🧿 యద్భావం తద్భవతి 🧿
🧿
669 views • 12 days ago
🙏🙏🌹🌿వాల్మీకి జయంతి :🌿🌹🙏🙏🙏🙏
__________________________________________
నేడు వాల్మీకి మహర్షి జయంతి. ఏ యుగాల నాటిది రామకథ. ఇప్పటిదా! నేటికీ నిత్యనూతనంగానే ఉంది. మౌఖికంగానూ, అక్షరాకృతిలోనూ రామాయణం లేని భాష లేదు. రామకథకు ఎల్లలు లేవు. భాష, ప్రాంతం వంటి స్థాయీ భేదాలు లేవు. ఏమి రామకథా మహత్తు! కోట్లాది ప్రజల మనసులు గెలిచింది. నిత్యపారాయణ గ్రంథంగా మారింది. అంతగొప్ప సాహిత్యాన్ని సృష్టించిన వాల్మీకి కవి హృదయం ఎంత గొప్పది!
‘వాల్మీకి’ అనే కోకిల... రామకథా సుధను తన తపశ్శక్తితో పానం చేసి, ఆ మధురిమను తను రచించిన రామాయణం ద్వారా మనకు అందించాడు. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణంలో నిహితమయ్యాయని విజ్ఞుల అబిప్రాయం. వైదికమైన మంత్ర పద్ధతులను అనుసరించి వాల్మీకి ఈ కావ్యరచన చేశాడంటారు.
‘నానృషిః కురుతే కావ్యం’ అనే ఆర్ష సూక్తికి నిలువుటద్దం వాల్మీకి. .వాల్మీకి దక్క అన్యుడెవరు సుకవి శబ్ద వాచ్యుడు?’ అంటూ వాల్మీకికి ప్రణతులిడిన తరువాతే తన ‘రామాయణ కల్పవృక్షా’న్ని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఆరంభించారు. ఇలా ఎందరో వాల్మీకిని సంస్మరించుకొని, రామాయణ కావ్యాన్ని తమ ఆలోచనలకు అనుగుణంగా రచించారు. దాదాపు ప్రపంచ భాషలన్నిట్లోనూ వాల్మీకి రామాయణం తర్జుమా అయింది. తెలుగులో శతాబ్దాల నుంచి ఆయా కవులు శ్రీరామనామ మాధుర్యాన్నీ, రాముని ఆదర్శాలనూ తమతమ రచనల్లో విశేషంగా చాటారు.
ఇక వాల్మీకికి సంబంధించిన కథలెన్నో ఉన్నాయి. అయితే ప్రామాణికమైన తన కథను రామాయణ కావ్యంలో వాల్మీకే స్వయంగా చెప్పుకున్నాడు. ‘ప్రచేత సోహం దశమః పుత్రో రాఘవ నందన’... ‘బ్రహ్మ మానస పుత్రుడైన ప్రచేతసనుడి పదో కుమారుణ్ణి నేను’ అని శ్రీరాముడికి ‘ఉత్తర కాండ’లో వాల్మీకి చెప్పాడు. వాల్మీకి, శ్రీరాముడు ప్రత్యక్షంగా సంభాషించుకున్నది ఈ సన్నివేశంలోనే. అంతకుముందు శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ, మునివాటికలను సందర్శిస్తున్న సమయంలో, చిత్రకూటం వైపు వెళ్తూ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఆతిథ్యం కూడా స్వీకరించాడు. ఆనాడది ఆ సందర్భానికి అనుకూలమైన పరిచయం మాత్రమే.
తపోనిష్ఠాగరిష్టుడైన వాల్మీకి హృదయంలో దివ్య సంకల్పం కలిగింది. ‘పరిపూర్ణ మానవుడు ఈ లోకంలో ఉన్నాడా?’ అనే ప్రశ్న ఉదయించింది. వాల్మీకి ప్రశ్నకు తపస్వి అయిన నారదుడు సమాధానం చెప్పాడు. వాల్మీకి అడిగినదానికన్నా ఎక్కువే చెప్పాడు. ఆ క్షణంలోనే రామకథకు బీజం పడింది.
ఒక రోజు శిష్యుడు భరద్వాజునితో కలిసి మాధ్యాహ్నిక సంధ్యావందనం నిమిత్తం తమసా నదికి వాల్మీకి వెళుతూండగా ఒక చెట్టు కింద క్రౌంచ పక్షులు క్రీడిస్తున్నాయి. ఒక బోయవాడు మగ పక్షిని కూల్చడం వాల్మీకి కంట పడింది. ఆయన హృదయం ద్రవించింది. శోకతప్తుడైన వాల్మీకి కంఠం నుంచి కోకిల గానంలా ఒక శ్లోకం పుట్టింది.
