2022 అక్టోబర్ 9న బెంగళూరులోని సద్గురు సన్నిధిలో జరిగిన నాగ ప్రతిష్ఠ నుండి దృశ్యాలు. ప్రతిష్ఠాపన 2022 అక్టోబర్ 9న ఆశ్వయుజ పౌర్ణమి రాత్రి జరిగింది.
సద్గురు: 800 సంవత్సరాలకు పైగా సరైన నాగ ప్రతిష్ట ఎక్కడా జరగలేదు. ఎందుకు నాగా? దురదృష్టవశాత్తు, నాగా లేదా సర్పం అంటే, దాన్ని కేవలం పాకే జీవిగా చూస్తున్నారు. నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పాములను దుష్టశక్తులుగా కూడా పరిగణిస్తున్నారు. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మినహాయింపు లేకుండా - ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మెసపొటోమియా, గ్రీస్, క్రీట్, మధ్య ఆసియా, చైనా ఇంకా నిస్సందేహంగా భారత్ మరియు ఆసియాలోని మిగిలిన ప్రాంతాలలో - సర్పం లేదా నాగ ఆరాధన వేల సంవత్సరాలుగా నాగరికత అభివృద్ధిలో విడదీయరాని భాగంగా ఉంది. కానీ గత 1500 సంవత్సరాలలో, ఈ నాగ ఆరాధన నిర్మూలనకు గురైంది.
నాగ అనేది కేవలం ఆరాధన గురించి కాదు, ఇది కొత్త సంభావ్యతలను అందుబాటులోకి తేవడం గురించి. పాము, ముఖ్యంగా నాగుపాము యొక్క ప్రధాన లక్షణం దాని గ్రహణశక్తి. ఇది పాకే జీవి అని ప్రజలు భావించవచ్చు, కానీ శివుడు దానిని తన పాదాల వద్ద కాకుండా తన తల పక్కన పెట్టుకున్నాడు. అతను నాగాను తనతో సమానంగా చూస్తాడు. తద్వారా ఏం చెప్తున్నాడంటే, "గ్రహణశక్తి మరియు జ్ఞానంలో, అది నాతో సమానం" అని చెప్తున్నాడు.
మరొక అంశం ఏమిటంటే, ఆధునిక విజ్ఞానం మానవ మెదడులో సరీసృప మెదడు ఉనికిని గుర్తించింది. ఈ సరీసృప మెదడు మన మనుగడ ప్రవృత్తులకు పునాది. ఈ ప్రపంచంలో మనం జీవించగలిగే సామర్థ్యం ప్రాథమికంగా ఈ సరీసృప మెదడు వల్లనే. నాగ మీ ఉనికి యొక్క ఆ కోణానికి సంబంధించినది, ఆ అంశాన్ని ఉత్తేజితం చేయడం ద్వారా మీ మనుగడ ప్రక్రియ ఒక ఆట అవుతుంది.
ప్రస్తుతం మానవ జీవితంలోని అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే, ప్రజలు కేవలం మనుగడ సాగించడానికే తమ మొత్తం జీవిత కాలాన్ని వెచ్చిస్తున్నారు. మానవ జీవితం జీవనోపాధి సంపాదించడం గురించి కాదు; దీని నుండి జీవితాన్ని నిర్మించుకోవడం గురించి. మీ మెదడులో వెయ్యో వంతు భాగం మెదడు ఉన్న పురుగులు మరియు కీటకాలు మనుగడ సాగించగలుగుతున్నాయి. అయితే, ఎంతో మేధస్సు, గ్రహణశక్తి మరియు అనుభవాల లోతు కలిగిన మనుషులు, దురదృష్టవశాత్తు తమ మొత్తం జీవితం జీవనోపాధి సంపాదించడం గురించే అని నమ్మేలా నూరిపోశారు.
నాగా యొక్క ఉద్దేశ్యం జీవనోపాధి సంపాదించడం లేదా మనుగడ ప్రక్రియను చాలా సరళంగా, ఉత్సాహభరితంగా చేయడం, తద్వారా మీ మేధస్సును మీ ఆధ్యాత్మిక ఉన్నతికై వెచ్చించవచ్చు - ప్రస్తుతం మనకున్న పరిమితులను దాటి ముందుకెళ్ళేలా చేయడం.
#sadhguru #SadhguruTelugu #nagapanchami #snake