదని నెయ్యి కల్తీపై విచారణ జరుపుతున్న సిట్ తేల్చి చెప్పింది. తప్పుడు ఆరోపణలు చేసిన నాయకుడిగా ప్రజల ముందు పవన్ నిల్చోవాల్సి వచ్చింది.
తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 70 ఎకరాలకు పైగా అటవీ భూమి ఆక్రమించారని. వీడియోతో సహా ఆయన విడుదల
చేశారు. కానీ అటవీ అధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదని, 30 ఎకరాల ఆక్రమణపై కేసు నమోదు చేశామని ప్రకటించారు. రాజకీయ సంచలనాలు, చంద్రబాబు మెప్పుకోసం పవన్ ఆధారాల్లేకుండా మాట్లాడుతున్నారనే అభిప్రాయాన్ని కలిగించారు.
ఇవన్నీ కూడా రాజకీయంగా పవన్ను బద్నాం చేస్తున్నాయి. చివరికి సొంత వాళ్ల దృష్టిలో కూడా ఆయన అభాసుపాలవుతున్నారు. ఎందుకిలా మాట్లాడుతున్నారనే చర్చకు తెరలేచింది. తప్పుడు వివరాలు అందిస్తుస్తున్నదెవరు? ఎందుకు తనతోనే మాట్లాడిస్తున్నారనే విషయాలపై పవన్ ఆలోచించుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత భ్రష్టు పట్టే ప్రమాదం వుందని విశ్లేషకుల అభిప్రాయం.