‘మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీస్సమాః యత్ క్రౌంచ మిధునాదేకం అవధీః కామమోహితమ్’ అంటూ వెలువడిన ఆ శ్లోకం ఆయననే ఆశ్చర్యపరచింది. శిష్యుడు గురువును అభినందించాడు. కానీ ఒక వ్యక్తిని అభిశంసించినందుకు వాల్మీకి బాధపడ్డాడు. అదే సమయంలో బ్రహ్మ సాక్షాత్కరించి, ‘రామకథా రచనకు అర్హుడైన రుషివి నీవే’ అని అభినందించాడు. నిజానికి ఈ శ్లోకం అభిశంసన కాదు. రామకథకు మంగళాశాననం. ‘మా’ అంటే ‘లక్ష్మీదేవితో’... ‘నిషాద’ అంటే ఎల్లప్పుడూ నివసించేవాడని అర్థం. మగపక్షిని కామమోహితుడైన రావణుడికి ప్రతీకగా తీసుకుంటే ఆ శ్లోకంలో అంతర్గతంగా రామాయణ కథ దాగి ఉన్నట్టు తెలుస్తుంది. తపస్సంపన్నుడైన వాల్మీకి నోటి నుంచి వచ్చిన ఈ శ్లోకం రామాయణానికి మూలం. బ్రహ్మ దీవెనల కారణంగా వాల్మీకికి జరిగిన, జరుగుతున్న, జరగబోయే రామకథ యావత్తూ మనో ఫలకం మీద గోచరమయింది. దాన్ని రచించడానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఆదికావ్యమైన రామాయణం అవతరించింది. వేద హృదయానికి అక్షరరూపంగా నిలిచింది. ‘వేదః ప్రాచేతసాత్ అసీత్ సాక్షాద్రామాయణాత్మనా!’... శ్లోకబద్ధమైన రామకథను మరోహరంగా అందించాడు వాల్మీకి. భగవదవతారమైన రాముణ్ణి మానవమాత్రుడిగా చిత్రించి, మానవ సమాజం అనుసరించాల్సిన ఆదర్శాలను ఆయా పాత్రల ద్వారా తెలియజెప్పాడు. మానవ జీవితాలకు మార్గదర్శనం చేసే దివ్య జీవన సుధను రామకథ ద్వారా లోకంతో పానం చేయించాడు. ‘ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం’... ‘నేను సామాన్య మానవుణ్ణి, దశరథ కుమారుణ్ణి’ అని రామునితో చెప్పించాడు. సమాజంలో ఎవరు ఎలా మెలగాలో బోధించాడు.
సత్యం, ధర్మం లోకానికి రెండు కళ్ళు. వాటిని పరిత్యజిస్తే లోకం మనుగడ సాగించలేదు. అధర్మం నుంచి ధర్మం వైపు, అసత్యం నుంచి సత్యసంధత వైపు నడిపించాలన్నదే వాల్మీకి ఆశయం, ఆదర్శం. అందుకే రాముణ్ణి కథానాయకునిగా, గొప్ప రాజ్యాధినేతగా నిలబెట్టాడు. వివాహబంధం, పాతివ్రత్యం, కుటుంబ బంధం, పాలనా విధానం, రాజు ఆచరించాల్సిన నియమాలూ... ఇలా ఎన్నిటినో పాత్రల ద్వారా పలికించాడు. ప్రతికూల పాత్రలు కూడా ఉత్తమ గుణాలైన సత్యధర్మాలను శ్లాఘించేలా చేశాడు. మారీచుడి నోట ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనిపించాడు.
మాతృభూమిపై రాముణ్ణి మించిన భక్తిపరాయణుడు లేడు. రావణ వధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుడు తన వద్ద కొన్నాళ్ళు ఉండాలని రాముణ్ణి ప్రార్థించగా, ‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటూ ఒళ్ళు పులకరించే మాట చెప్పించిన వాల్మీకి హృదయం ఎంత విశాలమో అర్థమవుతుంది. ఇలాంటివి ఎన్నో సూక్తులు రామకథలో వాల్మీకి వినిపించాడు. అందుకే వాల్మీకి కోకిల పలికించిన రామ కథా సుధ చెవులకు అమృతంలాంటిది.🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌿🌿🌹🙏
__________________________________________
HARI BABU.G
___________________________________________
#✌️నేటి నా స్టేటస్ #😃మంచి మాటలు #🌅శుభోదయం
#మహర్షి వాల్మీకి జయంతి జై వాల్మీకి జై జై వాల్మీకి🙏🙏🙏🙏💪💪💪💪🌹🌹🌹🌹🌺🌺🌺🌺 #🕉️🌹💐🙏 శ్రీ వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు 🙏💐🌹🕉️
9 likes
9 shares